డిగ్రీ విద్యార్థిని బలిగొన్న పెద్ద నోటు రద్దు
లక్నో: పెద్ద నోట్ల రద్దుతో భవిష్యత్తులో ఎలాంటి ఫలితాలు ఉండనున్నాయో అనే విషయం పక్కనబెడితే ప్రస్తుతం మాత్రం సామాన్య ప్రజలను నానా వెతలకు గురిచేస్తోంది. ఏకంగా ప్రాణాలను బలితీసుకుంటోంది. ఈ నిర్ణయం అమలుకోసం ముందస్తు చర్యలు తీసుకోని కారణంగా కొంతమంది బలవుతున్నారు. డబ్బు కోసం క్యూలో నిల్చోలేక ఇప్పటికే కొన్ని చోట్లలో వృద్ధులు ప్రాణాలు కోల్పోతుండగా తాజాగా బలవన్మరణాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. కాలేజీలో చదివే విద్యార్థి తాను ఫీజు కట్టలేకపోయిన కారణంగా ఆత్మహత్యకు పాల్పడి నిండు ప్రాణం తీసుకున్నాడు.
కొద్ది రోజులుగా డబ్బు కోసం బ్యాంకు ముందు వరుసలో నిల్చొని చివరకు డబ్బు పొందలేకపోవడంతో మనస్తాపం చెంది ప్రాణాలు తీసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకుంది. సురేశ్(18) అనే ఓ యువకుడు బాందా జిల్లాలోని మావయి బుజుర్గ్ గ్రామానికి చెందినవాడు. అతడు పంచనేహి డిగ్రీ కాలేజీలో సైన్స్ విభాగంలో డిగ్రీ చేస్తున్నాడు. అతడి కుటుంబ సభ్యుల ప్రకారం ఈ రోజు(బుధవారం) కాలేజీలో అతడు పరీక్ష ఫీజు కట్టాల్సి ఉంది. ఇందుకోసం గత కొద్ది రోజులుగా సురేశ్ ప్రతిరోజు బ్యాంకు వద్దకు వెళ్లే సరికి పెద్ద మొత్తంలో క్యూలు ఉండటం, తన వంతు రాకముందే డబ్బు అయిపోవడం జరుగుతోంది.
ఇలా నిన్నటి వరకు జరిగింది. దీంతో ఇక తాను ఫీజు కట్టలేనేమో అనే భయంతో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విద్యార్థి మరణానికి బ్యాంకే కారణం అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆ గ్రామస్తులంతా సదరు బ్యాంకుపై రాళ్లతో దాడికి దిగారు. ఇదే ఉత్తరప్రదేశ్ లో వైద్యం కోసం డబ్బులు తీసుకురాలేకపోవడంతో సమయానికి ఆస్పత్రిలో చూపించక నాలుగేళ్ల బాలిక బ్యాంకు ఆవరణలోనే చనిపోయిన విషయం తెలిసిందే.