Ind Vs Pak: ఆసియా కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరుగబోయేది అక్కడే..!
ఆసియా కప్-2023ను (వన్డే ఫార్మాట్) ఈ ఏడాది హైబ్రిడ్ మోడల్లో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఆగస్టు 31 నుండి సెప్టెంబర్ 17 వరకు జరిగే ఈ టోర్నీకి పాకిస్తాన్, శ్రీలంక దేశాలు ఆతిథ్యమివ్వనున్నాయి. ఈ టోర్నీ ఎప్పటి నుంచి ఎప్పటివరకు జరుగుతుందన్న వివరాలు వెల్లడి అయినప్పటికీ.. వేదికలు, ఫిక్షర్స్ ఇంకా ఖరారు కాలేదు. అయితే, ఈ టోర్నీలో భారత్-పాక్ గ్రూప్ దశ మ్యాచ్ ఎక్కడ నిర్వహించాలనే అంశంపై మాత్రం ఆసియా క్రికెట్ కౌన్సిల్‌కు (ఏసీసీ) ఓ క్లారిటీ ఉన్నట్లు తెలుస్తోంది.
అందరూ అనుకున్న విధంగా భారత్-పాక్ మ్యాచ్‌ను కొలొంబోలో కాకుండా డంబుల్లాలో నిర్వహించాలని ఏసీసీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఏసీసీ ఇదివరకే నిర్ణయం కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. లంకలో జరిగే మిగతా మ్యాచ్‌ల వేదికలు ఖరారయ్యాక, ఈ విషయాన్నిఅధికారికంగా ప్రకటించాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సీజన్లో కొలొంబోలో అత్యధిక వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నందున భారత్-పాక్ మ్యాచ్ వెన్యూను డంబుల్లాకు మార్చాలని అనుకున్నట్లు ఏసీసీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు పాకిస్తాన్ లెగ్ మ్యాచ్‌లన్నీ లాహోర్‌లో జరుగుతాయని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఇదివరకే ప్రకటించింది.
కాగా, ఇదివరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. పాకిస్తాన్లో 4 మ్యాచ్‌లు, శ్రీలంకలో 9 మ్యాచ్‌లు జరుగుతాయి. భారత్, పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్, నేపాల్ జట్లు రెండు గ్రూపులుగా విడిపోయి టైటిల్ కోసం పోటీపడతాయి. ఓ గ్రూప్‌లో భారత్, పాకిస్తాన్, నేపాల్.. మరో గ్రూప్‌లో శ్రీలంక, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్ జట్లు ఉన్నాయి.