3డీ..రెడీ!
నేర, బందోబస్తు స్థలాల చిత్రీకరణకు 3డీ కెమెరాలు
డివిజినల్ క్లూస్‌టీమ్స్‌కు రెండు చొప్పున కేటాయింపు
ఒక్కొక్కటి రూ.8 లక్షల నుంచి రూ.20 లక్షలు
సిటీబ్యూరో: జూబ్లీహిల్స్ పోలీసు స్టేషన్ పరిధిలో హత్యకు గురైన మాజీ ఎమ్మెల్యే గ్రంథి మాధవి కేసును ఛేదించడంలో నేర స్థలంలో లభించిన ఆధారాలే కీలకమయ్యాయి. దోపిడీ జరిగిన గదిలో గోడలపై ఉన్న రక్తపు మరకల ఆధారంగా తెలిసిన వారి పనిగా అనుమానించిన పోలీసులు ఆ కోణంలో ముందుకు వెళ్లి... నిందితులను అరెస్టు చేశారు.
..నేర స్థలంలో ఉండే భౌతిక సాక్ష్యాధారాలకు ఉన్న ప్రాధాన్యానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ప్రస్తుతం తీవ్ర ఒత్తిడి మధ్య విధులు నిర్వర్తించే దర్యాప్తు అధికారులు ఘటనా స్థలాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేకపోతున్నారు. దీన్ని పరిగణనలోకి తీసుకున్న కొత్వాల్ ఎం.మహేందర్‌రెడ్డి క్రైమ్ సీన్స్ రికార్డింగ్‌కు 3డీ కెమెరాలు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. ప్రస్తుతం టెండర్ల దశలో ఉన్న ఈ ప్రాజెక్టు త్వరలోనే అమలులోకి రానుంది.
తరలింపుపైనే దృష్టి
ఎలాంటి నేరం... ప్రమాదం చోటుచేసుకున్నా ఘటనా స్థలికి చేరుకునే పోలీసు అధికారులు ఆ ప్రాంతాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సి ఉంటుంది. నేరగాళ్లు ఏవైనా సాక్ష్యాధారాలను విడిచిపెట్టారా? వారు రాకపోకలు సాగించిన మార్గాలు ఏమిటి? నేరం ఏ విధంగా చేశారు? తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుని పరిశీలించాల్సి ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో క్రైమ్ సీన్స్‌కు వెళ్లే అధికారులు తమ దృష్టిని మృతదేహాలు, బాధితుల తరలింపు పైనే పెట్టడం అనివార్యంగా మారింది. దీంతో అనేక ఆధారాలను గుర్తించడంలో విఫలమై కేసుల దర్యాప్తు, నిందితుల గుర్తింపునకు ఎక్కువ కాలం పడుతోంది. ఇది అనేక సందర్భాల్లో నేరగాళ్లకు కలిసి వస్తోంది.
ఇప్పటి వరకు మాన్యువల్ మ్యాపింగ్...
క్రైమ్ సీన్ పరిశీలనకు తోడు ప్రతి నేర స్థలానికి సంబంధించిన మ్యాప్‌ను రూపొందించడం అనివార్యం. దీన్ని ఎఫ్‌ఐఆర్ తదితర పత్రాలతో పాటు న్యాయస్థానంలో దాఖలు చేయాల్సి ఉంటుంది. పోలీసు విభాగం ఇప్పటి వరకు ఈ మ్యాప్స్‌ను తెల్ల కాగితాలపై మాన్యువల్‌గా గీస్తోంది. దీనికి తోడుగా ఘటనా స్థలికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను జత చేసి న్యాయస్థానానికి అందిస్తోంది. అనేక సందర్భాల్లో వీటిలో పూర్తి వివరాలు పొందుపరచలేని పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. మరోపక్క ఘటన తీవ్రతను న్యాయస్థానం దృష్టికి తీసుకు వెళ్లడంలో విఫలమవుతున్న ఉదంతాలూ ఉంటున్నాయి.
రెండు రకాలైనవి కొనుగోలుకు నిర్ణయం
ఈ సమస్యలకు పరిష్కారంగా నగర పోలీసులు 3డీ కెమెరాలను కొనుగోలు చేస్తున్నారు. నేర స్థలాలు ప్రధానంగా రెండు రకాలు ఉంటాయి. ఇల్లు, కార్యాలయం తదితర ఇండోర్, రోడ్డు, బహిరంగ ప్రదేశం వంటి ఔట్ డోర్ క్రైమ్ సీన్స్‌ను నిత్యం పోలీసులు సందర్శించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలోనే రెండు రకాలైన క్రైమ్‌సీన్స్‌కు వినియోగించేలా ఇండోర్, ఔట్‌డోర్ 3 డీ కెమెరాలు ఖరీదు చేస్తున్నారు. తొలి రరం ధర రూ.8 లక్షలు, రెండో రకం రూ.20 లక్షలు ఉంటాయని అంచనా వేస్తున్నారు. ప్రస్తు తం నగర కమిషనరేట్‌లో సబ్-డివిజన్ స్థాయిలో 17 క్లూస్‌టీమ్స్ పని చేస్తున్నాయి. వీటికే ఈ రెండు రకాలైన కెమెరాలు అప్పగించాలని యోచిస్తున్నారు.
కొలతలతో సహా చిత్రీకరణ...
3 డీ పరిజ్ఞానంతో పని చేసే ఈ కెమెరాను నేరం జరిగిన ప్రాంతంలో ఓ నిర్దిష్ట ప్రదేశంలో ఏర్పాటు చేస్తారు. ఆ పాయింట్ కేంద్రంగా ఈ కెమెరా అన్ని దిక్కులను, అక్కడ వస్తువులను చిత్రీకరిస్తుంది. కేవలం వాటి 3 డీ చిత్రాలు మాత్రమే కాకుండా అవి హతుడు, నేర కేంద్రానికి ఎంత దూరంలో ఉన్నాయనేదీ స్పష్టంగా నమోదు చేస్తాయి. ఈ రికార్డులను దర్యాప్తు అధికారులు ఎప్పుడు కావాలంటే అప్పుడు పరిశీలించి భౌతిక సాక్ష్యాల కోసం అన్వేషించవచ్చు. వీటినే న్యాయస్థానంలో దాఖలు చేయడానికీ అవకాశం ఉంటుంది. కేవలం నేర స్థలాలే కాకుండా బందోబస్తు, ప్రమాదాల చిత్రీకరణకు ఈ 3డీ కెమెరాలు ఉపకరించనున్నాయని అధికారులు చెబున్నారు.
ఆరు రకాలుగా వినియోగం
1. బాడీలీ అఫెన్సులకు సంబంధించిన నేర స్థలాల చిత్రీకరణ
2. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు వాటి తీరుతెన్నుల రికార్డు
3. పారిశ్రామికవాడల్లో చోటు చేసుకునే దుర్ఘటనల నమోదు
4. బందోబస్తు ప్లానింగ్ కోసం సభలు, సమావేశ ప్రాంతాల చిత్రీకరణ
5. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు వాటి తీవ్రత అంచనా
6. బాంబు పేలుళ్ల వంటి ఉగ్రవాద చర్యలు జరిగినప్పుడు రికార్డింగ్