‘వరి’ తగ్గించుకోవడమే మేలు
‘సాక్షి’ ఇంటర్వ్యూలో గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్
గజ్వేల్: గజ్వేల్ వ్యవసాయ సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్, తూప్రాన్, కొండపాక మండలాల్లో ఖరీఫ్ ఆశాజనకంగా ఉందని ఏడీఏ శ్రావణ్‌కుమార్ చెబుతున్నారు. ఆరుతడి పంటలకు ఇక ఢోకా లేదని తెలిపారు. భారీ వర్షాల్లేని కారణంగా చెరువులు, కుంటలు ఇతర జలాశయాల్లో నీరు చేరకపోవడం వల్ల భూగర్భజలమట్టం పెరిగే పరిస్థితి లేదని ఈ నేపథ్యంలో...బోరుబావుల సేద్యం కొంత ఇబ్బంది మారిందంటున్నారు. ‘వరి’ సాగును తగ్గించుకోవాలని సలహా ఇస్తున్నారు. తాజా పరిస్థితులపై ‘సాక్షి’ గజ్వేల్ ఏడీఏను ఇంటర్వ్యూ చేసింది. ఆ వివరాలు మీ కోసం...
సాక్షి: గజ్వేల్ సబ్‌డివిజన్‌లో ఈసారి ఎన్ని హెక్టార్ల సాగు వస్తుందని భావించారు...? ఎంత సాగైంది..?
ఏడీఏ: సబ్‌డివిజన్ పరిధిలోని గజ్వేల్ మండలంలో 12392 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 11285 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి. కొండపాక మండలంలో 10368 హెక్టార్లకు 7506, తూప్రాన్ మండలంలో 6500 హెక్టార్ల సాధారణ విస్తీర్ణానికిగానూ 5676 హెక్టార్లలో పంటలు సాగులోకి వచ్చాయి.
సాక్షి: మొక్కజొన్న, పత్తి పంటల సాగు విస్తీర్ణం ఎంత...?
ఏడీఏ: గజ్వేల్ మండలంలో మొక్కజొన్న 6744, పత్తి 3130 హెక్టార్లు, కొండపాక మండలంలో మొక్కజొన్న 3380, పత్తి 1941 హెక్టార్లు, తూప్రాన్‌లో మొక్కజొన్న 1770, పత్తి 30 హెక్టార్లలో సాగులోకి వచ్చాయి.
సాక్షి: వర్షపాతం నమోదు వివరాలు తెల్పండి..?
ఏడీఏ: జూన్ నెలలో సాధారణం కంటే అధికంగా వర్షపాతం నమోదైంది. జూలై మాత్రం తక్కువగా ఉంది. అయినా పంటలకు ఎలాంటి ఇబ్బంది లేదు. మూడు మండలాల్లో పంటలు బాగానే వున్నాయి.
సాక్షి: జూలై 15తో విత్తనాలు వేసే గడువు ముగిసిందని మీరంటున్నారు. ఇప్పటివరకు విత్తనాల వేయని వారి పరిస్థితి...?
ఏడీఏ: ఇప్పటివరకు విత్తనాలు వేయని వారు ఆగస్టు 15వరకు కంది, ఆముదం, పొద్దుతిరుగుడు వంటి విత్తనాలు వేసుకోవచ్చు.
సాక్షి: వరి సాగు పరిస్థితి...?
ఏడీఏ: సబ్‌డివిజన్‌లో ఇప్పటివరకు వరి నాట్లు పెద్దగా ఊపందుకోలేదు. సబ్‌డివిజన్ పరిధిలో ఇప్పటివరకు 900 హెక్టార్లకు సాగు మించలేదు. చాలా చోట్ల నారుమడి దశలో ఉన్నాయి. అక్కడక్కడా బోరుబావుల సాయంతో నాట్లు వేస్తున్నారు. భారీ వర్షాలు కురవడంలేదు, వరి నాట్లకు దూరంగా ఉండటమే మంచిది.
సాక్షి: పంటల బీమా పరిస్థితి ఏమిటి...?
ఏడీఏ: ఈసారి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ బీమా పథకం రైతుల రుణమాఫీ పథకంతోనే వర్తిస్తుంది.