టీఆర్ఎస్ వైపు డీసీసీబీ డెరైక్టర్ల చూపు
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సమసి పోయిందనుకుంటున్న డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు) చైర్మన్ దామోదర్‌రెడ్డిపై అవిశ్వాసం అంశం ఇంకా రగులుతూనే ఉంది. కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు డెరైక్టర్లు పార్టీ మారే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా తూర్పు జిల్లాకు చెందిన ఈ డెరైక్టర్లు త్వరలోనే టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. దీంతో తప్పని సరి పరిస్థితుల్లో చైర్మన్ దామోదర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పే యోచనలో ఉన్నారు.
తనపై పొంచి ఉన్న ‘అవిశ్వాస’ గండం నుంచి గట్టెక్కేందుకు ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపే ఈ భారీ మార్పులు ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. వరుస ఎన్నికల్లో జిల్లాలో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించింది. రైతులకు సంబంధించిన సహకార రంగంపై తన ఆధిపత్యాన్ని చాటుకునేందుకు టీఆర్ఎస్ పావులు కదుపుతోంది. ముఖ్యంగా జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మంత్రి చక్రం తిప్పుతున్నట్లు సమాచారం.
డెరైక్టర్లలో నిర్లిప్తత
డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డిపై కొందరు డెరైక్టర్లు అసంతృప్తితో ఉన్నారు. తాము డెరైక్టర్లుగా ఎన్నికైనప్పటికీ పెద్దగా ప్రయోజనం లేకుండా పోయిందని వారు ఆవేదన చెందుతున్నారు. నిధులు, నిర్ణయాల్లో తాము నిమిత్తమాత్రులగా ఉన్నామని నిర్లిప్తతో ఉన్నారు. డీసీసీబీ సమావేశాలకు హాజరు కావడం, ప్రయాణ భత్యాలు తీసుకుని వెళ్లిపోవడానికే పరిమితమవుతున్నామనే కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో రాష్ట్రంలో సర్కారు మారడంతో డీసీసీబీ చైర్మన్ పదవిపై అవిశ్వాస అంశం తెరపైకి వచ్చింది.
డీసీసీబీ వైస్ చైర్మన్ చంద్రశేఖర్‌రెడ్డి ఈ అసంతృప్త డెరైక్టర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నాలు చేశారు. కొందరు డెరైక్టర్లతో క్యాంపు నిర్వహించారు. ఈ మేరకు దామోదర్‌రెడ్డి జాగ్రత్త పడి 14 డెరైక్టర్ల మద్దతును కూడగట్టే ప్రయత్నం చేశారు. గత నెల 27న నిర్మల్ మండలం మంజులాపూర్ సొసైటీలో ఈ డెరైక్టర్లతో సమావేశం ఏర్పాటు చేసి, డెరైక్టర్ల మద్దతు తనకు ఉందని దామోదర్‌రెడ్డి ప్రకటించారు. కానీ ఈ అవిశ్వాస అంశం ఇంకా రగులుతూనే ఉండటంతో దామోదర్‌రెడ్డి టీఆర్ఎస్లోకి వెళ్లేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.