పోలీసులకూ హెల్మెట్
సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ యోచన
త్వరలో కార్యరూపం దాల్చే అవకాశం
80 శాతం మందికి హెల్మెట్లు లేవు
ప్రత్యేకంగా తెప్పిస్తున్న అధికారులు
సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసులు ఇకపై తప్పనిసరిగా హెల్మెట్ వాడాల్సిందే. లేకపోతే కార్యాలయాల్లోకి అనుమతి ఉండదట. ఈ మేరకు పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత నెలలో జరిగిన వివిధ రోడ్డు ప్రమాదాల్లో సైబరాబాద్ పరిధిలోని ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడటంతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించారు. ‘హెల్మెట్ వాడకాన్ని మనమే ఆచరించకపోతే ఇక జనాలకు ఏం చెబుతాం? అన్ని విభాగాల అధికారులు ఇకపై వీటిని వాడేలా చూడాల’ని డీసీపీలు, ఏసీసీలతో పాటు ఇన్‌స్పెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు అధికారులు హెల్మెట్లు ఎంత మందికి అవసరమనే లెక్కలు వేస్తున్నారు.
పనిలో పనిగా పోలీసులకూహెల్మెట్ల వినియోగంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మిలిటరీ అధికారులైతే రైడర్, పిలియన్ రైడర్ హెల్మెట్‌లు ధరించాల్సిందే. లేకపోతే విధుల్లోకి రానివ్వరు. బయటకు సైతం పోనివ్వరు. దీన్నే స్ఫూర్తిగా తీసుకుని ‘హెల్మెట్లు వాడని సిబ్బందిని కార్యాలయాల్లోకి రానివ్వద్దు. కొన్ని రోజుల్లోనే దీన్ని అమలు చేయబోతున్నామ’ని ఓ పోలీసు ఉన్నతాధికారి అవగాహన కార్యక్రమంలో చెప్పడం గమనార్హం. హెల్మెట్‌లు ధరించకపోతే జరిమానాలు విధిస్తామని హెచ్చరించినట్టు తెలుస్తోంది.
ఇదీ లెక్క...
సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో దాదాపు 7,000 మంది పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. వీరిలో 20 శాతం మందికి మాత్రమే హెల్మెట్లు ఉన్నాయి. ట్రాఫిక్ విభాగంలో 500 మంది హోంగార్డులు విధులు నిర్వహిస్తుండగా... వారిలో 20 శాతం మంది హెల్మెట్లు వినియోగించడం లేదు. గత నెలలో ముగ్గురు కానిస్టేబుళ్లు గాయపడటంతో అప్రమత్తమైన అధికారులు వీటి వినియోగంపై దృష్టి పెట్టారు. ఇప్పటికే 350 హెల్మెట్‌లు తెప్పించారు. సిబ్బంది వేలల్లో ఉండడంతో పెద్ద సంఖ్యలో ఐఎస్‌ఐ మార్క్ గల హెల్మెట్లు తెప్పించాలనే నిర్ణయానికి వచ్చారు.
కనువిప్పు కలిగించిన ఘటనలు...
ఉప్పల్ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ యాదగిరి విధులు ముగించుకుని నివాసం ఉండే చౌదరి గూడకు వెళుతున్నారు. జోడుమెట్లకు రాగానే ఓ కారు ఢీకొనడంతో బైక్ ఎగిరిపడి తలకు తీవ్రగాయాలయ్యాయి. ఇప్పటివరకు ఇంకా కోమా నుంచి బయటకు రాలేదు.
పోలీసు కమిషనర్ డ్రైవర్, కానిస్టేబుల్ వెంకట్ రెడ్డి విధులు ముగించుకుని తాను ఉండే మాదాపూర్ క్వార్టర్స్ వైపు బయలుదేరారు. మాదాపూర్‌కు చేరుకోగానే బైక్ జారి కిందపడ్డారు తలకు గాయాలయ్యాయి. మూడు నెలలు విశ్రాంతి తప్పనిసరని వైద్యులు తేల్చారు.
కమిషనరేట్ కంట్రోల్ రూమ్‌లో విధులకు వెళ్తున్న కానిస్టేబుల్ సత్యనారాయణ రెడ్డి నార్సింగి వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో గాయపడ్డాడు. ప్రస్తుతం నాంపల్లి కేర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ మూడు ఘటనల్లోనూ ముగ్గురూ హెల్మెట్లు ధరించకపోవడంతోనే గాయాలు తీవ్రమయ్యాయని సైబరాబాద్ పోలీసులు చెబుతున్నారు.
కఠిన చర్యలు తప్పవు
\పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించకపోతే కఠిన చర్యలు తీసుకుంటాం. మా వాళ్లే ఆ నిబంధనను పాటించకపోవడం సమంజసం కాదు. గత నెలలో ముగ్గురు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. హెల్మెట్ ధరించకపోవడమే దీనికి కారణంగా తెలిసింది. హెల్మెట్ తప్పనిసరి చేయాలన్న విషయమై డీసీపీలకు ఆదేశాలు జారీ చేశాం.
- సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్