దళితులమైనందుకు సిగ్గుపడకూడదు
తెలంగాణ ఉపముఖ్యమంత్రి రాజయ్య
హైదరాబాద్: మనం ఏ స్థాయిలో ఉన్నా దళి తులం అని చెప్పుకొనేందుకు సిగ్గుపడకూడదని తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి టి.రాజయ్య అన్నారు. తమది దళిత పక్షపాత ప్రభుత్వమని చెప్పారు. దళితులకు పారిశ్రామిక రంగంలో కల్పిస్తున్న రాయితీలను సద్వినియోగం చేసుకుని ఎదగాలని ఆయన సూచించారు. తనకు రాజకీయ గురువు దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి అని పేర్కొన్నారు. మంగళవారం సోమాజిగూడలోని హోటల్ ఐటీసీ గ్రాండ్ కాకతీయులో దళిత్ ఇండియన్ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (డిక్కి) ఆధ్వర్యంలో 10వ జాతీయ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఉప ముఖ్యమంత్రి రాజయ్య, పెద్దపల్లి ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, గాదారి కిషోర్, ఎమ్మెల్సీలు భానుప్రసాద్, రాములు నాయక్, డిక్కి జాతీయ చైర్మన్ మిలిం ద్ కాంబ్లే, తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తోపాటు పలురాష్టాల డిక్కి అధ్యక్షులు పాల్గొన్నారు.
దళిత సమాజంలో వ్యాపారవేత్తలను ప్రోత్సహించేందుకు డిక్కి చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. వ్యాపారంలో రాణిస్తే సమాజంలో గౌరవం ఇస్తారని పలువురు దళిత ప్రజాప్రతినిధులు సూచించారు. తెలంగాణ ప్రభుత్వం పారిశ్రామిక వేత్తలకు మంచి అవకాశాలు ఇస్తున్నదని, దానిని సద్వినియోగం చేసుకొని ప్రభుత్వానికి కూడా సహకరిస్తామని డిక్కి జాతీయ చైర్మన్ మిలింద్ కాంబ్లే అన్నారు. ఈ కార్యక్రమంలో డిక్కి తెలంగాణ చాప్టర్ ప్రతినిధులు పాల్గొన్నారు.