కాళ్లు తెగి ముక్కలై.. బతుకుల్లో నిప్పు పెట్టిన బాణసంచా
సాక్షిప్రతినిధి, ఖమ్మం/ కారేపల్లి: బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ఏర్పాట్లు సిద్ధమయ్యాయి.. కార్యకర్తలు ఉత్సాహంగా ర్యాలీ తీశారు.. డప్పు చప్పుళ్లు, పూలు, బాణసంచా మధ్య సభావేదిక వద్దకు వచ్చారు.. కానీ బాణసంచా నిప్పురవ్వలు సమీపంలోనే ఉన్న పూరి గుడిసెపై పడ్డాయి. కాసేపటికే అగ్నికీలలు లేచాయి.
కొందరు కార్యకర్తలు, విలేకరులు, పోలీసులు పరుగెత్తి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు.. అంతలోనే ఒక్కసారిగా భారీ పేలుడు.. కన్నుమూసి తెరిచేలోపే తెగిపడిన కాళ్లు, పాదాలు.. మాంసపు ముద్దలు.. రక్తపు మరకలు.. బాధితుల ఆర్తనాదాలు.. ఖమ్మం జిల్లా కారేపల్లి (సింగరేణి) మండలం చీమలపాడులో బుధవారం ఈ విషాద ఘటన జరిగింది. గుడిసెలోని సిలిండర్ పేలి ఆ శకలాలు అతివేగంగా దూసుకురావడంతో.. ఏడుగురికి కాళ్లు తెగిపోగా, మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి.
అంతా పది నిమిషాల్లోనే..
బుధవారం వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. ఎంపీ నామా నాగేశ్వర్రావు, వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ దీనికి హాజరవుతుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. సభా ప్రాంగణానికి కొంతదూరం నుంచే డప్పు చప్పుళ్లతో ర్యాలీ నిర్వహించారు. ఉదయం 11.20 గంటలకు అంతా ప్రాంగణం వద్దకు వచ్చారు. ఈ సమయంలో కొందరు కార్యకర్తలు ఉత్సాహంగా బాణసంచా పేల్చారు.
సుమారు వంద మీటర్ల దూరంలోని రాజన్న రాములుకు చెందిన గుడిసెపై నిప్పురవ్వలు పడ్డాయి. మెల్లగా అంటుకుని 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా అగ్నికీలలు లేచాయి. అది చూసిన నేతలు, కార్యకర్తలు, విలేకరులు, పోలీసులు సుమారు 50 మంది గుడిసె వద్దకు చేరుకున్నారు. అప్పటికే సభా ప్రాంగణంలో ఉన్న ట్యాంకర్ నుంచి నీళ్లు పడుతూ గుడిసెపై చల్లడం మొదలుపెట్టారు. మంటలు కాస్త తగ్గినట్టే కనిపించినా.. 11.40 గంటలకు గుడిసెలోని సిలిండర్ పెద్ద శబ్ధంతో పేలింది.
సిలిండర్ కింది ప్లేట్ దూసుకొచ్చి..
సిలిండర్ పేలి ముక్కలవడంతో దాని అడుగున ఉండే మందపాటి ప్లేట్ అత్యంత వేగంతో చక్రంలా గాల్లో ఎగురుతూ సభా ప్రాంగణంవైపు దూసుకొచ్చింది. దాని ధాటికి గుడిసె సమీపంలో ఉన్న కొందరికి కాళ్లు తెగి ముక్కలయ్యాయి. మరికొందరికి లోతుగా తెగి మాంసం ఊడిపడింది. సుమారు 100 మీటర్ల పరిధిలో మాంసం ముద్దలు, రక్తం వెదజల్లినట్టుగా పడి భీతావహంగా మారింది.
అంతా కొన్ని సెకన్లలోనే జరిగిపోయింది. కాళ్లు తెగిపడిన వారు హాహాకారాలు చేస్తున్న దృశ్యాలు అందరినీ కలచివేశాయి. పేలుడు జరిగినప్పుడు ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా స్టేజీపైనే ఉన్నారు. ఘటనా స్థలంలో ఉన్న పోలీసులు, కార్యకర్తలు వెంటనే గాయపడినవారిని పోలీసు, ప్రైవేటు వాహనాల్లో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి, సంకల్ప ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ముగ్గురు మృతి.. నలుగురి పరిస్థితి విషమం
ఈ దుర్ఘటనలో మొత్తం 11 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో ముగ్గురు మృతి చెందగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. మరో నలుగురికి స్పల్పగాయాలు అయ్యాయి. మృతి చెందినవారిలో అజ్మీరా మంగు చీమలపాడు గ్రామపంచాయతీ 5వ వార్డు మెంబర్, బానోతు రమేశ్, ధర్మసోతు లక్ష్మా ఇద్దరూ బీఆర్ఎస్ కార్యకర్తలు.
ఇక తీవ్రంగా గాయపడ్డవారిలో తేజావత్ భాస్కర్, అజ్మీరా హరిబాబు, నరాటి వెంకన్నలు బీఆర్ఎస్ కార్యకర్తలు. మిగతావారిలో ముగ్గురు విలేకరులు, ఒకరు సీఐ డ్రైవర్, మరొకరు మహారాష్ట్ర వలస కూలీ ఉన్నారు. క్షతగాత్రుల్లో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
ఖమ్మం ఆస్పత్రిలో మిన్నంటిన రోదనలు..
క్షతగాత్రులు, మృతుల కుటుంబీకులు, బంధువుల రోదనలతో ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రి దద్దరిల్లిపో యింది. కాళ్లు తెగిపోవడంతో వ్యవసాయ కూలీలమైన తమకు జీవనాధారం ఎవరంటూ బాధితులు భోరుమన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు, ఎమ్మెల్యేలు రాములునాయక్, సండ్ర వెంకటవీరయ్య, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి క్షతగాత్రులను, మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. మరోవైపు బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలంటూ.. ఆస్పత్రి వద్ద ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దీంతో చాలాసేపు గందరగోళం నెలకొంది.
తీవ్ర గాయాలైనవారు
► సందీప్ (35), బాజుమల్లాయ్గూడెం, మహారాష్ట్ర వలస కూలీ (రెండు కాళ్లు పూర్తిగా పోయాయి. హైదరాబాద్‌లో చికిత్స)
► తేజావత్ భాస్కర్ (27), తవిసిబోడు (ఒక కాలు పోయింది. హైదరాబాద్‌లో చికిత్స)
► ఆంగోత్ రవి కుమార్(25), వెంకిట్యా తండా (కాలు తొలగించారు. హైదరాబాద్‌లో చికిత్స)
► దాసా నవీన్ (43), ముస్తఫానగర్, ఖమ్మం, కారేపల్లి సీఐ డ్రైవర్ (కాలు పూర్తిగా పోయింది. ఖమ్మంలో చికిత్స)
స్వల్ప గాయాలైన వారు
► తేళ్ల శ్రీనివాస్, రిపోర్టర్
► బండి రామారావు, రిపోర్టర్
► అజ్మీరా హరిబాబు, మూడ్తండా
► నరాటి వెంకన్న, చీమలపాడు
► (వీరంతా ఖమ్మం, కారేపల్లి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు).
కేసీఆర్, కేటీఆర్ దిగ్భ్రాంతి
సాక్షి, హైదరాబాద్: చీమలపాడు ఘటనపై బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి పువ్వాడ అజయ్, ఎంపీ నామాలకు ఫోన్ చేసి ఘటన వివరాలు తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. ఇక ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు, క్షతగాత్రులకు అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ ప్రకటించారు. క్షతగాత్రులకు వారికి మెరుగైన చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలని పార్టీ నేతలను ఆదేశించారు.
ప్రమాదంలో మృతులు
► బానోత్ రమేశ్ (39), స్టేషన్ చీమలపాడు (కాళ్లు తెగిపోయాయి. ఆస్పత్రిలో మృతి)
► అజ్మీరా మంగు (38), చీమలపాడు (కాళ్లు తెగిపోయాయి. ఆస్పత్రిలో మృతి)
► ధర్మసోతు లక్ష్మా (56), గేటు రేలకాయలపల్లి (కాలికి గాయంతో హైదరాబాద్ తరలిస్తుండగా మృతి)
మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు: మంత్రి పువ్వాడ
కారేపల్లి మండలం చీమలపాడు ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రభుత్వం తరపున అందజేస్తున్నట్లు చెప్పారు.
అలాగే క్షతగాత్రులు కోలుకునే వరకు పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. కాగా, ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి పువ్వాడ.. జిల్లా నాయకులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. అలాగే, క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యులతో మాట్లాడారు.
బీఆర్ఎస్ రూ.5 లక్షల సాయం
చీమలపాడు ఘటన బాధాకరమని ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు.. బీఆర్ఎస్ తరఫున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్టు ప్రకటించారు. అలాగే నామా ముత్తయ్య ట్రస్ట్ నుంచి మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున, క్షతగాత్రు లకు రూ.50 వేల చొప్పున ఇస్తున్నట్టు చెప్పారు.
ఇక మృతుల కుటుంబాలకు రూ.2లక్షలు, గాయపడ్డవారికి రూ.లక్ష చొప్పన తాను వ్యక్తిగతంగా ఆర్థిక సాయం అందిస్తానని ఎమ్మెల్యే రాములునాయక్ ప్రకటించారు. దుర్ఘటన నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో మూడు రోజులు సంతాప దినాలుగా పాటించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధు తెలిపారు.