నగరంలో పోలీస్ ల్యాబ్స్ | Police Labs in the city | Sakshi
Sakshi News home page

నగరంలో పోలీస్ ల్యాబ్స్

Published Tue, May 3 2016 3:07 AM | Last Updated on Tue, Aug 21 2018 7:25 PM

నగరంలో పోలీస్ ల్యాబ్స్ - Sakshi

నగరంలో పోలీస్ ల్యాబ్స్

 రూ.20 కోట్ల ఖర్చుతో దేశంలోనే తొలిసారిగా ఏర్పాటు - సైబర్ క్రైమ్, క్రైమ్, ఫోరెన్సిక్ అంశాల్లో సేవలు
 
సాక్షి, హైదరాబాద్: దేశంలోనే తొలిసారిగా రాజధానిలో పోలీస్ ల్యాబ్స్ ఏర్పాటవుతున్నాయి. రూ.20 కోట్ల ఖర్చుతో సైబర్ క్రైమ్, క్రైమ్, ఫోరెన్సిక్ అంశాలకు సంబంధించి మూడింటిని నెలకొల్పుతున్నారు. నేర నిరోధం, కేసుల దర్యాప్తును త్వరితగతిన పూర్తి చేయడం, నిందితులపై న్యాయస్థానాల్లో నేరం నిరూపించడం లక్ష్యంగా నగర కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి వీటిని అందుబాటులోకి తీసుకువస్తున్నారు. అవసరమైన నిధులు ఇప్పటికే ప్రభుత్వం విడుదల చేసింది.

ప్రస్తుత పరిస్థితుల్లో పోలీసు విభాగానికి ఉన్న అవసరాలను సిటీ పోలీసులు ప్రతిపాదించగా... తెలంగాణ రాష్ట్ర టెక్నాలజీ సర్వీసెస్ (టీఎస్‌టీఎస్) సాంకేతిక అంశాలు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఇతర అంశాలను పరిశీలించిన తర్వాత ఉపకరణాలను ఖరీదు చేశారు. లక్డీకాపూల్‌లోని పాత కంట్రోల్‌రూమ్, సెంట్రల్ క్రైమ్ స్టేషన్, ఉమెన్ పోలీసుస్టేషన్ ప్రాంగణాల్లో ఏర్పాటవుతున్న ఈ ల్యాబ్స్ వచ్చే నెల నుంచి పనిచేస్తాయి. అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు), సంయుక్త పోలీసు కమిషనర్ (డిటెక్టివ్ డిపార్ట్‌మెంట్) పర్యవేక్షణలో పనిచేయనున్నాయి.     
 - సాక్షి, హైదరాబాద్
 
 ‘సైబర్’లో డిటెక్షన్... ప్రివెన్షన్...
 నగర సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్ ఆవరణలో ఏర్పాటవుతున్న సైబర్ ల్యాబ్‌ను సైబర్ క్రైమ్ కేసుల్ని కొలిక్కితేవడం (డిటెక్షన్), నిరోధించడం (ప్రివెన్షన్) కోసం వినియోగించనున్నారు. ఆన్‌లైన్ నేరంపై ఫిర్యాదు వచ్చిన రోజే నిందితుల్ని గుర్తించడానికి డిజిటల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ ఏర్పాటవుతోంది. ఇందుకు ఆసియాలో అందుబాటులో ఉన్న అన్ని రకాలైన ఫోరెన్సిక్ సాఫ్ట్‌వేర్స్, హార్డ్‌వేర్స్‌ను ఇప్పటికే ఖరీదు చేశారు. పాక్షికంగా, పూర్తిగా ఛిద్రమైపోయిన సెల్‌ఫోన్లు, హార్డ్‌డిస్క్‌లు, సిమ్‌కార్డుల్లో ఉన్న సమాచారాన్ని సంగ్రహించడానికి మ్యాగ్నెటిక్ మీడియా రికవరీ యూనిట్ పనిచేస్తుంది. ప్రివెంటివ్ ఫోరెన్సిక్ యూనిట్ సోషల్ మీడియాపై కన్నేసి ఉంచుతుంది. తద్వారా పలు శాంతిభద్రతల సమస్యల్ని నిరోధించడంతో పాటు నిందితుల్ని పట్టుకోవచ్చు.
 
 డిటెక్షన్, కన్వెన్షన్ లక్ష్యంగా...

 నానాటికీ నేరాల తీరుతెన్నుల్లో మార్పులు వస్తున్నాయి. ఐటీ వినియోగం పెరిగిన తర్వాత సైబర్ నేరాలూ ఎక్కువయ్యాయి. ఈ కేసుల దర్యాప్తు, నేర నిరూపణకు చట్టప్రకారం సేకరించాల్సిన సాక్ష్యాధారాల కోసం సైబర్ ల్యాబ్ పనిచేస్తుంది. ఇతర నేరాలకు సంబంధించి నేరస్తుల్ని పట్టుకోవడానికి, న్యాయస్థానాల్లో వారిని దోషులుగా నిరూపించడానికి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ల్యాబ్స్ ఉపకరిస్తాయి.
 - ఎం.మహేందర్‌రెడ్డి, పోలీసు కమిషనర్
 
 నేరాలపై ఫోరెన్సిక్ సపోర్ట్ సెంటర్
 ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే సొత్తు సంబంధిత నేరాలు, బాడిలీ అఫెన్సులుగా పిలిచే దాడి, హత్య, హత్యాయత్నం వంటి క్రైమ్ సీన్స్ నుంచి సేకరించిన ఆధారాలను విశ్లేషించడానికి ఉపకరించే క్రైమ్, ఫోరెన్సిక్ ల్యాబ్స్ ఫోరెన్సిక్ సపోర్ట్ సెంటర్ పరిధిలో పనిచేస్తాయి. ఘటనాస్థలి నుంచి సేకరించే ఆధారాల్లో దర్యాప్తునకు అనువైన వాటిని ఇది విశ్లేషిస్తుంది. ఫలితంగా నిందితుల్ని పట్టుకోవడంలో జాప్యం తగ్గించొచ్చు. మరోపక్క ఆయా ఆధారాల నుంచి రాష్ట్ర ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకి వేటిని పంపాలి, అక్కడి నిపుణుల నుంచి ఏ కోణంలో నివేదికలు పొందాలి తదితర అంశాలను ఫోరెన్సిక్ యూనిట్ పర్యవేక్షిస్తుంది. పక్కా దర్యాప్తుతో పాటు సంచలనాత్మక నేరాలు జరిగినప్పుడు అమాయకుల్ని అదుపులోకి తీసుకుని, ప్రశ్నించే సందర్భాలను తగ్గించొచ్చని అధికారులు చెబుతున్నారు. ఈ ల్యాబ్స్‌లో పనిచేయడానికి క్లూస్ టీమ్స్‌కు శిక్షణ ఇస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement