కాల్పుల కేసులో డాకూరి బాబుకు రిమాండ్
హైదరాబాద్ : నగరంలోని బోయిన్పల్లి పరిధిలోని పాతబోయిన్‌పల్లిలో కాంగ్రెస్ నాయకుడు యాదగిరిపై కాల్పులు జరిపిన ఘటనలో అరెస్టు అయిన డాకూరి బాబు అలియాస్ డక్కల బాబు(29) కర్నే ఉమేష్ అలియాస్ సుమన్ (20)లను టాస్క్‌పోర్స్, బోయిన్పల్లి పోలీసులు బుధవారం రిమాండ్‌కు తరలించారు. ఎస్సై శ్రీనివాస్ అందించిన వివరాల ప్రకారం హస్మత్‌పేటలోని సర్వే నం1లో భూతగదా విషయమై శివరాజ్ యాదవ్ అనే వ్యక్తిని హత్య చేస్తే పెద్దమొత్తంలో నగదుతో పాటు 100 గజాల స్థలం ఇచ్చేందుకు 2009లో యాదగిరి, మక్కల నర్సింహ్మ, కనకరాజులు నిందితుడు బాబుకు హామిచ్చారు. కాని హత్య అనంతరం ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోవడంతో పాటు బాబును అడ్డుపెట్టుకుని పలు భూవివాదాల్లో వీరు తలదూర్చి అక్రమంగా డబ్బులు సంపాదించారని నిందితుడు విచారణలో వెల్లడించాడని ఎస్సై తెలిపారు.
దీంతో కక్షతో ఈ నెల 13న నిందితుడు బాబు మరోక వ్యక్తి కర్నే ఉమేష్, అలియాస్ సుమన్(20)తో కలసి పల్సర్‌బైక్‌పై వచ్చి దండుగల యాదగిరి హోండా యాక్టీవాపై వస్తుండగా శ్రీనివాస మెటర్నిటి నర్సింగ్‌హోమ్ వద్ద 3 రౌండ్లు కాల్పులు జరిపాడని ఈ ఘటనలో యాదగిరి గాయలతో పీఎస్‌కు చేరుకోగా ఆస్పత్రిలో చేర్పించామని వివరించారు. కాల్పులు జరిగిన రోజు రెండు కంట్రీమేడ్ వెపన్ తపంచాలు, బుల్లేట్లు, 2 సెల్ఫోన్లు స్వాధినం చేసుకున్నామని చెప్పారు.
పలు కేసుల్లో నిందితుడు...
2009 నుంచి 2013 వరకు డాకూరి బాబు నగరంలోని అల్వాల్ పీఎస్ గోపాలపురం ఉఫ్పల్, రాంగోపాల్‌పేట, చైతన్యపురి, సరూర్‌నగర్ పోలీస్స్టేషన్లతో పాటు ఘట్కేసర్, భువనగిరి రూరల్స, భధ్రాచలం పోలీస్స్టేషన్ల పరిధిలోని పలు కేసుల్లో నిందితుడుగా ఉన్నాడని ఎస్సై తెలిపారు. అల్వాల్, భువనగిరిలో 2 హత్యకేసులు, మిగిలిన పోలీస్స్టేషన్ల పరిధిలో దోపీడి, దొంగతనాలు, అయుధ చట్టం క్రింద కేసులు ఉన్నాయని వివరాలు వెల్లడించారు. నార్త్‌జోన్ డీసీపీ సుమతి, బేగంపేట ఏసీపీ రంగరావు, సీఐ కిరణ్ నేతృత్వంలో కేసును దర్యాప్తు చేసినట్లు తెలిపారు.