dalit indian chamber of commerce and industry
-
దళితులమైనందుకు సిగ్గుపడకూడదు
తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య హైదరాబాద్: మనం ఏ స్థాయిలో ఉన్నా దళి తులం అని చెప్పుకొనేందుకు సిగ్గుపడకూడదని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. తమది దళిత పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. దళితులకు పారిశ్రామిక రంగంలో కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని ఎదగాలని ఆయన సూచించారు. తనకు రాజకీయ గురువు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడలోని హోటల్ ఐటీసీ గ్రాండ్ కాకతీయులో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) ఆధ్వర్యంలో 10వ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదారి కిషోర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, రాములు నాయక్, డిక్కి జాతీయ చైర్మన్ మిలిం ద్ కాంబ్లే, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తోపాటు పలురాష్టాల డిక్కి అధ్యక్షులు పాల్గొన్నారు. దళిత సమాజంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు డిక్కి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వ్యాపారంలో రాణిస్తే సమాజంలో గౌరవం ఇస్తారని పలువురు దళిత ప్రజాప్రతినిధులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు మంచి అవకాశాలు ఇస్తున్నదని, దానిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి కూడా సహకరిస్తామని డిక్కి జాతీయ చైర్మన్ మిలింద్ కాంబ్లే అన్నారు. ఈ కార్యక్రమంలో డిక్కి తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
అభివృద్ధిలో దళితులనూ భాగస్వాముల్ని చేయాలి
* డీఐసీసీఐ ఏపీ చాప్టర్ అధ్యక్షుడు రవికుమార్ నర్రా * తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో డీఐసీసీఐ శాఖల ఏర్పాటు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశం పారిశ్రామికాభివృద్ధి చెందాలంటే ముందుగా దళితులు ఆర్థికంగా పురోగతిని సాధించాలని దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డీఐసీసీఐ) ఏపీ చాప్టర్ అధ్యక్షుడు, పద్మశ్రీ రవికుమార్ న ర్రా చెప్పారు. ప్రజల కొనుగోలు శక్తి పెరగడంతో పాటు పునఃపెట్టుబడులు పెరిగినప్పుడే పారిశ్రామికాభివృద్ధి జరుగుతుందన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో డీఐసీసీఐ శాఖలను శనివారం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో డీఐసీసీఐని కూడా రెండు రాష్ట్రాల్లో విస్తరించామన్నారు. తెలంగాణ రాష్ట్రానికి అధ్యక్షుడిగా శ్రీనివాస్‌ని, అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా ఎం. మధుసూదన్ రావును నియమించినట్లు చెప్పారు. ‘కేంద్ర ప్రభుత్వం ఏటా ఆయా రాష్ట్రాల్లో రూ.70 వేల కోట్ల విలువ చేసే పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేస్తోంది. ఇందులో 20 శాతం సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల (ఎంఎస్ఎంఈ) నుంచి కొనుగోలు చేస్తున్నారు. ఇందులో 4 శాతం (సుమారుగా రూ.7 వేల కోట్ల విలువ గల) ఎస్సీ, ఎస్టీలకు చెందిన పారిశ్రామిక వస్తువులను కొనుగోలు చేయాలి..’ అని రవికుమార్ డిమాండ్ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో దళితులను భాగస్వాముల్ని చేయడంతో పాటు ఆయా ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ‘ప్రి-క్వాలిఫికేషన్’ను వెంటనే తొలగించాలని కోరారు. -
రవికుమార్ నర్రాకు పద్మశ్రీ
న్యూఢిల్లీ: ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికైన వారిలో రాష్ట్రానికి చెందిన రవి కుమార్ నర్రాతో పాటు అయిదుగురు పారిశ్రామిక దిగ్గజాలు ఉన్నారు. దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ రాష్ట్ర చాప్టర్‌కి రవి కుమార్ నర్రా ప్రెసిడెంట్‌గా వ్యవహరిస్తున్నారు. అటు, మరో దళిత పారిశ్రామిక దిగ్గజం రాజేశ్ సరాయా సహా ప్రతాప్ గోవిందరావ్ పవార్, మల్లికా శ్రీనివాసన్, అశోక్ కుమార్ మాగో పద్మశ్రీ పురస్కారాలకు ఎంపికయ్యారు. ప్రతాప్ గోవిందరావు పవార్ కేంద్ర మంత్రి శరద్ పవార్‌కి సోదరుడు. ఆయన సకల్ మీడియా గ్రూప్‌కి, అజయ్ మెటాకెమ్ గ్రూప్‌కి చైర్మన్‌గాను వ్యవహరిస్తున్నారు. మరోవైపు, 1.6 బిలియన్ డాలర్ల టాఫే (ట్రాక్టర్స్ అండ్ ఫార్మ్ ఎక్విప్మెంట్) సంస్థకి మల్లికా శ్రీనివాసన్ చైర్మన్‌గా ఉన్నారు. టీవీఎస్ మోటార్స్ చైర్మన్ వేణు శ్రీనివాసన్ సతీమణి మల్లికా. ఇక రాజేశ్ సరాయా బహుళ జాతి మెటల్స్ దిగ్గజం స్టీల్ మాంట్ ట్రేడిం గ్ని నిర్వహిస్తున్నారు. పద్మశ్రీ అందుకోనున్న మరో దిగ్గజం అశోక్ కుమార్ మాగో.. అమెరికా కేంద్రంగా పనిచేసే ఇన్వెస్ట్మెంట్ కన్సల్టింగ్ సంస్థ మాగో అండ్ అసోసియేట్స్‌కి చైర్మన్‌గా ఉన్నారు. దళిత పారిశ్రామికవేత్తలకిచ్చిన గుర్తింపు: నర్రా పురస్కారాన్ని ప్రకటించిన సందర్భంగా తనను సంప్రతించిన ‘సాక్షి’ బిజినెస్ బ్యూరో ప్రతినిధితో నర్రా రవికుమార్ మాట్లాడారు. ఈ పురస్కారాన్ని దళిత పారిశ్రామికవేత్తలకు ఇచ్చిన గుర్తింపుగా భావిస్తున్నానంటూ... ‘‘దళితులు కేవలం రిజర్వేషన్లకే పరిమితం గాకుండా తగిన అవకాశాలు కల్పిస్తే వ్యాపార రంగంలో కూడా రాణించగలరు. దేశం సమ్మిళిత వృద్ధి సాధించాలంటే దళితులను కూడా అందులో భాగస్వాములను చేయాల్సిన అవసరం ఉంది. అమెరికాలో ఎలాగైతే బ్లాక్ క్యాపిటలిజానికి ప్రోత్సాహం లభించిందో దేశీయంగా కూడా దళిత క్యాపిటలిజాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఉపాధి అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంది. దీనిపై ప్రభుత్వాలు ప్రత్యేక శ్రద్ధ చూపాలి. అప్పుడే దేశ అభివృద్ధి వేగవంతమవుతుంది.’’ అని వ్యాఖ్యానించారు.