గ్యాస్ లీకై మంటలొస్తే ఇలా చేయండి
న్యూఢిల్లీ: ఎల్పీజీ గ్యాస్ లేని ఇళ్లును ఈ రోజుల్లో దాదాపు చూపించలేం. ప్రతి ఇంట్లో ఇదొక నిత్యావసరం. వంట చేసుకునేందుకు ఇది ఎంత సౌకర్యంగా ఉంటుందో ఒక్కోసారి లీకైతే అంత వినాశనాన్ని చూపిస్తుంది. అత్యధిక శబ్దంతో భారీ పేలుడు కూడా సంభవించి విధ్వంసాన్ని సృష్టిస్తుంది. ప్రాణనష్టాన్ని కలగ జేస్తోంది. వేసవి కాలంలో ఇలాంటి సంఘటనలు కాస్తంత ఎక్కువగా జరిగేందుకు అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అలాంటి ప్రమాదం నుంచి ఎలా బయటపడవచ్చో ఢిల్లీకి చెందిన సుశీల్ కుమార్ అనే పోలీసు అధికారి ఫేస్బుక్ ద్వారా ఓ మాక్‌డ్రిల్ చేసి చూపించారు.
పెద్ద మొత్తంలో జనసమూహం ఓ చోట చేరి ఉండగా వారి మధ్యలో గ్యాస్ బండ పెట్టి దానిని ఆయనే లీక్ చేసి నిప్పంటించి అనంతరం తేలికగా ఆర్పేశారు. అందుకు ఓ తడిపిన వస్త్రాన్ని ఉపయోగించారు. గ్యాస్ లీకవ్వగానే అది మండటానికి ఆక్సిజన్ సహకరిస్తుందని, అది అందకుండా చేస్తే గ్యాస్ మంటను ఆర్పేయవచ్చని అందుకు తడిసిన వస్త్రాన్ని తీసుకొని మండుతున్న గ్యాస్ సిలిండర్‌పై పూర్తిగా కప్పివేస్తే వెంటనే ఆ మంట ఆరిపోతుందని ప్రయోగాత్మకంగా చూపించారు. ఈ వీడియోను ఆయన తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేయగా దానిని ఇప్పటకి 60లక్షలమంది వీక్షించారు. మొత్తానికి ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.