
జాతర ముసుగులో రికార్డింగ్ డ్యాన్స్‌లు!
ఆనందపురంలో మాజీ ఎంపీపీ నిర్వాకం
మంత్రి ఫొటో పెట్టి వేదిక ఏర్పాటు సహకరించిన పోలీసు యంత్రాంగం
విశాఖపట్నం :రికార్డింగ్ డ్యాన్స్‌లను రాష్ట్ర వ్యాప్తంగా నిషేధించినా ఆనందపురం జంక్షన్‌లో మాత్రం అమ్మవారి జాతర పేరుతో ఓ మాజీ ఎంపీపీ ఏర్పాటు చేసి అందరికీ వినోదం పంచాడు. నియంత్రించాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర పోషించి తమ వంతు సహకారం అందించారు. వేదికపై జిల్లా మంత్రి ఫొటోను ఏర్పాటు చేయడంతో పోలీసు యంత్రాంగం అతనికి దాసోహమంది. కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించిన అధికారులకు భారీగా నజరానా అందినట్టు స్థానికులు చర్చించుకుంటున్నారు. స్థానికుల సమాచారం మేరకు.. ఆనందపురానికి చెందిన మాజీ ఎంపీపీ ఒకరు మండలంలోని వేములవలసలో పైడితల్లమ్మ ఉత్సవాలను నిర్వహించడానికి భారీ ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా ఆదివారం డ్యాన్స్ బేబీ డ్యాన్స్, మంగళవారం సినీ మ్యూజికల్ నైట్ పేరుతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాలు కాస్త పక్కదారి పట్టి రికార్డింగ్ డ్యాన్స్‌లుగా మారిపోయాయి. యాంకరింగ్ పేరుతో వచ్చిన మహిళలతో కురుచ దుస్తులు వేయించి ప్రదర్శన చేయించారు.
ఆదివారం నాటి కార్యక్రమం శ్రుతిమించి మహిళలు సిగ్గు పడే విధంగా ఉందని పలువురు బాహటంగానే వ్యాఖ్యానిస్తున్నారు. మంగళవారం నాటి కార్యక్రమంలో కూడా సినిమా పాటలకు పురుషులు, మహిళలతో గ్రూపు రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించారని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రదర్శనను మంత్రి ముఖ్య అనుచరుడు వేదికపై కూర్చొని కాసేపు వీక్షించారని తెలిసింది. వీధి డ్యాన్స్‌లపై కేసులు బనాయించే పోలీసులు ఈ కార్యక్రమాలపై కన్నెత్తై చూడకపోవడం వెనక మంత్రి ఫొటోలతో ఫ్లెక్సీల ఏర్పాటుతో పాటు నజరానాలు కూడా అందడమే కారణమన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.