ఆసుపత్రుల్లో సదుపాయాల కల్పనకు రూ.66.6 కోట్లు: రాజయ్య
హైదరాబాద్: తెలంగాణలోని పలు ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు దాదాపు రూ.66.6 కోట్లు ఖర్చు చేయనున్నట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి, ఉప ముఖ్యమంత్రి డాక్టర్ టి.రాజయ్య తెలిపారు. వెంగళరావునగర్ కాలనీలోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కార్యాలయంలో బుధవారం వైద్య అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ నగరంలోని పలు ప్రభుత్వ ఆసుపత్రులోని బెడ్లు, ఇతర సౌకర్యాలు రోగులకు సరిపడాలేవని చెప్పారు. నీలోఫర్ ఆసుపత్రిలో 30 పడకలకుగాను దాదాపు 250 మంది పిల్లలు చేరుతున్నారని, 500 మంది రోగులకు సరిపడా స్టాఫ్ ఉండగా 1500 మంది పేషెంట్లు వస్తున్నారని తెలిపారు. ప్రైమరీ హెల్త్ సెంటర్(పీహెచ్సీ), అర్బన్ హెల్త్ పోస్టు(యూహెచ్‌పీ)ల్లోనే పలు వైద్య పరీక్షలు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
యూహెచ్‌పీ, పీహెచ్సీలో మౌలిక సదుపాయాల కోసం దాదాపు రూ.113 కోట్లు ఖర్చు చేయనున్నట్లు చెప్పారు. మార్చి 31వ తేదీలోపు ఈ నిధులను ఖర్చు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. నీలోఫర్‌లో ఇప్పటికే దాదాపు రెండున్నర కోట్లు విద్యుత్, మరో రెండున్నర కోట్ల రూపాయల మేర మంచినీటి బకాయిలు ఉన్నాయని, వాటిని త్వరలోనే చెల్లించనున్నామన్నారు. ఈ ఏడాది రాష్ట్రానికి 200 ప్రభుత్వ, 350 ప్రైవేటు మెడికల్ సీట్లును సాధించుకోగలిగామని మంత్రి చెప్పారు. వరంగల్‌లో హెల్త్ యూనివర్శిటీ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో, నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి, నల్లగొండ జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రి, కళాశాల నిర్మించాలని యోచిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణలో 30 నుంచి 40 శాతం వరకు అంటువ్యాధులు తగ్గాయని తెలిపారు. సీమాంధ్రతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న తెలంగాణ ఉద్యోగులు హైదరాబాద్ నగరానికి డిప్యూటేషన్ కోరుతున్నారని, తెలంగాణలోనే వారు ఉద్యోగాలు నిర్వహించే విధంగా చర్యలు తీసుకోనున్నామని పేర్కొన్నారు. జీవీకే అమర్థత కారణంగా పలు 104, 108 వాహనాలు మూలన పడ్డాయన్నారు. జూనియర్ డాక్టర్లు సమ్మెకు ముందు తనను సంప్రదించలేదని చెప్పారు. ప్రొటెక్షన్ ఫోర్స్‌ను అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రవేశపెట్టనున్నామని పేర్కొన్నారు.