క్లూ.. మంతర్ | Considering the confidentiality of the crime | Sakshi
Sakshi News home page

క్లూ.. మంతర్

Published Thu, Oct 15 2015 1:06 AM | Last Updated on Sun, Sep 3 2017 10:57 AM

క్లూ.. మంతర్

క్లూ.. మంతర్

నేరాల గుట్టు విప్పేందుకు కసరత్తు
దేశంలోనే తొలిసారిగా డివిజన్ స్థాయి బృందాలు
నగర కమిషనరేట్ పరిధిలో 17
నేటి నుంచి రంగంలోకి...

 
సిటీబ్యూరో: హైదరాబాద్ కమిషనర్ టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై మానవ బాంబు కేసు దర్యాప్తునకు ప్రాథమిక ఆధారం ఘటనా స్థలిలో దొరికిన కాలి చెప్పు...వనస్థలిపురం పోలీసు స్టేషన్ పరిధిలో గృహిణి దారుణ హత్యకు గురైన కేసును కొలిక్కి తీసుకురావడానికి హత్యా స్థలిలో దొరికిన గాజు ముక్కలే కీలకమయ్యాయి.
 
...వెయ్యి మైళ్ల ప్రయాణమైనా ఒక్క అడుగుతో ప్రారంభమైనట్లు... ఎంత సంచలనాత్మక కేసు దర్యాప్తు అయినా చిన్న చిన్న ఆధారాల దగ్గరే మొదలవుతుంది. ‘క్రైమ్ సీన్’గా పిలిచే ఘటనా స్థలాల నుంచి వీటిని ఎంత వేగంగా, పక్కాగా సేకరించగలిగితే అంత మెరుగైన ఫలితాలుంటాయి. ఓ నేరం చేసిన నిందితుడిని పట్టుకోవడంలోనే కాదు... న్యాయ స్థానంలో అతడిని దోషిగా నిరూపించడంలోనూ క్లూస్ టీమ్స్ సేకరించే ఆధారాలది కీలక పాత్ర. ఈ నేపథ్యంలోనే నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో క్లూస్ టీమ్స్‌ను కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి పరిపుష్టం చేస్తున్నారు. దేశంలోని మరే ఇతర నగరంలోనూ లేని విధంగా సబ్-డివిజన్ స్థాయిలో వీటిని ఏర్పాటు చేశారు. శిక్షణ పూర్తి చేసుకున్న 17 బృందాలను గురువారం నుంచి రంగంలోకి దించుతున్నారు.

 అదనపు సీపీ ఆధ్వర్యంలో...
 నగర కమిషనరేట్‌కు సంబంధించి ఇప్పటి వరకు ఒకే క్లూస్ టీమ్ పని చేస్తోంది. ఇందులో ఉన్న సైంటిఫిక్ ఆఫీసర్ సహా పరిమిత సిబ్బందిపై ఇది తీవ్ర ఒత్తిడికి కారణమవుతోంది. 60 పోలీసు స్టేషన్ల పరిధిలో ఏ నేరం జరిగినా వీరే ఆధారాలు సేకరించాల్సి రావడం... ఒకేసారి ఎక్కువ ఉదంతాలు చోటు చేసుకుంటే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాల్సి రావడం వంటివి పనితీరుపై ప్రభావం చూపిస్తున్నాయి. దీనికి పరిష్కారంగా దాదాపు ఐదేళ్ల క్రితం జోనల్ స్థాయిలో క్లూస్ టీమ్స్ ఏర్పాటు చేసినా ఫలితాలు కనిపించలేదు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ మహేందర్‌రెడ్డి ఆధారాల సేకరణలో మెరుగైన ఫలితాలు సాధించడానికి వీటిని వికేంద్రీకరించాలని నిర్ణయించారు. ఈ ఆలోచనకు ఆచరణ రూపమే సబ్ డివిజన్ స్థాయిలో ఏర్పాటవుతున్న క్లూస్ టీమ్స్. నగరంలోని 17 సబ్-డివిజన్లలో ఏసీపీ కార్యాలయాల కేంద్రంగా ఇవి పని చేస్తాయి. సంచలనాత్మక, సమస్యాత్మక కేసులకు మాత్రమే ప్రధాన క్లూస్ టీమ్‌ను మోహరిస్తారు. ఈ బృందాలన్నీ నగర అదనపు పోలీసు కమిషనర్ (నేరాలు, సిట్) ఆధ్వర్యంలో పని చేస్తాయి.

ఇదీ శిక్షణ తీరు  సీఐడీ
సైబర్ నేరాలకు సంబంధించిన ఫిర్యాదుల్లో కంప్యూటర్లు, హార్డ్‌డిస్క్‌లు, కొన్ని ఫైల్స్ ఎలా సేకరించాలి? వాటిని ఏవిధంగా భద్రపరిచి పరీక్షల కోసం పంపాలి? అనే అంశాలను బోధించారు.
 
గ్రేహౌండ్స్
ఇందులో ఉన్న బెల్ ఆఫ్ ఆర్మ్స్‌లో అన్ని రకాల ఆయుధాలు ఉంటాయి. వివిధ రకాల తుపాకులు, తూటాలు, బాంబులు పేలే విధానం, సేకరించాల్సిన నమూనాల రకాలపై శిక్షణనిచ్చారు.

సీసీఎస్
బాడీలీ అఫెన్సులుగా పిలిచే హత్యలు, హత్యాయత్నాలతో పాటు ప్రాపర్టీ అఫెన్సులుగా పిలిచే చోరీలు తదితరాల్లో సేకరించాల్సిన ఆధారాలు, విధానాలను వివరించారు.
 
ఎఫ్‌ఎస్‌ఎల్
ఈ ఆధారాలన్నీ పరీక్షల నిమిత్తం చేరాల్సింది ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీకే. ఈ నేపథ్యంలో అక్కడ పని తీరు,  క్షేత్రస్థాయిలో నిర్లక్ష్యం చేస్తే జరిగే పరిణామాలు తదితరాలను సవివరంగా నేర్పించారు.
 
50 మందికి శిక్షణ...
సబ్ డివిజన్ స్థాయి క్లూస్‌టీమ్స్‌లో పని చేయడానికి సైన్స్ విభాగంలో డిగ్రీ, పీజీలు పూర్తి చేసిన 50 మందిని ఆరు నెలల క్రితమే ఎంపిక చేసుకున్నారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకునే అవకాశం లేకపోవడంతో హోంగార్డ్స్ క్యాడర్‌లో రిక్రూట్ చేసుకున్నారు. డివిజినల్ సైంటిఫిక్ ఆఫీసర్స్‌గా పిలిచే వారికి ఆరు నెలల పాటు వివిధ విభాగాల్లో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు.  ప్రత్యేక యూనిఫాంతో పాటు అవసరమైన వాహనాలు, ఉపకరణాలు అందించారు. సాధారణ నేరాల నుంచి సైబర్ నేరాల వరకు అన్నింటిలోనూ ఆధారాలు సేకరించేలా తర్ఫీదునిచ్చారు. గురువారం నుంచి నగర వ్యాప్తంగా ఈ బృందాలన్నీ పని చేయడం ప్రారంభించనున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement