బాలికలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించడంతోపాటు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురిని కమిషనరేట్ ...
ఆ పై వ్యభిచారం ఓ బాలిక తల్లిసహా నలుగురు అరెస్టు
విజయవాడ సిటీ: బాలికలతో రికార్డింగ్ డ్యాన్స్‌లు చేయించడంతోపాటు వ్యభిచార కార్యకలాపాలు నిర్వహిస్తున్న నలుగురిని కమిషనరేట్ పరిధిలోని నున్న రూరల్ పోలీసులు అరెస్టుచేశారు. నిందితుల్లో ఓ బాలిక తల్లి, ఆమెను ముఠాకు పరిచయం చేసిన మహిళ, విశాఖ జిల్లా అనకాపల్లికి చెందిన బ్రోకర్లు ఇద్దరు ఉన్నారు. బుధవారం సెంట్రల్ జోన్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఏసీపీ టి.ప్రభాకరబాబు వివరాలు వెల్లడించారు. విజయవాడ వాంబేకాలనీకి చెందిన కోడిరెక్కల శివకుమారి ఆర్థికంగా ఇబ్బందులు పడుతోంది. దీన్ని గమనించిన పొరుగింటి హుసేన్‌బీ విశాఖ జిల్లాలో రికార్డింగ్ డ్యాన్స్ చేసేందుకు కుమార్తెను పంపితే భారీగా నగదు ఇస్తారని చెప్పగా శివకుమారి అంగీకరించింది. ఆ తర్వాత ఆమె అనకాపల్లికి చెందిన సన్యాసిరావు, విమలను సంప్రదించి వినాయకచవితి సందర్భంగా నిర్వహించిన రికార్డింగ్ డ్యాన్స్‌లకు తన కుమార్తెను పంపింది.
వారు డ్యాన్స్‌తోపాటు బాలికతో బలవంతంగా వ్యభిచారం చేయించారు. తిరిగి దసరా ఉత్సవాలకు బాలికను తీసుకెళ్లేందుకు సన్యాసిరావు, విమల రావడంతో భయపడిన బాలిక నున్న రూరల్ సీఐ సహేరాను కలిసి గోడు చెప్పుకుంది. ఆమె విషయాన్ని పోలీసు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లగా నిందితులను అరెస్టు చేసి బాలికను రక్షించాలంటూ ఆదేశించారు. రంగంలోకి దిగిన నున్న పోలీసులు బాలిక తల్లితోపాటు సహకరించిన హుసేన్‌బీ, సన్యాసిరావు, విమలను అరెస్టుచేసి రికార్డింగ్ డ్యాన్స్‌లకు తరలించేందుకు సిద్ధం చేసిన ఇద్దరు బాలికలను రక్షించి వసతి గృహానికి తరలించారు. విలేకరుల సమావేశంలో నున్న రూరల్ సీఐ సహేరా, ఎస్‌ఐలు శివప్రసాద్, సురేష్‌బాబు పాల్గొన్నారు.