దేశవ్యాప్తంగా పేపర్ లీక్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఈ నేపధ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ రాష్ట్రంలో జరిగే పరీక్షల్లో అవకతవకలు జరగకుండా ఉండేందుకు పలు చర్యలు ప్రారంభించాయి. వాటిలో ఉత్తరప్రదేశ్ ఒకటి.
ఉత్తరప్రదేశ్ జనాభాలో 56 శాతం మంది యువతే ఉన్నారు. పేపర్ లీకేజీలను అరికట్టాలని ఇక్కడి యువత ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంటుంది. తాజాగా యూపీలోని యోగి సర్కారు పేపర్ లీకేజీలను అరికట్టేందుకు సరికొత్త ప్రణాళిక రూపొందించింది. దీని ప్రకారం రాష్ట్రంలో జరిగే ఏ పరీక్షకైనా వాటి నిర్వహణ బాధ్యతను నాలుగు ఏజెన్సీలకు అప్పగిస్తారు.
ప్రింటింగ్ ప్రెస్ ఎంపికలో గోప్యత ఉండటంతోపాటు ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ఆ ప్రింటింగ్ ప్రెస్‌ను సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తారు. ప్రింటింగ్ ప్రెస్‌కు వచ్చే ప్రతి ఒక్కరినీ తనిఖీ చేస్తారు. బయటి వ్యక్తులెవరూ ప్రెస్‌లోకి ప్రవేశించడానికి అనుమతించరు. ప్రింటింగ్ ప్రెస్‌లోనికి స్మార్ట్‌ఫోన్‌లు, కెమెరాలు తీసుకెళ్లడాన్ని నిషేధిస్తారు.
రాష్ట్రంలో జరిగే ఏదైనా పరీక్షకు హాజరయ్యే అభ్యర్థుల సంఖ్య నాలుగు లక్షలు దాటితే, ఆ పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ప్రతి షిఫ్ట్‌లో తప్పనిసరిగా రెండు లేదా అంతకంటే ఎక్కువ పేపర్ సెట్‌లు అందుబాటులో ఉంచుతారు. ఒక్కో సెట్ ప్రశ్నాపత్రాల ముద్రణ వివిధ ఏజెన్సీల ద్వారా జరుగుతుంది. అలాగే ప్రశ్నాపత్రాల మూల్యాంకనంలో ఎటువంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా పలు చర్యలు చేపట్టనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment