Cyberabad Police Commissioner cv Anand
-
క్లూస్‌కు 'సై'బరాబాద్
* శాస్త్రీయ ఆధారాల సేకరణతో పకడ్బందీగా నేరగాళ్లకు శిక్షలు * ఐదుజోన్లకు ఒక్కోటి చొప్పున క్లూస్‌టీమ్‌లు * వాహనాలను ప్రారంభించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నేర పరిశోధన మరింత సులువు కానుంది. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క వేలిముద్రల విభాగ బృందం స్థానంలో ఐదు జోనల్ క్లూస్‌టీమ్‌లను ఏర్పాటు చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఈ జోనల్ క్లూస్‌టీమ్స్ వినియోగించేందుకు తెప్పించిన సుమోలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శాస్త్రీయ ఆధారాల సేకరణకు సంబంధించిన అన్ని పరికరాల కిట్లను సిబ్బందికి అందజేశారు. నేరం జరిగినట్లు ఆయా ఠాణాల పరిధిలోని ప్రాంతాల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందగానే... ఆ జోన్‌లోని క్లూస్ టీమ్ సభ్యులు వాహనంలో కొద్ది నిమిషాలోన్లే ఘటనాస్థలికి చేరుకుని, ఆధారాలు చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. శాస్త్రీయ ఆధారాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిలో అవసరమైన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నివేదికలు తెప్పిస్తారు. ఈ శాస్త్రీయాధారాలే కోర్టుల్లో కేసును రుజువు చేసేందుకు పనికొస్తాయి. నేరగాళ్లకు శిక్షపడే వీలుంటుంది. 24 గంటలు అందుబాటులో... ఒక్కోజోన్ క్లూస్‌టీమ్‌లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. 24 గంటల పాటు షిఫ్ట్ పద్ధతిలో ఈ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరికి నాలుగు చక్రాల వాహనం అందుబాటులో ఉంటుంది. ఈ క్లూస్టీమ్లోని సభ్యులంతా ఘటనాస్థలిలో ఫొటోలు తీయడం, వీడియో చిత్రీకరించడం, వేలిముద్రలు, రక్త నమూనాల సేకరణ, పేలుడు పదార్థాలను గుర్తించడం... తదితర శాస్త్రీయ ఆధారాలు సేకరించి ల్యాబొరేటరీకి పంపే విధానంపై నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో వారంపాటు శిక్షణ పొందారు. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, బాలానగర్ జోన్లలో ఐదు క్లూస్‌టీమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో నేరాలు జరిగితే వెంటనే క్లూస్‌టీమ్‌లు అక్కడికి చేరుకునేలా శిక్షణ ఇచ్చారు. క్రైం సీన్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ సాయంతో ఆధారాల్ని సేకరిస్తారు. ఒక్కోసారి ఘటనాస్థలిలో లభించే పైకి కనిపించే ఆధారాల్ని బట్టి అమాయకుల్ని అనుమానించాల్సి వస్తోంది. అసలైన నేరస్తుడిని గుర్తించడంలో ఈ ఆధారాలు కీలకంగా పని చేయనున్నాయి. నేర పరిశోధన బలోపేతం కోసమే... ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్‌టీంల వల్ల నేరపరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెంటనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు దృష్టి సారించాం. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఘటనాస్థలిలో లభించిన శాస్త్రీయ ఆధారాలే అనేక మంది నేరగాళ్లకు శిక్షపడేలా చేశాయి. -సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ జోనల్ క్లూస్ టీమ్ ఫోన్ నంబర్లు... మాదాపూర్ జోన్ : 8333993505 బాలానగర్ జోన్ : 8333993506 మల్కాజిగిరి జోన్ : 8333993507 ఎల్బీ నగర్ జోన్ : 8333993508 శంషాబాద్ జోన్ : 8333993509 -
పోలీసులకూ హెల్మెట్
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ యోచన త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం 80 శాతం మందికి హెల్మెట్లు లేవు ప్రత్యేకంగా తెప్పిస్తున్న అధికారులు సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సిందే. లేకపోతే కార్యాలయాల్లోకి అనుమతి ఉండదట. ఈ మేరకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో సైబరాబాద్ పరిధిలోని ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడటంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ‘హెల్మెట్ వాడకాన్ని మనమే ఆచరించకపోతే ఇక జనాలకు ఏం చెబుతాం? అన్ని విభాగాల అధికారులు ఇకపై వీటిని వాడేలా చూడాల’ని డీసీపీలు, ఏసీసీలతో పాటు ఇన్స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు హెల్మెట్లు ఎంత మందికి అవసరమనే లెక్కలు వేస్తున్నారు. పనిలో పనిగా పోలీసులకూహెల్మెట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిలిటరీ అధికారులైతే రైడర్, పిలియన్ రైడర్ హెల్మెట్లు ధరించాల్సిందే. లేకపోతే విధుల్లోకి రానివ్వరు. బయటకు సైతం పోనివ్వరు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ‘హెల్మెట్లు వాడని సిబ్బందిని కార్యాలయాల్లోకి రానివ్వద్దు. కొన్ని రోజుల్లోనే దీన్ని అమలు చేయబోతున్నామ’ని ఓ పోలీసు ఉన్నతాధికారి అవగాహన కార్యక్రమంలో చెప్పడం గమనార్హం. హెల్మెట్లు ధరించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది. ఇదీ లెక్క... సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 7,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 20 శాతం మందికి మాత్రమే హెల్మెట్లు ఉన్నాయి. ట్రాఫిక్ విభాగంలో 500 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తుండగా... వారిలో 20 శాతం మంది హెల్మెట్లు వినియోగించడం లేదు. గత నెలలో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడటంతో అప్రమత్తమైన అధికారులు వీటి వినియోగంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 350 హెల్మెట్లు తెప్పించారు. సిబ్బంది వేలల్లో ఉండడంతో పెద్ద సంఖ్యలో ఐఎస్ఐ మార్క్ గల హెల్మెట్లు తెప్పించాలనే నిర్ణయానికి వచ్చారు. కనువిప్పు కలిగించిన ఘటనలు... ఉప్పల్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ యాదగిరి విధులు ముగించుకుని నివాసం ఉండే చౌదరి గూడకు వెళుతున్నారు. జోడుమెట్లకు రాగానే ఓ కారు ఢీకొనడంతో బైక్ ఎగిరిపడి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటివరకు ఇంకా కోమా నుంచి బయటకు రాలేదు. పోలీసు కమిషనర్ డ్రైవర్, కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి విధులు ముగించుకుని తాను ఉండే మాదాపూర్ క్వార్టర్స్ వైపు బయలుదేరారు. మాదాపూర్‌కు చేరుకోగానే బైక్ జారి కిందపడ్డారు తలకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తప్పనిసరని వైద్యులు తేల్చారు. కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో విధులకు వెళ్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి నార్సింగి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మూడు ఘటనల్లోనూ ముగ్గురూ హెల్మెట్లు ధరించకపోవడంతోనే గాయాలు తీవ్రమయ్యాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు. కఠిన చర్యలు తప్పవు \పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. మా వాళ్లే ఆ నిబంధనను పాటించకపోవడం సమంజసం కాదు. గత నెలలో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించకపోవడమే దీనికి కారణంగా తెలిసింది. హెల్మెట్ తప్పనిసరి చేయాలన్న విషయమై డీసీపీలకు ఆదేశాలు జారీ చేశాం. - సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ -
ఉత్సాహ తరన్‌గం