కార్లకు కరెంటు బంకులు
పెట్రోల్, డీజిల్ కంటే కరెంటు చాలా చౌక. ఈ విషయం అందరికీ తెలుసు. అయినాసరే.. మనం పెట్రోల్, డీజిల్ కార్లనే ఎందుకు వాడుతున్నాం?! ఎందుకంటే.. ఎలక్ట్రిక్ కార్లు ఉన్నా.. వాటిని చార్జ్ చేసుకునేందుకు గంటల సమయం పడుతుంది. ఒకవేళ ఫుల్గా చార్జ్ చేసుకుని రోడెక్కినా బ్యాటరీలు ఖాళీ అయితే పెట్రోలు బంకుల్లా వీధి చివరల్లో ఛార్జింగ్ స్టేషన్లు లేవాయే! సరిగ్గా ఈ అసౌకర్యాన్ని సరిద్దిందుకే చైనా రంగంలోకి దిగింది. ఇంకో పది, పదిహేనేళ్లలో ఎలాగూ పెట్రోలు, డీజిల్ కార్లు కనుమరుగవుతాయి కాబట్టి.. విద్యుత్ కార్ల కోసం చార్జింగ్ స్టేషన్లను డిజైన్ చేయాల్సిందిగా షాంఘై ప్రభుత్వం ఈడీన్ ల్యాబ్ అనే సంస్థను సంప్రదించింది. వాళ్లు డిజైన్ చేసిన వినూత్నమైన చార్జింగ్ స్టేషన్లు పక్క ఫొటోల్లో కొలువుదీరాయి చూడండి.
ఒక్కో ఫొటోను కాస్త జాగ్రత్తగా గమనిస్తే.. గాజు డిజైన్లోపల కార్లు కనిపిస్తాయి. బాగానే ఉందిగానీ.. మరీ అంత ఎత్తు ఎందుకు అనుకుంటున్నారా? ఒకేసారి బోలెడన్ని కార్లను ఇక్కడ చార్జ్ చేసుకోవచ్చు పెట్రోల్, డీజిళ్ల మాదిరిగా క్షణాల్లో అయిపోయే వ్యవహారం కాదు కదా.. అందుకన్నమాట. అలాగనీ ఇక్కడ విద్యుత్ కార్లను చార్జ్ చేసేందుకు గంటల సమయం పట్టదు. ఒక్కో టవర్లో కనీసం 12 కార్లను చార్జ్ చేసేందుకు అవకాశం ఉండగా.. రెండు రకాలుగా చార్జ్ చేసుకోవచ్చు. సూపర్ చార్జ్ ద్వారా కేవలం 25 నిమిషాల్లో మీ కారు పూర్తిస్థాయిలో శక్తి నింపుకోగలదు.
దీంతో కనీసం వందమైళ్ల దూరం ప్రయాణించవచ్చునని, ఏసీ, డీసీ కరెంట్లు రెండిటినీ ఏకకాలంలో వాడటం ద్వారా బ్యాటరీలు వేగంగా నిండేందుకు అవకాశం ఏర్పడుతుందని అంటోంది ఈడీన్ ల్యాబ్స్. ఇక రెండో ఆప్షన్ను వాడుకుంటే టవర్లో కారు పార్క్ చేసి ఓ ఐదు గంటలు అటు ఇటు తిరగాల్సి వస్తుంది. రకరకాల సైజులున్న కార్లను కూడా ఒకే టవర్లో స్టోర్ చేసేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. పెట్రోల్ బంకులు పోయి... కరెంటు బంకులు రాబోతున్నాయన్నమాట!
– సాక్షి నాలెడ్జ్ సెంటర్