Dance Recording
-
జాతర ముసుగులో రికార్డింగ్ డ్యాన్స్‌లు!
ఆనందపురంలో మాజీ ఎంపీపీ నిర్వాకం మంత్రి ఫొటో పెట్టి వేదిక ఏర్పాటు సహకరించిన పోలీసు యంత్రాంగం విశాఖపట్నం :రికార్డింగ్ డ్యాన్స్‌లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించినా ఆనందపురం జంక్షన్లో మాత్రం అమ్మవారి జాతర పేరుతో ఓ మాజీ ఎంపీపీ ఏర్పాటు చేసి అందరికీ వినోదం పంచాడు. నియంత్రించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి తమ వంతు సహకారం అందించారు. వేదికపై జిల్లా మంత్రి ఫొటోను ఏర్పాటు చేయడంతో పోలీసు యంత్రాంగం అతనికి దాసోహమంది. కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అధికారులకు భారీగా నజరానా అందినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. ఆనందపురానికి చెందిన మాజీ ఎంపీపీ ఒకరు మండలంలోని వేములవలసలో పైడితల్లమ్మ ఉత్సవాలను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆదివారం డ్యాన్స్ బేబీ డ్యాన్స్, మంగళవారం సినీ మ్యూజికల్ నైట్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు కాస్త పక్కదారి పట్టి రికార్డింగ్ డ్యాన్స్‌లుగా మారిపోయాయి. యాంకరింగ్ పేరుతో వచ్చిన మహిళలతో కురుచ దుస్తులు వేయించి ప్రదర్శన చేయించారు. ఆదివారం నాటి కార్యక్రమం శ్రుతిమించి మహిళలు సిగ్గు పడే విధంగా ఉందని పలువురు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం నాటి కార్యక్రమంలో కూడా సినిమా పాటలకు పురుషులు, మహిళలతో గ్రూపు రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను మంత్రి ముఖ్య అనుచరుడు వేదికపై కూర్చొని కాసేపు వీక్షించారని తెలిసింది. వీధి డ్యాన్స్‌లపై కేసులు బనాయించే పోలీసులు ఈ కార్యక్రమాలపై కన్నెత్తై చూడకపోవడం వెనక మంత్రి ఫొటోలతో ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు నజరానాలు కూడా అందడమే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
బాలికలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు
ఆ పై వ్యభిచారం ఓ బాలిక తల్లిసహా నలుగురు అరెస్టు విజయవాడ సిటీ: బాలికలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించడంతోపాటు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురిని కమిషనరేట్ పరిధిలోని నున్న రూరల్ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల్లో ఓ బాలిక తల్లి, ఆమెను ముఠాకు పరిచయం చేసిన మహిళ, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన బ్రోకర్లు ఇద్దరు ఉన్నారు. బుధవారం సెంట్రల్ జోన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ టి.ప్రభాకరబాబు వివరాలు వెల్లడించారు. విజయవాడ వాంబేకాలనీకి చెందిన కోడిరెక్కల శివకుమారి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దీన్ని గమనించిన పొరుగింటి హుసేన్‌బీ విశాఖ జిల్లాలో రికార్డింగ్ డ్యాన్స్ చేసేందుకు కుమార్తెను పంపితే భారీగా నగదు ఇస్తారని చెప్పగా శివకుమారి అంగీకరించింది. ఆ తర్వాత ఆమె అనకాపల్లికి చెందిన సన్యాసిరావు, విమలను సంప్రదించి వినాయకచవితి సందర్భంగా నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్స్‌లకు తన కుమార్తెను పంపింది. వారు డ్యాన్స్‌తోపాటు బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. తిరిగి దసరా ఉత్సవాలకు బాలికను తీసుకెళ్లేందుకు సన్యాసిరావు, విమల రావడంతో భయపడిన బాలిక నున్న రూరల్ సీఐ సహేరాను కలిసి గోడు చెప్పుకుంది. ఆమె విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా నిందితులను అరెస్టు చేసి బాలికను రక్షించాలంటూ ఆదేశించారు. రంగంలోకి దిగిన నున్న పోలీసులు బాలిక తల్లితోపాటు సహకరించిన హుసేన్‌బీ, సన్యాసిరావు, విమలను అరెస్టుచేసి రికార్డింగ్ డ్యాన్స్‌లకు తరలించేందుకు సిద్ధం చేసిన ఇద్దరు బాలికలను రక్షించి వసతి గృహానికి తరలించారు. విలేకరుల సమావేశంలో నున్న రూరల్ సీఐ సహేరా, ఎస్ఐలు శివప్రసాద్, సురేష్‌బాబు పాల్గొన్నారు.