క్లూస్‌కు 'సై'బరాబాద్
* శాస్త్రీయ ఆధారాల సేకరణతో పకడ్బందీగా నేరగాళ్లకు శిక్షలు
* ఐదుజోన్లకు ఒక్కోటి చొప్పున క్లూస్‌టీమ్‌లు
* వాహనాలను ప్రారంభించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్
సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నేర పరిశోధన మరింత సులువు కానుంది. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క వేలిముద్రల విభాగ బృందం స్థానంలో ఐదు జోనల్ క్లూస్‌టీమ్‌లను ఏర్పాటు చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఈ జోనల్ క్లూస్‌టీమ్స్ వినియోగించేందుకు తెప్పించిన సుమోలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు.
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శాస్త్రీయ ఆధారాల సేకరణకు సంబంధించిన అన్ని పరికరాల కిట్‌లను సిబ్బందికి అందజేశారు. నేరం జరిగినట్లు ఆయా ఠాణాల పరిధిలోని ప్రాంతాల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందగానే... ఆ జోన్‌లోని క్లూస్ టీమ్ సభ్యులు వాహనంలో కొద్ది నిమిషాలోన్లే ఘటనాస్థలికి చేరుకుని, ఆధారాలు చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. శాస్త్రీయ ఆధారాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిలో అవసరమైన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నివేదికలు తెప్పిస్తారు. ఈ శాస్త్రీయాధారాలే కోర్టుల్లో కేసును రుజువు చేసేందుకు పనికొస్తాయి. నేరగాళ్లకు శిక్షపడే వీలుంటుంది.
24 గంటలు అందుబాటులో...
ఒక్కోజోన్ క్లూస్‌టీమ్‌లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. 24 గంటల పాటు షిఫ్ట్ పద్ధతిలో ఈ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరికి నాలుగు చక్రాల వాహనం అందుబాటులో ఉంటుంది. ఈ క్లూస్‌టీమ్‌లోని సభ్యులంతా ఘటనాస్థలిలో ఫొటోలు తీయడం, వీడియో చిత్రీకరించడం, వేలిముద్రలు, రక్త నమూనాల సేకరణ, పేలుడు పదార్థాలను గుర్తించడం... తదితర శాస్త్రీయ ఆధారాలు సేకరించి ల్యాబొరేటరీకి పంపే విధానంపై నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో వారంపాటు శిక్షణ పొందారు.
సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, ఎల్‌బీనగర్, మల్కాజిగిరి, బాలానగర్ జోన్‌లలో ఐదు క్లూస్‌టీమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో నేరాలు జరిగితే వెంటనే క్లూస్‌టీమ్‌లు అక్కడికి చేరుకునేలా శిక్షణ ఇచ్చారు. క్రైం సీన్ ప్రాసెసింగ్ ఎక్విప్‌మెంట్ సాయంతో ఆధారాల్ని సేకరిస్తారు. ఒక్కోసారి ఘటనాస్థలిలో లభించే పైకి కనిపించే ఆధారాల్ని బట్టి అమాయకుల్ని అనుమానించాల్సి వస్తోంది. అసలైన నేరస్తుడిని గుర్తించడంలో ఈ ఆధారాలు కీలకంగా పని చేయనున్నాయి.
నేర పరిశోధన బలోపేతం కోసమే...
ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్‌టీంల వల్ల నేరపరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెంటనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు దృష్టి సారించాం. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఘటనాస్థలిలో లభించిన శాస్త్రీయ ఆధారాలే అనేక మంది నేరగాళ్లకు శిక్షపడేలా చేశాయి.
-సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
జోనల్ క్లూస్ టీమ్ ఫోన్ నంబర్లు...
మాదాపూర్ జోన్ : 8333993505
బాలానగర్ జోన్ : 8333993506
మల్కాజిగిరి జోన్ : 8333993507
ఎల్‌బీ నగర్ జోన్ : 8333993508
శంషాబాద్ జోన్ : 8333993509