చెన్నై: సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుగాను రిటైర్డ్ జడ్జి సీఎస్ కర్ణన్‌ని చెన్నై సైబర్ క్రైమ్ వింగ్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. అంతకుముందు బార్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, పాండిచ్చేరి కర్ణన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాల్సిందిగా మద్రాస్ హై కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కర్ణన్ మహిళలతో పాటు సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల భార్యలపై సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు చేసినందుకు క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో పేర్కొన్నారు
మాజీ జస్టిస్ కర్ణన్ న్యాయవ్యవస్థలోని మహిళా సిబ్బందిపై జరిగే లైంగిక దాడులకు సంబంధించి పలు వ్యాఖ్యలు చేయడమే కాక సుప్రీం కోర్టు, హై కోర్టు న్యాయమూర్తుల భార్యలను ఉద్దేశించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ.. ఓ వీడియోను ఇంటర్‌నెట్‌లో షేర్ చేశారు. అంతేకాక కొంతమంది సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తులు మహిళా సిబ్బందిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. వారిలో కొందరి పేర్లను కూడా వీడియాలో వెల్లడించారు. 2017 లో, కలకత్తా హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్న కాలంలో, జస్టిస్ కర్ణన్ కోర్టు ధిక్కారానికి పాల్పడినందుకు గాను సుప్రీం కోర్టు ఆయనకు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కర్ణన్ తన జైలు శిక్ష అనుభవించారు.
Comments
Please login to add a commentAdd a comment