సీవీ ఆనంద్ నియామకంపై ఐఏఎస్‌ల అసంతృప్తి
సీఎంకు మెమోరాండం ఇవ్వాలని నిర్ణయం
హైదరాబాద్: పౌరసరఫరాల శాఖ కమిషనర్‌గా ఐపీఎస్ అధికారి సీవీ ఆనంద్‌ను నియమించడంపై ఐఏఎస్‌లు అసంతృప్తితో ఉన్నారు. దీనిపై ఐఏఎస్ అసోసియేషన్ సీఎం కేసీఆర్‌ను కలసి మెమోరాండం ఇవ్వాలని నిర్ణయించింది. సీఎంతో అపాయింట్మెంట్ ఇప్పించే బాధ్యతను ఐ అండ్ పీఆర్ కమిషనర్ నవీన్‌మిట్టల్‌కు కట్టబెట్టారు. పౌర సరఫరాల శాఖ పరిధిలో అన్ని జిల్లాల జాయింట్ కలెక్టర్లు పనిచేయాల్సి ఉంటుం ది, జవాబుదారీగా ఉండాల్సి ఉంటుంది.
గతంలో ఇలాంటి ఆనవాయితీ లేకపోవడం, ఐపీఎస్‌ల పరిధిలో ఐఏఎస్‌లు పనిచేయడం సమంజసంగా లేదని, ఎవరి జాబ్ చార్ట్‌లు వారికి ఉన్నాయని అసోసియేషన్ సీఎం దృష్టికి తీసుకెళ్లే అవకాశాలున్నాయి. త్వరలో రవాణాశాఖకు కమిషనర్‌గా ఐపీఎస్‌ని నియమించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ నేపథ్యంలో ఐఏఎస్‌ల అసోసియేషన్ తమ అభిప్రాయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్లడం తప్పనిసరని భావిస్తోంది.