అడవినీ అమ్మేశారు..
పీసీపల్లి, న్యూస్‌లైన్ : అడవిని రక్షించాల్సిన అధికారులే కనిగిరి ప్రాంతంలో అటవీ సంపదను యథేచ్ఛగా అమ్ముకున్నారనే ఆరోపణలు వినవస్తున్నాయి. అధికారులు గతంలో ఎర్రచందనం తరలించి రూ. లక్షలు పోగేసుకున్న విషయం తెలిసిందే. తాజాగా సిరిమేని కర్ర, పులిందల కర్ర నరికేస్తున్న దళారులు, కొందరు రైతులకు అధికారులు దన్నుగా నిలిచారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మండలంలోని లక్ష్మక్కపల్లి, లింగన్నపాలెం గ్రామాల్లో అటవీ ప్రాంతాలు ఉన్నాయి.
ఈ గ్రామాల పరిధిలో భూములు విస్తారంగా ఉండటంతో రైతులు పొగాకును ఎక్కువగా సాగు చేస్తారు. మూడు గ్రామాల్లో దాదాపుగా 30 బ్యారన్‌లకుపైగా ఉన్నాయి. పొగాకు కాల్చేందుకు కర్ర అవసరం కాగా రైతులు అటవీశాఖాధికారులతో బేరం కుదుర్చుకుని అడవిని నరికేస్తున్నారు. తొలుత అన్ని బ్యారన్లకు కలిపి రూ.25 వేలు డిమాండ్ చేసిన అధికారులు.. తీరా రైతులు డబ్బులివ్వబోగా ఒక్కో బ్యారన్‌కు రూ.25 వేలు డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు. కర్ర నరికి వేస్తున్న దళారులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఏటా పొగాకు క్యూరింగ్ సీజన్లో అటవీ కర్ర బ్యారన్ల పాలు కావడం సర్వసాధారణమైంది. ఈ ఏడాది ఆకినీడు, మాలకొండ అడవులు, పీసీపల్లి మండలం కొప్పుకొండ, పాలకొండ అడవుల్లో కూలీలను పెట్టి మరీ చెట్లను నరికిస్తున్నారు.
అటవీ శాఖాధికారులు ప్రధాన రోడ్లకే పరిమితమయ్యారు. గ్రామాలకు వెళ్లి అడవులను ఏనాడూ పరిశీలించిన దాఖలాలు లేవు. అడవిలో చెట్లను యథేచ్ఛగా నరికివేస్తుంటే పట్టించుకోని అధికారులు.. పట్టా భూముల్లో చెట్లను నరికి అమ్ముకుంటున్న రైతులపై తమ ప్రతాపం చూపుతున్నారు. ఇటీవల పెదయిర్లపాడులో పట్టాభూమిలో టేకు మొక్కలు కొట్టుకుని చిన్న కుర్చీ తయారు చేసుకుంటున్న చిరు వ్యాపారిపై దాడి చేసి రూ.8 వేల జరిమానా కట్టించుకుని రశీదు కూడా ఇవ్వకుండా వెళ్లారు. కలప అక్రమ రవాణా పేరిట రైతులకు వేల రూపాయల అపరాధ రుసుం విధించి వేధిస్తున్నారు. వెయ్యి చలానా మాటున రూ.10 వేలకుపైగా వసూలు చేస్తున్నారని పీసీపల్లి, అలవలపాడు, కోదండరామపురం రైతులు ఆరోపిస్తున్నారు. అటవీ కార్యాలయంలోని ఎర్రచందనం దొంగల పాలైతే పట్టించుకోని అధికారులు.. అడవులనేమి రక్షిస్తారని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కనిగిరి రే ంజి పరిధిలో అటవీ సంపదను కాపాడాలని ప్రజలు కోరుతున్నారు. ఈ వ్యవహారంపై డీఎఫ్ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా రైతులు నరికిన కలప అడవిదైతే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.