ఫిట్ & గ్రీన్
FUN WAY
హైదరాబాదీలు ఆడుతూపాడుతూ సైకిల్ తొక్కేస్తున్నారు. ఆఫీసులకు రివ్వున దూసుకుపోతున్నారు. ఇక వీక్లీ రౌండప్స్ సరేసరి. కాలు కదిపితే కార్లు.. రైడ్ కొట్టేందుకు స్పోర్ట్స్ బైక్.. ఇవన్నీ ఉన్నా కూడా మా స్టేటస్ సింబల్- సైకిల్ అంటున్నారు. ఆరోగ్యానందాల కోసం ఇంతకుమించిన బెని‘ఫిట్’ లేదంటున్నారు. గ్రీన్‌సిటీ అనేది ఓ డ్రీమ్ కాదు.. డెస్టినేషన్. సైక్లింగ్ మాత్రమే ఆ గమ్యాన్ని చేర్చగలదంటున్న మన హైదరాబాదీల న్యూ స్టైల్ స్టేట్మెంట్- ‘సైకిల్ టు వర్క్’.
- సీహెచ్.ఎమ్.నాయుడు
ఇప్పుడు మెట్రో నగరాలు రెండు రకాలు..ఒకటి- సైకిల్ నెట్వర్క్ ఉన్నవి.. రెండు- అటువంటి నెట్వర్క్ కోరుకుంటున్నవి..మన హైదరాబాద్ ఏ ట్రాక్‌పై ఉందో తెలుసుకోవాలంటే.. సిటీలో వాహనాల సగటు వేగం గంటకు 15 కిలోమీటర్ల లోపే. దాదాపు ఇదే వేగంతో మోటారు వాహనాలతో పోటీపడి నగరంలో సైకిళ్లు రోజూ వేల ట్రిప్పులు తిరుగుతున్నాయి. ఇంధన వ్యయం, కాలుష్యం, జర్నీ టైమ్ పెరిగిపోతుండటం, వాహనాలతో కిక్కిరిసిపోతున్న ఇరుకిరుకు రోడ్లకు సైకిళ్లే ప్రత్యామ్నాయం అవుతున్నాయి. పైగా గజిబిజీ లైఫ్స్టైల్లో కసరత్తులు చేసే ఓపిక, తీరిక ఎవరికీ ఉండట్లేదు. అందుకే సైక్లింగ్ మంచి ఎక్సర్సైజ్గా మారుతోంది.
ఇటు ట్రాఫిక్ సమస్యా తీరుతోంది. ఫలితంగా ఐదారంకెల జీతాలు అందుకుంటున్న సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కార్లు, బైకులు వదిలేసి సైకిళ్లెక్కుతున్నారు. ‘సాఫ్ట్వేర్ జాబ్ కూర్చుని చేసేది. బాడీ యాక్టివిటీ ఉండదు. అలాగని జిమ్‌కి వెళ్లే టైమూ ఉండదు. కాబట్టి ఆరోగ్యం కోసమైనా సైక్లింగ్ మంచిది. అందుకే ఇప్పుడు చాలామంది ఐటీ పీపుల్ సైకిల్ టు వర్క్‌ను ప్రిఫర్ చేస్తున్నారు’ అంటారు రన్కోడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ కంట్రీహెడ్ ప్రవీణ్ పమిడిముక్కల. హైదరాబాద్ బైసైక్లింగ్ క్లబ్లో ఆరు వేల మంది సభ్యులుంటే, వీరిలో సైకిల్ టు వర్క్ చేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగులు దాదాపు 2500.
సై.. సైక్లింగ్
సైబరాబాద్.. సాఫ్ట్వేర్, ఎంఎన్సీ, కార్పొరేట్ కంపెనీల ఎదుట ఎన్ని అత్యాధునిక, ఖరీదైన వాహనాలుంటే అంత గొప్పగా భావించే పరిస్థితి అక్కడ. అటువంటి కంపెనీలు ఇప్పుడు సైకిళ్లపై ఆఫీస్‌లకు వచ్చే ఉద్యోగులకు నగదు ప్రోత్సాహకాలు ఇస్తామంటున్నాయి. టెక్ మహీంద్ర, ఇన్ఫోసిస్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, రాయదుర్గంలోని వెల్స్ ఫార్గో సొల్యూషన్స్, హెచ్ఐసీసీ వంటి కార్పొరేట్ సంస్థలు సైకిల్ పార్కింగ్ జోన్లు, వాష్‌రూమ్‌లు ఏర్పాటు చేస్తున్నాయి. వేవ్‌రాక్ కంపెనీలో ప్రత్యేక సైకిల్ పార్కింగ్ ప్లేస్ ఉంది. ఇంకొన్ని సంస్థలు ఫుడ్ కూపన్స్ అందిస్తున్నాయి. అయితే, సైకిళ్లపై ఆఫీస్‌లకు వచ్చే వారు వెంటనే రీఫ్రెష్ కావడానికి విదేశాల్లో ఆఫీస్ కారిడార్లలోనే ‘బైక్ పాడ్స్’ (రీఫ్రెషింగ్ పాయింట్స్) ఉంటాయి. వాటితో పాటు లోన్లు, బీమా సౌకర్యాలు మన దగ్గరా కల్పిస్తే సైక్లింగ్ మరింత పెరుగుతుందంటున్నారు ఐటీ ఉద్యోగులు.
గ్రీన్రైడ్...
ఇప్పుడు మెట్రో నగరాలు సైకిల్ నెట్‌వర్క్‌ను కోరుకుంటున్నాయి. ఇందులో బెంగళూరు రైట్ ట్రాక్‌లో ఉంది. అక్కడ సైకిల్ టు వర్క్ చేసే వారందరికీ ప్రత్యేక డ్రెస్ కోడ్ ఉంది. మన సైబరాబాద్ ఇప్పుడిప్పుడే గ్రీన్రైడ్ చేస్తోంది. గ్రేటర్ సిటీలోని దాదాపు 45 లక్షల వివిధ రకాల వాహనాలు నిత్యం 63 లక్షల లీటర్ల ఇంధనాన్ని
కాల్చేస్తున్నాయి. ఒక లీటర్ పెట్రోల్ నుంచి 2.3 కేజీల కార్బన్ డై ఆక్సైడ్ (వాహనం కండిషన్ బట్టి) విడుదలవుతుందని అంచనా. అంటే, ఏటా వాహనాల నుంచి 144.9 లక్షల కిలోల సీఓ2 విడుదలవుతుంది. అయితే ఒక చెట్టు రోజూ 21.77 కేజీల కార్బన్‌డైఆక్సైడ్ మాత్రమే గ్రహించగలదు. మన సిటీలో చెట్లకు మించి కార్లే ఎక్కువ ఉన్నాయి. కాబట్టి పరిస్థితి ఏమిటో ఊహించుకోవచ్చు.
సైకిల్ ఫ్రెండ్లీ సిటీ..
నగరంలో ఎక్కువ మంది నిత్యం ప్రయాణించే దూరాలు సగటున 5 నుంచి 10 కిలోమీటర్లు. ఈ ప్రయాణానికి సైకిలే తగిన రవాణా సాధనం అంటారు అర్బన్ ట్రాన్స్పోర్ట్ నిపుణుడు ప్రశాంత్ బాచు. ‘మెట్రో రైలు వస్తున్నా.. మన ప్రజా రవాణా వ్యవస్థలో ప్రస్తుతం ఉన్న రష్ తగ్గదు. ఎందుకంటే ఆర్టీసీ, సైకిల్ స్టేషన్లతో మెట్రో స్టేషన్లు ఎంతగా అనుసంధానం అవుతాయనే దానిని బట్టే ఇది సక్సెస్ అవుతుంది’ అంటారాయన. ప్రస్తుతం రహేజా మైండ్‌స్పేస్ జంక్షన్ టు బయో డైవర్సిటీ పార్కు వరకు 1.2 కిలోమీటర్ల మేర నగరం మొత్తానికి ఒకే ఒక్క సైకిల్ ట్రాక్ ఉంది. కొన్ని రహదారులపై ఎల్లో లైన్స్ వేసి అదే సైకిల్ ట్రాక్ అంటున్నారు. ఇక, నక్లెస్ రోడ్, గచ్చిబౌలి, ఇందిరాపార్క్ ప్రాంతాల్లో సైకిల్ స్టేషన్లు ఉన్నాయి. ‘మన రోడ్లపై సైకిల్ ట్రాక్‌లు లేవు. కనీసం సైకిల్ వే సూచించే గుర్తులూ లేవు. అయినా సరే.. ఇది దేశంలోనే మంచి సైకిల్ ఫ్రెండ్లీ సిటీ. అంతేకాదు.. సిటీలో సైక్లింగ్ పెరుగుతోంది. నేను సైక్లింగ్ చేసిన మొదట్లో రోజూ ఐదారుగురిని రోడ్లపై చూసేవాడిని. వారంతా చిరు వ్యాపారులే. ఇప్పుడు నిత్యం 60 మంది వరకు కనిపిస్తున్నారు. వీళ్లలో ఎక్కువ మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులే’ అంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి కృష్ణ మండవ.
శ్రీనివాస్ కొల్లి
ప్రొఫెషన్: అడ్మినిస్ట్రేటివ్ ఇన్చార్జ్, మాక్రో మీడియా సిస్టమ్స్
సైకిల్ టు వర్క్: ఏడేళ్లుగా..
పెడల్ పవర్: ఎల్లారెడ్డిగూడ-చర్లపల్లి ఐడీఏ
(రానుపోను 44 కి.మీ.)
ట్రాక్‌లైన్: చాలా కాలం
ఒబేసిటీతో బాధపడ్డా. సైక్లింగ్‌తో ఫిట్ అయ్యా.
ప్రవీణ్ పమిడిముక్కల
ప్రొఫెషన్: కంట్రీహెడ్, రన్కోడ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్స్
సైకిల్ టు వర్క్: రెండేళ్ల నుంచి
పెడల్ పవర్: బోయిన్పల్లి-బంజారాహిల్స్
(రానుపోను 16 కి.మీ.)
ట్రాక్‌లైన్: హెల్త్ బెనిఫిట్ కోసమైనా సిటీలో సైక్లింగ్ కల్చర్ పెరగాలి.
కృష్ణ మండవ
ప్రొఫెషన్: అసిస్టెంట్ మేనేజర్, అగ్రికల్చర్ ఇన్సూరెన్స్
కార్పొరేషన్
సైకిల్ టు వర్క్: తొమ్మిదేళ్లుగా..
పెడల్ పవర్: సికింద్రాబాద్-బషీర్‌బాగ్
(అప్‌అండ్‌డౌన్ 14 కి.మీ.)
ట్రాక్‌లైన్: తక్కువ దూరాలకు సైకిల్‌పైనే ప్రయాణించాలి.
తీరు మారితేనే...
‘సిటీలో నేటికీ సైకిల్ అంటే పేదవాడి రవాణా సాధనంగానే చూస్తున్నారు. నగరాలను జీవనయోగ్యంగా తీర్చిదిద్దే క్రమంలో ఆధునిక హంగులపైనే దృష్టి సారించి, సైకిళ్లను విస్మరిస్తున్నారు. ఫలితంగానే సిటీలో సైకిల్ ట్రాక్‌లు కనిపించట్లేదు’ అంటారు సైకిల్ టు వర్క్ కోఆర్డినేటర్ విశాల. ‘సిటీలైఫ్‌లో ఏదైనా కెరీర్లో స్థిరపడగానే చాలామంది తమ స్థాయి, హోదా పెరిగే కొద్దీ... బైక్.. ఆ తరువాత కారు.. ఇలా వారి స్టేటస్ సింబల్స్ మారిపోతున్నాయి. నిజానికి లైఫ్‌స్టైల్ అప్‌గ్రేడ్ చేసుకోవడం అంటే, హోదా చిహ్నాలను పెంచుకుంటూ పోవడం కాదు కదా! అందరూ ఇంధన వాహనాలే వాడితే.. రోడ్లన్నీ వాటితోనే నిండిపోతే పరిస్థితి ఏమిటి?..ఈ ప్రశ్నకు సమాధానమే సైకిల్ టు వర్క్’ అంటారామె. ఐడెంట్‌సిటీ ఫౌండర్ డెరైక్టర్ కూడా అయిన ఈమె.. సిటీలో సైక్లింగ్‌ను పెంచేందుకు గల అవకాశాలపై తెలంగాణ రాష్ట్ర ఇండ్రస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీఎస్ఐఐసీ)తో కలిసి ప్రాజెక్ట్ రిపోర్ట్‌ను రూపొందిస్తున్నారు.
రాజశేఖర్ బత్తుల
ప్రొఫెషన్: ఇన్చార్జ్, గోస్ గ్రీన్ స్టోర్స్
సైకిల్ టు వర్క్: నాలుగేళ్లుగా..
పెడల్ పవర్: సనత్‌నగర్-బంజారాహిల్స్
(రానుపోను 16 కి.మీ.)
ట్రాక్‌లైన్: సిటీలో ఇప్పుడున్న ట్రాఫిక్ స్థితిగతులకు సైకిలే బెటర్ ఆప్షన్.