హోంగార్డులకు శుభవార్త
రోజు వారి వేతనం రూ.300 నుంచి రూ.400కు పెంపు
ఏడాదికి రెండు జతల యూనిఫాం..పెరిగిన పరేడ్ అలవెన్స్
హైదరాబాద్: పోలీసు విభాగంలో స్వచ్ఛంద సేవలందిస్తున్న హోంగార్డులకు తీపి కబురు ఇది. హోంగార్డుల ఒక రోజు వేతనాన్ని(డైలీ డ్యూటీ అలవెన్స్) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.300 నుంచి రూ.400కు పెంచింది. ప్రస్తుతం ఏడాదికి ఒక జత యూనిఫాం మాత్రమే మంజూరు చేస్తుండగా, ఇకపై రెండు జతలు ఇవ్వనుంది. పరేడ్ అలవెన్స్ కింద ప్రస్తుతం నెలకు రూ.24 చెల్లిస్తుండగా..ఇకపై రూ.100 చెల్లించనుంది. ఈ మేరకు హోంగార్డుల జీతభత్యాలను పెంచుతూ రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి బి.వెంకటేషం గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న 16, 460 మంది హోంగార్డులకు ప్రయోజనం కలగనుంది. రోజుకు రూ.300 చొప్పున ప్రస్తుతం నెలకు రూ.9 వేల వరకు వస్తున్న వీరి జీతం ఇక నుంచి రూ.12 వేల వరకు పెరగనుంది. అయితే, ఈ పెంపు ఎప్పటి నుంచి అమలులోకి వస్తుందో ఈ ఉత్తర్వుల్లో పేర్కొనలేదు.