అదృశ్యం కాదు.. ఆత్మహత్య
నిమ్స్ కార్డియాలజీ విభాగాధిపతి శేషగిరిరావు భార్య అదృశ్యం కేసులో వీడిన మిస్టరీ
హైదరాబాద్, న్యూస్‌లైన్: ఆరు రోజుల క్రితం పుణ్యక్షేత్రాలకు వెళుతున్నానని ఫోన్లో చెప్పి అదృశ్యమైన నిమ్స్ కార్డియాలజీ విభాగం అధిపతి డాక్టర్ డి.శేషగిరిరావు భార్య విజయలక్ష్మి(45) ఇంట్లోని స్టోర్‌రూమ్‌లో శవమై కనిపించారు. ఇన్ని రోజులుగా విజయలక్ష్మి కోసం విస్తృతంగా గాలించిన కుటుంబ సభ్యులు చివరికి ఇంటి స్టోర్‌రూమ్ నుంచి దుర్వాసన రావడం గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఆమె అదృశ్యం మిస్టరీ వీడింది. విజయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమిక అంచనాకు వచ్చారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్డు నం. 51లోని సెలైంట్ వ్యాలీ ఫ్లాట్ నం.1లో శేషగిరిరావు కుటుంబం నివసిస్తోంది. విజయలక్ష్మి గత నెల 28న తన భర్తకు ఫోన్ చేసి పుణ్యక్షేత్రాలకు వెళ్తున్నానని చెప్పారు. ఆందోళనతో వెంటనే ఇంటికి తిరిగి వచ్చిన శేషగిరిరావుకు భార్య కనిపించలేదు. ఆ సమయంలో ఇంట్లో మరెవరూ లేరు. అనంతరం ఆమె కోసం బంధువులు, స్నేహితుల నివాసాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. ఈ నేపథ్యంలో గత నెల 30న శేషగిరిరావు చిన్న కూతురు వాసవి తన తల్లి కనిపించడం లేదంటూ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాగా, బుధవారం మధ్యాహ్నం శేషగిరిరావు కూతురు స్టోర్ రూం నుంచి దుర్వాసన రావడాన్ని గుర్తించి తలుపులు తీయడానికి ప్రయత్నించినా తెరచుకోలేదు. దీంతో ఆమె తండ్రికి సమాచారం అందించడంతో శేషగిరిరావు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం పోలీసులు శేషగిరిరావు ఇంటికి చేరుకొని స్టోర్ రూంను తెరిచి చూడగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న విజయలక్ష్మి మృతదేహం కనిపించింది. పక్కనే నిద్రమాత్రలు వేసుకున్న ఆనవాళ్లు కనిపించాయి. సూసైడ్ నోట్ కూడా లభించింది. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకుని మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. గత నెల 28వ తేదీనే విజయలక్ష్మి నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కాగా, విజయలక్ష్మిది ఆత్మహత్యేనని, ఇందులో ఎలాంటి సందేహాలు లేవని బంజారాహిల్స్ ఏసీపీ అశోక్‌కుమార్ ‘సాక్షి’తో చెప్పారు. విజయలక్ష్మి ఆత్మహత్య ఎప్పుడు చేసుకున్నదీ పోస్టుమార్టంలో తేలుతుందని తెలిపారు.
‘నాన్నా ... నువ్వు లేని లోకంలో ఉండలేను..’
విజయలక్ష్మి ఆత్మహత్యకు ముందు రాసిన లేఖలో ‘నాన్నా నువ్వు లేని ఈ లోకంలో ఉండలేకపోతున్నాను. నేను కూడా నీ దగ్గరకు వచ్చేస్తున్నాను’ అని ఉన్నట్లు తెలిసింది. మూడు నాలుగేళ్లుగా విజయలక్ష్మి మానసిక పరిస్థితి బాగా లేదని ఆమె కుటుం బీకులు పోలీసులకు తెలిపారు. ఏడాది క్రితమే ఆమె తండ్రి చనిపోవడంతో కుంగుబాటుకు గురైందని... తరచూ తండ్రిని గుర్తుచేసుకుంటూ రోదించేదని చెప్పారు.