cyber city conventions center
-
గ్రామాలపై దృష్టి పెట్టాలి
మాదాపూర్: దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలని రాష్ట్ర వైద్య, ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. మాదాపూర్‌లోని సైబర్ సిటీ కన్వెన్షన్ సెంటర్లో 6వ ఎడిషన్ తెలంగాణ స్టేట్ డెంటల్ కాన్ఫరెన్స్–2019 శనివారం ఆయ న ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ కాన్ఫరెన్స్‌లో దంత వైద్యానికి సం బంధించిన పలు రకాల పనిముట్లు, యంత్ర పరికరాలు, శస్త్ర చికిత్స పద్ధతులకు సంబంధించిన స్టాల్స్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. వైద్య, ఆరోగ్య అభివృద్ధిలో అట్టడుగున ఉన్న తెలంగాణ.. రాష్ట్రం వచ్చిన తరువాత దేశంలో మూడవ స్థానానికి ఎదిగిందన్నారు. దంత వైద్యులు గ్రామీణ ప్రాంతాలపై దృష్టి పెట్టాలన్నారు. నూతన దంత వైద్య కళాశాలలు ఏర్పాటు చేసే బదులు ఇప్పుడు అందుబాటులో ఉన్న దంత వైద్యులనే సక్రమంగా ఉపయోగించుకోవాలన్నారు. దంత వైద్య శిబిరాలు విస్తృతంగా నిర్వహించాలని రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ వైస్ చాన్సలర్ కరుణాకర్‌రెడ్డి, సదస్సు ఆర్గనైజింగ్ కమిటీ అధ్యక్షుడు ఎస్.జగదీశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కేటీఆర్ కు రూ.31.20కోట్ల చెక్ అందించిన వెంకయ్య
హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ్ భారత్.. ఏదో రాజకీయ కార్యక్రమంలా కాకుండా ప్రజా ఉద్యమంలా మారిందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అన్నారు. హైదరాబాద్ లోని హెటెక్స్ లో ఆదివారం ఉదయం ఏర్పాటుచేసిన స్వచ్ఛ గృహ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. స్వచ్ఛ్ భారత్ ఇంకాస్త ప్రజల్లోకి వెళ్లాలంటే సినిమాతోనే సాధ్యం అవుతుందని చెప్పారు. ఈ సందర్భంగా తెలంగాణలోని నగరాలు, పట్టణాల్లో స్వచ్ఛ భారత్ కార్యక్రమాల కొనసాగింపునకుగానూ రూ.31.20 కోట్ల చెక్కును రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కె.తారకరామారావుకు వెంకయ్య అందజేశారు. 'ఈ బృహత్తర కార్యక్రమానికి వచ్చేటప్పుడే.. ఉత్తచేతులతో వెళితే బాగుండదని అనుకున్నా. అందుకే అప్పటికప్పుడు శాఖలను పురమాయించి రూ.31.20 కోట్ల చెక్కును సిద్ధం చేయించా'అని కేటీఆర్ కు చెక్ అందిస్తూ వెంకయ్య వ్యాఖ్యానించారు. స్వచ్ఛ్ భారత్ ప్రచారం కోసం రూపొందిచిన 4500 లఘు చిత్రాల్లో 17 చిత్రాలను ఎంపికచేసి, ఆయా దర్శకులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ఎంపీ టి.సుబ్బిరామిరెడ్డి, స్వచ్ఛ భారత్ బ్రాండ్ అంబాసిడర్, ప్రముఖ సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, సినీ నిర్మాత అల్లు అరవింద్, ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి తదితరులు పాల్గొన్నారు.