దాశరథి కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం
హైదరాబాద్ : దాశరథి కృష్ణమాచార్య జయంతి వేడుకలను తెలంగాణ ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది. రవీంద్రభారతిలో మంగళవారం జరిగిన దాశరథి 89వ జయంతి వేడుకల్లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ సమాజం గర్వించదగ్గ కవి దాశరథి అని ప్రశంసించారు. నా తెలంగాణ.... కోటి రతనాల వీణ అని చెప్పిన గొప్ప వ్యక్తి దాశరథి అని అన్నారు. దాశరథి తెలంగాణ కళల కాణాచి అని, ఆయన జయంతి వేడుకలు జరుపుకోవటం గర్వంగా ఉందన్నారు.
దాశరథి పేరుమీద స్మారక అవార్డు ఏర్పాటు చేసి అవార్డులు ప్రదానం చేస్తామని, తెలంగాణలో ఒక యూనివర్సిటీకి గాని, విద్యా సంస్థకు గాని దాశరథి పేరు పెడుతామని కేసీఆర్ తెలిపారు. చరిత్రలో గుర్తుండిపోయేలా దారశథి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. దాశరథి కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటం బాధాకరమని, ఆయన కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు. కాగా రవీంద్ర భారతి అభివృద్ధికి రూ.30 లక్షల నుంచి కోటికి పెంచుతున్నట్లు ఆయన ప్రకటించారు.