పీసీలకు ట్యాబ్లెట్లు ప్రత్యామ్నాయం కాదు
న్యూఢిల్లీ: పర్సనల్ కంప్యూటర్ల(డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్)కు ట్యాబ్లెట్ ఇప్పుడప్పుడే ప్రత్యామ్నాయం కాదని సైబర్‌మీడియారీసెర్చ్(సీఎంఆర్) సర్వేలో తేలింది. ఎక్కడికైనా వెళ్లేటప్పుడు సోషల్ నెట్వర్కింగ్ సైట్లు, వినోద సంబంధిత కంటెంట్‌ను యాక్సెస్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందనే ఉద్దేశంతోనే ట్యాబ్లెట్లను కొనుగోలు చేస్తున్నామని సీఎంఆర్ సర్వేలో పాల్గొన్నవారిలో నలుగురిలో ముగ్గురు చెప్పారు. భారత్‌లోని 20 నగరాల్లో 3,600 మందిపై నిర్వహించిన ఈ సర్వే వెల్లడించిన ఇతర ముఖ్యాంశాలు...,
ట్యాబ్లెట్ ప్రధాన కంప్యూటర్ డివైస్‌గా మారేందుకు సమయం పడుతుందని 78%మంది పేర్కొన్నారు.
ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ట్యాబ్లెట్లకు ప్రాధాన్యత ఇస్తామని 87% మంది అన్నారు.
రోజుకు రెండు గంటలకు పైగా ట్యాబ్లెట్‌ను ఉపయోగించే వారి సంఖ్య 51 శాతంగా ఉంది. ఈ సమయం భవిష్యత్తులో పెరగే అవకాశాలున్నాయి.
చాటింగ్, మెసేజింగ్, ఇమెయిల్ సర్వీసుల కోసం ఒక్క రోజులో ట్యాబ్లెట్‌ను పలుమార్లు ఉపయోగించే వారు 40 శాతంగా ఉన్నారు.