Clues teams
-
ఇక ఆధారాలు పదిలం!
సాక్షి, హైదరాబాద్: ఎంత సంచలన కేసు దర్యాప్తు అయినా చిన్న చిన్న ఆధారాల దగ్గరే మొదలవుతుంది. నిందితుడిని పట్టుకోవడంలో క్లూస్ టీమ్స్ పాత్ర కీలకం. హైదరాబాద్ మాదిరిగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక క్లూస్ టీమ్‌లను ఏర్పాటు చేయాలని డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి నిర్ణయించారు. కమిషనరేట్లలో డివిజన్ స్థాయిలో, జిల్లాల్లో ఒక్కోటి చొప్పున వీటి ని ఏర్పాటు చేయనున్నారు. ఈ బృందాల్లో ముగ్గురు క్రైమ్ సీన్ ప్రాసెసింగ్ ఆఫీసర్లు, ఫొటోగ్రాఫర్, వీడియో గ్రాఫర్, డ్రైవర్ చొప్పున ఉండనున్నారు. ఉమ్మడి జిల్లాల్లో ఇప్పటికే ఒక్కో క్లూస్ టీమ్ పని చేస్తోంది. ఇందులో ఉన్న సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి ఉంటోంది. దీన్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ క్లూస్ టీమ్‌లను వికేంద్రీకరించాలని నిర్ణయించారు. త్వరలో సైబరాబాద్ లో 9, రాచకొండలో 8 బృందాలు ఏర్పాటు కానున్నాయి. ప్రతి కమిషనరేట్/జిల్లాల్లో ఉండే క్లూస్టీమ్లకు అదనంగా ఓ ప్రధాన క్లూస్ టీమ్ ఉం డనుంది. ఈ టీమ్స్‌లో పని చేయడానికి సైన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారిని ఎంచుకోనున్నారు. వీరిని హోంగార్డ్స్ క్యాడర్లో రిక్రూట్ చేసుకోవాలని భావిస్తున్నారు. సైంటిఫిక్ ఆఫీసర్స్‌గా పిలిచే వీరికి 6 నెలల పాటు సీఐడీ, గ్రేహౌండ్స్, సీసీఎస్, ఎఫ్ఎస్ఎల్ విభాగాల్లో శిక్షణిస్తారు. ఈ ఆధారాలు సేకరించేలా శిక్షణ బయోలాజికల్ ఎవిడెన్స్: రక్తం, వీర్యం, ఉమ్మి సహా శరీర సంబంధిత వాటితో పాటు కనిపించే వేలిముద్రలు లేటెంట్ ప్రింట్ ఎవిడెన్స్: చోరీ కేసుల్లో కంటికి కనిపించని వేలిముద్రలు, పాదముద్రలతో పాటు ఇతర ఆధారాలు ఫుట్‌వేర్ అండ్ టైర్ ట్రాక్ ఎవిడెన్స్: నేరస్థలాల్లో ఉన్న పాదరక్షల గుర్తులు, ప్రమాద స్థలాల్లో ఉండే వాహనాల టైర్ల మార్కులు తదితరాలు ట్రేస్ ఎవిడెన్స్: సూక్ష్మమైన ఆధారాలుగా పిలిచే ఫైబర్ (నూలు పోగులు వంటివి), జుట్టు, కాల్పులు జరిగినప్పుడు పడే గన్‌పౌడర్ తదితరాలు డిజిటల్ ఎవిడెన్స్: కంప్యూటర్లు, సెల్ఫోన్లకు సంబంధించిన హార్డ్‌డిస్క్‌లు, ఫ్లాపీలు, పెన్‌డ్రైవ్‌లతో పాటు చిప్స్ తదితరాలు టూల్ అండ్ టూల్ మార్క్ ఎవిడెన్స్: బాధితులు, మృతులను కొరకడం వంటివి జరిగితే ఆ ఆధారాలు, తాళాలు, డోర్లు పగులకొట్టిన ఆధారాలు డ్రగ్ ఎవిడెన్స్: వివిధ రకాలైన మాదకద్రవ్యాలకు సంబంధించి ఘటనా స్థలాల్లో ఉన్న వాటితో పాటు పోలీసులు పట్టుకున్న వాటి నమూనాలు ఫైర్ ఆరమ్స్ ఎవిడెన్స్: తూటాలు, ఖాళీ క్యాట్రిడ్జ్‌లు ఇతర ఆధారాలు -
క్లూస్‌కు 'సై'బరాబాద్
* శాస్త్రీయ ఆధారాల సేకరణతో పకడ్బందీగా నేరగాళ్లకు శిక్షలు * ఐదుజోన్లకు ఒక్కోటి చొప్పున క్లూస్‌టీమ్‌లు * వాహనాలను ప్రారంభించిన సైబరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ సాక్షి, సిటీబ్యూరో: సైబరాబాద్ పోలీసు కమిషనరేట్‌లో నేర పరిశోధన మరింత సులువు కానుంది. ప్రస్తుతం ఉన్న ఒకే ఒక్క వేలిముద్రల విభాగ బృందం స్థానంలో ఐదు జోనల్ క్లూస్‌టీమ్‌లను ఏర్పాటు చేశారు. కమిషనర్ సీవీ ఆనంద్ ఈ జోనల్ క్లూస్‌టీమ్స్ వినియోగించేందుకు తెప్పించిన సుమోలను గచ్చిబౌలిలోని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కార్యాలయంలో సోమవారం ప్రారంభించారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన శాస్త్రీయ ఆధారాల సేకరణకు సంబంధించిన అన్ని పరికరాల కిట్లను సిబ్బందికి అందజేశారు. నేరం జరిగినట్లు ఆయా ఠాణాల పరిధిలోని ప్రాంతాల నుంచి వచ్చిన ఫోన్‌కాల్‌తో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్‌కు సమాచారం అందగానే... ఆ జోన్‌లోని క్లూస్ టీమ్ సభ్యులు వాహనంలో కొద్ది నిమిషాలోన్లే ఘటనాస్థలికి చేరుకుని, ఆధారాలు చెరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. శాస్త్రీయ ఆధారాలను సేకరించి భద్రపరుస్తారు. వీటిలో అవసరమైన వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపి నివేదికలు తెప్పిస్తారు. ఈ శాస్త్రీయాధారాలే కోర్టుల్లో కేసును రుజువు చేసేందుకు పనికొస్తాయి. నేరగాళ్లకు శిక్షపడే వీలుంటుంది. 24 గంటలు అందుబాటులో... ఒక్కోజోన్ క్లూస్‌టీమ్‌లో ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు, ఇద్దరు హోంగార్డులు, ఇద్దరు డ్రైవర్లు ఉంటారు. 24 గంటల పాటు షిఫ్ట్ పద్ధతిలో ఈ సిబ్బంది అందుబాటులో ఉంటారు. వీరికి నాలుగు చక్రాల వాహనం అందుబాటులో ఉంటుంది. ఈ క్లూస్టీమ్లోని సభ్యులంతా ఘటనాస్థలిలో ఫొటోలు తీయడం, వీడియో చిత్రీకరించడం, వేలిముద్రలు, రక్త నమూనాల సేకరణ, పేలుడు పదార్థాలను గుర్తించడం... తదితర శాస్త్రీయ ఆధారాలు సేకరించి ల్యాబొరేటరీకి పంపే విధానంపై నాంపల్లి రెడ్‌హిల్స్‌లోని టీఎస్‌ఎఫ్‌ఎస్‌ఎల్‌లో వారంపాటు శిక్షణ పొందారు. సైబరాబాద్ పరిధిలోని శంషాబాద్, మాదాపూర్, ఎల్బీనగర్, మల్కాజిగిరి, బాలానగర్ జోన్లలో ఐదు క్లూస్‌టీమ్‌లను ఏర్పాటు చేయడం ద్వారా ఆయా ప్రాంతాల్లో నేరాలు జరిగితే వెంటనే క్లూస్‌టీమ్‌లు అక్కడికి చేరుకునేలా శిక్షణ ఇచ్చారు. క్రైం సీన్ ప్రాసెసింగ్ ఎక్విప్మెంట్ సాయంతో ఆధారాల్ని సేకరిస్తారు. ఒక్కోసారి ఘటనాస్థలిలో లభించే పైకి కనిపించే ఆధారాల్ని బట్టి అమాయకుల్ని అనుమానించాల్సి వస్తోంది. అసలైన నేరస్తుడిని గుర్తించడంలో ఈ ఆధారాలు కీలకంగా పని చేయనున్నాయి. నేర పరిశోధన బలోపేతం కోసమే... ఘటనాస్థలిలో శాస్త్రీయ ఆధారాలను పూర్తిస్థాయిలో సేకరిస్తే దోషులకు శిక్ష విధించే వీలుంటుంది. క్లూస్‌టీంల వల్ల నేరపరిశోధన సులువవుతుంది. క్లిష్టమైన కేసులను వెంటనే ఛేదించవచ్చు. అందుకే ఈ వ్యవస్థను పటిష్టం చేసేందుకు దృష్టి సారించాం. ఇప్పటికే కొన్ని కేసుల్లో ఘటనాస్థలిలో లభించిన శాస్త్రీయ ఆధారాలే అనేక మంది నేరగాళ్లకు శిక్షపడేలా చేశాయి. -సీవీ ఆనంద్, సైబరాబాద్ పోలీసు కమిషనర్ జోనల్ క్లూస్ టీమ్ ఫోన్ నంబర్లు... మాదాపూర్ జోన్ : 8333993505 బాలానగర్ జోన్ : 8333993506 మల్కాజిగిరి జోన్ : 8333993507 ఎల్బీ నగర్ జోన్ : 8333993508 శంషాబాద్ జోన్ : 8333993509 -
నగరంలో పోలీస్ ల్యాబ్స్
రూ.20 కోట్ల ఖర్చుతో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు - సైబర్ క్రైమ్, క్రైమ్, ఫోరెన్సిక్ అంశాల్లో సేవలు సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా రాజధానిలో పోలీస్ ల్యాబ్స్ ఏర్పాటవుతున్నాయి. రూ.20 కోట్ల ఖర్చుతో సైబర్ క్రైమ్, క్రైమ్, ఫోరెన్సిక్ అంశాలకు సంబంధించి మూడింటిని నెలకొల్పుతున్నారు. నేర నిరోధం, కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడం, నిందితులపై న్యాయస్థానాల్లో నేరం నిరూపించడం లక్ష్యంగా నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అవసరమైన నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు విభాగానికి ఉన్న అవసరాలను సిటీ పోలీసులు ప్రతిపాదించగా... తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్టీఎస్) సాంకేతిక అంశాలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ఉపకరణాలను ఖరీదు చేశారు. లక్డీకాపూల్‌లోని పాత కంట్రోల్‌రూమ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఉమెన్ పోలీసుస్టేషన్ ప్రాంగణాల్లో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్స్ వచ్చే నెల నుంచి పనిచేస్తాయి. అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు), సంయుక్త పోలీసు కమిషనర్ (డిటెక్టివ్ డిపార్ట్మెంట్) పర్యవేక్షణలో పనిచేయనున్నాయి. - సాక్షి, హైదరాబాద్ ‘సైబర్’లో డిటెక్షన్... ప్రివెన్షన్... నగర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటవుతున్న సైబర్ ల్యాబ్‌ను సైబర్ క్రైమ్ కేసుల్ని కొలిక్కితేవడం (డిటెక్షన్), నిరోధించడం (ప్రివెన్షన్) కోసం వినియోగించనున్నారు. ఆన్లైన్ నేరంపై ఫిర్యాదు వచ్చిన రోజే నిందితుల్ని గుర్తించడానికి డిజిటల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటవుతోంది. ఇందుకు ఆసియాలో అందుబాటులో ఉన్న అన్ని రకాలైన ఫోరెన్సిక్ సాఫ్ట్వేర్స్, హార్డ్వేర్స్ను ఇప్పటికే ఖరీదు చేశారు. పాక్షికంగా, పూర్తిగా ఛిద్రమైపోయిన సెల్ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, సిమ్‌కార్డుల్లో ఉన్న సమాచారాన్ని సంగ్రహించడానికి మ్యాగ్నెటిక్ మీడియా రికవరీ యూనిట్ పనిచేస్తుంది. ప్రివెంటివ్ ఫోరెన్సిక్ యూనిట్ సోషల్ మీడియాపై కన్నేసి ఉంచుతుంది. తద్వారా పలు శాంతిభద్రతల సమస్యల్ని నిరోధించడంతో పాటు నిందితుల్ని పట్టుకోవచ్చు. డిటెక్షన్, కన్వెన్షన్ లక్ష్యంగా... నానాటికీ నేరాల తీరుతెన్నుల్లో మార్పులు వస్తున్నాయి. ఐటీ వినియోగం పెరిగిన తర్వాత సైబర్ నేరాలూ ఎక్కువయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు, నేర నిరూపణకు చట్టప్రకారం సేకరించాల్సిన సాక్ష్యాధారాల కోసం సైబర్ ల్యాబ్ పనిచేస్తుంది. ఇతర నేరాలకు సంబంధించి నేరస్తుల్ని పట్టుకోవడానికి, న్యాయస్థానాల్లో వారిని దోషులుగా నిరూపించడానికి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్స్ ఉపకరిస్తాయి. - ఎం.మహేందర్‌రెడ్డి, పోలీసు కమిషనర్ నేరాలపై ఫోరెన్సిక్ సపోర్ట్ సెంటర్ ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే సొత్తు సంబంధిత నేరాలు, బాడిలీ అఫెన్సులుగా పిలిచే దాడి, హత్య, హత్యాయత్నం వంటి క్రైమ్ సీన్స్ నుంచి సేకరించిన ఆధారాలను విశ్లేషించడానికి ఉపకరించే క్రైమ్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సపోర్ట్ సెంటర్ పరిధిలో పనిచేస్తాయి. ఘటనాస్థలి నుంచి సేకరించే ఆధారాల్లో దర్యాప్తునకు అనువైన వాటిని ఇది విశ్లేషిస్తుంది. ఫలితంగా నిందితుల్ని పట్టుకోవడంలో జాప్యం తగ్గించొచ్చు. మరోపక్క ఆయా ఆధారాల నుంచి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి వేటిని పంపాలి, అక్కడి నిపుణుల నుంచి ఏ కోణంలో నివేదికలు పొందాలి తదితర అంశాలను ఫోరెన్సిక్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. పక్కా దర్యాప్తుతో పాటు సంచలనాత్మక నేరాలు జరిగినప్పుడు అమాయకుల్ని అదుపులోకి తీసుకుని, ప్రశ్నించే సందర్భాలను తగ్గించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ల్యాబ్స్‌లో పనిచేయడానికి క్లూస్ టీమ్స్‌కు శిక్షణ ఇస్తున్నారు. -
3డీ..రెడీ!
నేర, బందోబస్తు స్థలాల చిత్రీకరణకు 3డీ కెమెరాలు డివిజినల్ క్లూస్టీమ్స్కు రెండు చొప్పున కేటాయింపు ఒక్కొక్కటి రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షలు సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే గ్రంథి మాధవి కేసును ఛేదించడంలో నేర స్థలంలో లభించిన ఆధారాలే కీలకమయ్యాయి. దోపిడీ జరిగిన గదిలో గోడలపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా తెలిసిన వారి పనిగా అనుమానించిన పోలీసులు ఆ కోణంలో ముందుకు వెళ్లి... నిందితులను అరెస్టు చేశారు. ..నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలకు ఉన్న ప్రాధాన్యానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తించే దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి క్రైమ్ సీన్స్ రికార్డింగ్‌కు 3డీ కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే అమలులోకి రానుంది. తరలింపుపైనే దృష్టి ఎలాంటి నేరం... ప్రమాదం చోటుచేసుకున్నా ఘటనా స్థలికి చేరుకునే పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేరగాళ్లు ఏవైనా సాక్ష్యాధారాలను విడిచిపెట్టారా? వారు రాకపోకలు సాగించిన మార్గాలు ఏమిటి? నేరం ఏ విధంగా చేశారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రైమ్ సీన్స్‌కు వెళ్లే అధికారులు తమ దృష్టిని మృతదేహాలు, బాధితుల తరలింపు పైనే పెట్టడం అనివార్యంగా మారింది. దీంతో అనేక ఆధారాలను గుర్తించడంలో విఫలమై కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపునకు ఎక్కువ కాలం పడుతోంది. ఇది అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తోంది. ఇప్పటి వరకు మాన్యువల్ మ్యాపింగ్... క్రైమ్ సీన్ పరిశీలనకు తోడు ప్రతి నేర స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించడం అనివార్యం. దీన్ని ఎఫ్ఐఆర్ తదితర పత్రాలతో పాటు న్యాయస్థానంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. పోలీసు విభాగం ఇప్పటి వరకు ఈ మ్యాప్స్‌ను తెల్ల కాగితాలపై మాన్యువల్‌గా గీస్తోంది. దీనికి తోడుగా ఘటనా స్థలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జత చేసి న్యాయస్థానానికి అందిస్తోంది. అనేక సందర్భాల్లో వీటిలో పూర్తి వివరాలు పొందుపరచలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. మరోపక్క ఘటన తీవ్రతను న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లడంలో విఫలమవుతున్న ఉదంతాలూ ఉంటున్నాయి. రెండు రకాలైనవి కొనుగోలుకు నిర్ణయం ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసులు 3డీ కెమెరాలను కొనుగోలు చేస్తున్నారు. నేర స్థలాలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇల్లు, కార్యాలయం తదితర ఇండోర్, రోడ్డు, బహిరంగ ప్రదేశం వంటి ఔట్ డోర్ క్రైమ్ సీన్స్‌ను నిత్యం పోలీసులు సందర్శించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు రకాలైన క్రైమ్సీన్స్కు వినియోగించేలా ఇండోర్, ఔట్‌డోర్ 3 డీ కెమెరాలు ఖరీదు చేస్తున్నారు. తొలి రరం ధర రూ.8 లక్షలు, రెండో రకం రూ.20 లక్షలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తు తం నగర కమిషనరేట్‌లో సబ్-డివిజన్ స్థాయిలో 17 క్లూస్‌టీమ్స్ పని చేస్తున్నాయి. వీటికే ఈ రెండు రకాలైన కెమెరాలు అప్పగించాలని యోచిస్తున్నారు. కొలతలతో సహా చిత్రీకరణ... 3 డీ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరాను నేరం జరిగిన ప్రాంతంలో ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ఆ పాయింట్ కేంద్రంగా ఈ కెమెరా అన్ని దిక్కులను, అక్కడ వస్తువులను చిత్రీకరిస్తుంది. కేవలం వాటి 3 డీ చిత్రాలు మాత్రమే కాకుండా అవి హతుడు, నేర కేంద్రానికి ఎంత దూరంలో ఉన్నాయనేదీ స్పష్టంగా నమోదు చేస్తాయి. ఈ రికార్డులను దర్యాప్తు అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించి భౌతిక సాక్ష్యాల కోసం అన్వేషించవచ్చు. వీటినే న్యాయస్థానంలో దాఖలు చేయడానికీ అవకాశం ఉంటుంది. కేవలం నేర స్థలాలే కాకుండా బందోబస్తు, ప్రమాదాల చిత్రీకరణకు ఈ 3డీ కెమెరాలు ఉపకరించనున్నాయని అధికారులు చెబున్నారు. ఆరు రకాలుగా వినియోగం 1. బాడీలీ అఫెన్సులకు సంబంధించిన నేర స్థలాల చిత్రీకరణ 2. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీరుతెన్నుల రికార్డు 3. పారిశ్రామికవాడల్లో చోటు చేసుకునే దుర్ఘటనల నమోదు 4. బందోబస్తు ప్లానింగ్ కోసం సభలు, సమావేశ ప్రాంతాల చిత్రీకరణ 5. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి తీవ్రత అంచనా 6. బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు రికార్డింగ్ -
క్లూ.. మంతర్
నేరాల గుట్టు విప్పేందుకు కసరత్తు దేశంలోనే తొలిసారిగా డివిజన్ స్థాయి బృందాలు నగర కమిషనరేట్ పరిధిలో 17 నేటి నుంచి రంగంలోకి... సిటీబ్యూరో: హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవ బాంబు కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారం ఘటనా స్థలిలో దొరికిన కాలి చెప్పు...వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో గృహిణి దారుణ హత్యకు గురైన కేసును కొలిక్కి తీసుకురావడానికి హత్యా స్థలిలో దొరికిన గాజు ముక్కలే కీలకమయ్యాయి. ...వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమైనట్లు... ఎంత సంచలనాత్మక కేసు దర్యాప్తు అయినా చిన్న చిన్న ఆధారాల దగ్గరే మొదలవుతుంది. ‘క్రైమ్ సీన్’గా పిలిచే ఘటనా స్థలాల నుంచి వీటిని ఎంత వేగంగా, పక్కాగా సేకరించగలిగితే అంత మెరుగైన ఫలితాలుంటాయి. ఓ నేరం చేసిన నిందితుడిని పట్టుకోవడంలోనే కాదు... న్యాయ స్థానంలో అతడిని దోషిగా నిరూపించడంలోనూ క్లూస్ టీమ్స్ సేకరించే ఆధారాలది కీలక పాత్ర. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో క్లూస్ టీమ్స్‌ను కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి పరిపుష్టం చేస్తున్నారు. దేశంలోని మరే ఇతర నగరంలోనూ లేని విధంగా సబ్-డివిజన్ స్థాయిలో వీటిని ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 17 బృందాలను గురువారం నుంచి రంగంలోకి దించుతున్నారు. అదనపు సీపీ ఆధ్వర్యంలో... నగర కమిషనరేట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఒకే క్లూస్ టీమ్ పని చేస్తోంది. ఇందులో ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్ సహా పరిమిత సిబ్బందిపై ఇది తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. 60 పోలీసు స్టేషన్ల పరిధిలో ఏ నేరం జరిగినా వీరే ఆధారాలు సేకరించాల్సి రావడం... ఒకేసారి ఎక్కువ ఉదంతాలు చోటు చేసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం వంటివి పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా దాదాపు ఐదేళ్ల క్రితం జోనల్ స్థాయిలో క్లూస్ టీమ్స్ ఏర్పాటు చేసినా ఫలితాలు కనిపించలేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ మహేందర్‌రెడ్డి ఆధారాల సేకరణలో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీటిని వికేంద్రీకరించాలని నిర్ణయించారు. ఈ ఆలోచనకు ఆచరణ రూపమే సబ్ డివిజన్ స్థాయిలో ఏర్పాటవుతున్న క్లూస్ టీమ్స్. నగరంలోని 17 సబ్-డివిజన్లలో ఏసీపీ కార్యాలయాల కేంద్రంగా ఇవి పని చేస్తాయి. సంచలనాత్మక, సమస్యాత్మక కేసులకు మాత్రమే ప్రధాన క్లూస్ టీమ్‌ను మోహరిస్తారు. ఈ బృందాలన్నీ నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు, సిట్) ఆధ్వర్యంలో పని చేస్తాయి. ఇదీ శిక్షణ తీరు సీఐడీ సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, కొన్ని ఫైల్స్ ఎలా సేకరించాలి? వాటిని ఏవిధంగా భద్రపరిచి పరీక్షల కోసం పంపాలి? అనే అంశాలను బోధించారు. గ్రేహౌండ్స్ ఇందులో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో అన్ని రకాల ఆయుధాలు ఉంటాయి. వివిధ రకాల తుపాకులు, తూటాలు, బాంబులు పేలే విధానం, సేకరించాల్సిన నమూనాల రకాలపై శిక్షణనిచ్చారు. సీసీఎస్ బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్యలు, హత్యాయత్నాలతో పాటు ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు తదితరాల్లో సేకరించాల్సిన ఆధారాలు, విధానాలను వివరించారు. ఎఫ్ఎస్ఎల్ ఈ ఆధారాలన్నీ పరీక్షల నిమిత్తం చేరాల్సింది ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకే. ఈ నేపథ్యంలో అక్కడ పని తీరు, క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు తదితరాలను సవివరంగా నేర్పించారు. 50 మందికి శిక్షణ... సబ్ డివిజన్ స్థాయి క్లూస్‌టీమ్స్‌లో పని చేయడానికి సైన్స్ విభాగంలో డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన 50 మందిని ఆరు నెలల క్రితమే ఎంపిక చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే అవకాశం లేకపోవడంతో హోంగార్డ్స్ క్యాడర్లో రిక్రూట్ చేసుకున్నారు. డివిజినల్ సైంటిఫిక్ ఆఫీసర్స్‌గా పిలిచే వారికి ఆరు నెలల పాటు వివిధ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. ప్రత్యేక యూనిఫాంతో పాటు అవసరమైన వాహనాలు, ఉపకరణాలు అందించారు. సాధారణ నేరాల నుంచి సైబర్ నేరాల వరకు అన్నింటిలోనూ ఆధారాలు సేకరించేలా తర్ఫీదునిచ్చారు. గురువారం నుంచి నగర వ్యాప్తంగా ఈ బృందాలన్నీ పని చేయడం ప్రారంభించనున్నాయి. -
క్లూస్ టీమ్ పరిశీలన
భువనగిరి : ఆలేరు శివారులో జాతీయ రహదారిపై జరిగిన ఎన్కౌంటర్ ప్రాంతాన్ని క్లూస్ టీములు సందర్శించాయి. పలు కోణాల్లో పరిశీలన చేశాయి. ఎన్కౌంటర్లో తీవ్రవాది వికారుద్దీన్, మరో నలుగురు మృతి చెందిన నేపథ్యంలో కేసును అన్నికోణాల్లో పరిశీలన చేపట్టారు. ప్రధానం గా ఎన్కౌంటర్ జరిగిన వాహనంతోపాటు, రక్తం మరకలను, వాహనం నుంచి విడిపోయిన భాగాలను, పలుచోట్ల పడిన బుల్లెట్ల విడిభాగాలను సేకరించారు. రక్తంలో ఉన్న బుల్లెట్‌ను జనం గుర్తించి పోలీసులకు అప్పగించారు. క్లూస్ టీం సభ్యులు రోడ్డుపై పడిన రక్తపు మరకలు పడిన డాం బర్ను తవ్వి తీసుకెళ్లారు. ఐరన్ రాడ్, గాజు ముక్కలను సేకరించారు. పంచనామా కోసం ఆ ప్రాంతం ఏ సర్వేనంబర్, ఏ గ్రామం పరిధి అన్న వివరాలతోపాటు అక్కడి రైతుల పేర్లను నమోదు చేసుకున్నారు. పోలీసులపై అజమాయిషీ చేసే తత్వం ఆలేరు సమీపంలో ఎన్కౌంటర్లో మృతిచెందిన వికారుద్దీన్ ఎప్పుడూ పోలీసులతో దురుసుగా వ్యవహరిస్తూ అజమాయిషీ చేసే వాడని ఘటనస్థలంలో పోలీసులు చెబుతున్నారు. ప్రధానంగా బిర్యానీ కోసం ఎక్కువగా తగువుపడేవాడని చెప్పారు. రెండు రోజుల క్రితం మోత్కూరు మండలం జానకీపురం ఎన్కౌంటర్లో తమకు చెందిన వారు చనిపోయారని, దానికి బదులు తీర్చుకుంటామని ఎస్కార్ట్ వాహనంలో కూడా పోలీసులతో గొడవపడ్డారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే దూషించారని తెలుస్తోంది.