CS Karnan
-
కర్ణన్‌కు బెయిల్
సాక్షి, చెన్నై: రిటైర్డ్ న్యాయమూర్తి కర్ణన్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. న్యాయమూర్తులు, న్యాయ లోకానికి వ్యతిరేకంగా రిటైర్డ్ న్యాయమూర్తి కర్ణన్ వీడియో విడుదల చేయడం వివాదానికి దారి తీసిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై ఓ కేసు విచారణ సమయంలో హైకోర్టు తీవ్రంగానే స్పందించింది. కర్ణన్‌ను ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించింది. డీజీపీ, చెన్నై పోలీసు కమిషనర్లకు నోటీసులు సైతం జారీ అయ్యాయి. దీంతో కర్ణన్‌ను ఇటీవల అరెస్టు చేశారు. జైలులో ఉన్న కర్ణన్ బెయిల్ మంజూరు చేయాలని మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. తొలుత ఆయన బెయిల్ పిటిషన్‌ను న్యాయమూర్తి భారతీ దాసన్ బెంచ్ తిరస్కరించింది. దీంతో మరోసారి బెయిల్ కోసం విజ్ఞప్తి చేసుకున్నారు. మంగళవారం సాయంత్రం సాగిన విచారణలో వాదనల అనంతరం కర్ణన్‌కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ న్యాయమూర్తి ఆదేశాలు ఇచ్చారు. -
స్త్రీలపై అనుచిత వ్యాఖ్యలు.. సీఎస్ కర్ణన్ అరెస్ట్
చెన్నై: సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రిటైర్డ్ జడ్జి సీఎస్ కర్ణన్ని చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పాండిచ్చేరి కర్ణన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణన్ మహిళలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల భార్యలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లో పేర్కొన్నారు మాజీ జస్టిస్ కర్ణన్ న్యాయవ్యవస్థలోని మహిళా సిబ్బందిపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేయడమే కాక సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. ఓ వీడియోను ఇంటర్నెట్లో షేర్ చేశారు. అంతేకాక కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో కొందరి పేర్లను కూడా వీడియాలో వెల్లడించారు. 2017 లో, కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న కాలంలో, జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కర్ణన్ తన జైలు శిక్ష అనుభవించారు. -
న్యాయవ్యవస్థ నవ్వులపాలైంది
జస్టిస్ కర్ణన్ కేసు విషయంలో సుప్రీంకోర్టు వ్యాఖ్య న్యూఢిల్లీ: కలకత్తా హైకోర్టు మాజీ న్యాయమూర్తి సీఎస్ కర్ణన్ వల్ల న్యాయవ్యవస్థ నవ్వులపాలైందని సుప్రీంకోర్టు పేర్కొంది. ఆయన మొరటుగా, పొగరుగా, కోర్టును ధిక్కరిస్తూ చేసిన పనులు శిక్షార్హమైనవని కోర్టు వ్యాఖ్యానించింది. కర్ణన్‌కు విధించిన ఆరు నెలల జైలు శిక్షకు సంబంధించిన పూర్తి తీర్పును సుప్రీంకోర్టు బుధవారం వెబ్సైట్లో పెట్టింది. సిట్టింగ్ జడ్జికి శిక్ష వేస్తూ తీర్పునివ్వాల్సిరావడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది. కర్ణన్ కేసు విషయంలో తాము జోక్యం చేసుకుని ఆదేశాలిస్తున్న సమయంలో ఆయన మరింత దురుసుగా ప్రవర్తించారంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం మే 9న ఈ తీర్పును క్లుప్తంగా ఇవ్వడం తెలిసిందే. జడ్జీల నియామక ప్రక్రియను సమీక్షించాలి ఉన్నత న్యాయస్థానాలకు న్యాయమూర్తులను నియమించే విధానాన్ని సమీక్షించాల్సిన అవసరాన్ని కర్ణన్ కేసు ఎత్తిచూపుతోందని జస్టిస్ చలమేశ్వర్, జస్టిస్ రంజన్గొగోయ్లు తమ ఆదేశాల్లో పేర్కొన్నారు. అలాగే న్యాయమూర్తుల ప్రవర్తన సరిగా లేనప్పుడు వారిని అభిశంసించకుండానే దిద్దుబాటు చర్యలు చేపట్టడానికి ఓ న్యాయ యంత్రాగాన్ని కూడా ఏర్పాటు చేయాలని వారు సూచించారు. -
కోయంబత్తూరులో జస్టిస్ కర్ణన్ అరెస్ట్
-
కోయంబత్తూరులో జస్టిస్ కర్ణన్ అరెస్ట్
కోయంబత్తూరు : గత కొంతకాలంగా అజ్ఞాతంలో ఉన్న జస్టిస్ సీఎస్ కర్ణన్ ఎట్టకేలకు పోలీసులకు చిక్కారు. మంగళవారం ఆయనను తమిళనాడులోని కోయంబత్తూరులో అరెస్ట్ చేసినట్లు కర్ణన్ తరఫు లాయర్లు వెల్లడించారు. కర్ణన్‌ను పోలీసులు కోల్‌కతా తరలిస్తున్నారు. కాగా అరెస్టును ఎదుర్కొంటూ అజ్ఞాతంలో ఉండి పదవీ విమరణ చేసిన తొలి న్యాయమూర్తిగా దేశ న్యాయచరిత్రలో కర్ణన్ నిలిచిపోయారు. పదవిలో ఉండగా అరెస్టును ఎదుర్కొన్న న్యాయమూర్తిగా ఇప్పటికే పేరుపొందిన ఆయన.. కోర్టు ధిక్కారం నేరంపై సుప్రీంకోర్టు విధించిన జైలు శిక్ష నుంచి తప్పించుకు తిరుగుతున్నారు. మే9న సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ధర్మాసనం కర్ణన్‌ను అరెస్టు చేయాలని ఆదేశించినప్పటి నుంచి ఆయన పరారీలో ఉన్నారు. జైలు శిక్షపై స్టే కోసం సుప్రీం సెలవుకాల ధర్మాసనానికి పలుమార్లు విజ్ఞప్తి చేసినా ఊరట లభించలేదు. కోర్టు ధిక్కారనేరంపై తనను శిక్షించడం కుదరదని, తీర్పును రద్దు చేయాలని, తదుపరి విచారణపై స్టే విధించాలని మే 12న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీం తీర్పుపై జోక్యం చేసుకోవాలని కర్ణన్ తరఫు న్యాయవాదులు రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. కాగా జస్టిస్ కర్ణన్ అరెస్టుకు సహకరించాలని కోరుతూ తమిళనాడు డీజీపీ రాజేంద్రన్‌కు పశ్చిమ బెంగాల్ డీజీపీ గత సోమవారం లేఖ రాసిన విషయం తెలిసిందే. -
ఐయామ్ మెంటల్లీ ఫిట్, పరీక్షలు వద్దు
కోల్‌కతా: కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్.కర్ణన్ గురువారం వైద్య పరీక్షలకు నిరాకరించారు. తన మానసిక స్థితి బాగానే ఉందని, తాను మంచిగానే ఉన్నానని ఆయన అన్నారు. కాగా కర్ణన్ మానసిక పరిస్థితిపై నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలతో నలుగురు సభ్యుల వైద్య బృందం గురువారం ఉదయం జస్టిస్ కర్ణన్ నివాసానికి వెళ్లింది. అయితే ఆయన మాత్రం వైద్య పరీక్షలను తిరస్కరించారు. ఒక జడ్జిని చులకన చేయటంతోపాటు వేధించేలా సుప్రీంకోర్టు ఆదేశాలున్నాయని కర్ణన్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ఇటువంటి వైద్య పరీక్షలను చేపట్టే సమయంలో సంరక్షకుల సమ్మతిని తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉందని, అయితే తన కుటుంబ సభ్యులెవరూ అందుబాటులో లేరని, వారి సమ్మతిని తీసుకునే వీలులేనందున తనకు ఏ విధమైన వైద్య పరీక్షలు చేయడానికి వీల్లేదని వైద్యులకు స్పష్టం చేశారు. ఒకవేళ బలవంతంగా తనకు వైద్య పరీక్షలు నిర్వహిస్తే అది చట్టవిరుద్దమని కర్ణన్ పేర్కొన్నారు. కోల్‌కతా ప్రభుత్వ ఆస్పత్రిలోని వైద్య బృందంతో జస్టిస్ కర్ణన్ మానసిక స్థితిని అంచనా వేసి నివేదిక సమర్పించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందుకు సంబంధించి ఈ నెల 8వ తేదీలోగా న్యాయస్థానానికి నివేదిక సమర్పించాలని సూచించింది. వైద్య బృందానికి అవసరమైన సాయం అందించేందుకు పోలీసు అధికారుల బృందాన్ని కూడా వెంట పంపాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేఎస్ కేహార్ ఆధ్వర్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఆదేశాలిచ్చింది. కాగా దేశవ్యాప్తంగా కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు అవినీతిపరులంటూ జస్టిస్ కర్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం మార్చిలో విచారణ చేపట్టగా.. కర్ణన్ హాజరు కాలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అయితే దీనికి కూడా కర్ణన్ స్పందించలేదు సరికదా.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే సమన్లు జారీ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. -
జస్టిస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు
సుప్రీంకోర్టు ఆదేశం న్యూఢిల్లీ: కోర్టు ధిక్కార ఆరోపణలు ఎదుర్కొంటున్న కోల్‌కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీఎస్ కర్ణన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఈ కేసులో సోమవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఆయన మానసిక పరిస్థితి తెలుసుకునేందుకు వైద్యుల బృందాన్ని ఏర్పాటు చేసి, పరీక్షలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది. జస్టిస్ కర్ణన్‌ను పరీక్షలకు తరలించేందుకు, వైద్యులకు సహకరించేందుకు పోలీసు అధికారుల బృందాన్ని ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్డు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఖేహర్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం పశ్చిమ బెంగాల్ డీజీపీకి ఆదేశాలు జారీ చేసింది. ఈ నెల 4న కోల్‌కతా ప్రభుత్వాసుపత్రిలో కర్ణన్‌ను పరీక్షించి.. 8లోగా న్యాయస్థానానికి నివేదిక సమర్పించాలని సూచించింది. జస్టిస్ కర్ణన్ సోమవారం కూడా కోర్టుకు గైర్హాజరయ్యారు. ఈ కేసులో తదుపరి విచారణను ఈ నెల 18కి వాయిదా వేసింది. ఈ విషయంలో కర్ణన్ ఏమైనా చెప్పాలనుకుంటే అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం స్పష్టం చేసింది. లేదంటే ఆయన చెప్పేదేమీ లేదని అర్థం చేసుకోవాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. దేశవ్యాప్తంగా కొందరు న్యాయవాదులు, న్యాయమూర్తులు అవినీతిపరులంటూ జస్టిస్ కర్ణన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ విషయంపై సర్వోన్నత న్యాయస్థానం మార్చిలో విచారణ చేపట్టగా.. కర్ణన్ హాజరు కాలేదు. దీంతో ఆయనపై కోర్టు ధిక్కార కేసు నమోదైంది. అయితే దీనికి కూడా కర్ణన్ స్పందించలేదు సరికదా.. ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికే సమన్లు జారీ చేసి మరోసారి వార్తల్లోకెక్కారు. వైద్య పరీక్షలకు వెళ్లేది లేదు: కర్ణన్ వైద్య పరీక్షలు చేయాలంటూ ఆదేశించిన నేపథ్యంలో సుప్రీంకోర్టుపై జస్టిస్ సీఎస్ కర్ణన్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తన మానసిక స్థితిని పరీక్షించే హక్కు సుప్రీంకోర్టుకు లేదని ఆయన వ్యాఖ్యానించారు. వైద్య పరీక్షలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించనన్నారు. దళితుడిని కాబట్టే తనను అవమానిస్తున్నారని అన్నారు. తనను ప్రశ్నిస్తున్న జడ్జీలంతా అవినీతిపరులేనని కర్ణన్ దుయ్యబట్టారు. ‘ఆ ఏడుగురు న్యాయమూర్తులను ఎయిమ్స్ ఆసుపత్రిలో మానసిక వైద్యుల బృందంతో తగు పరీక్షలు చేయించేందుకు తీసుకెళ్లాలి’అని ఢిల్లీ డీజీపీని ఆదేశిçస్తూ సంతకం చేసిన ఆదేశాన్ని జస్టిస్ కర్ణన్ మీడియాకు సమర్పించారు.