కాలు జారితే కెలాసం
విజయనగరం మున్సిపాలిటీ:
సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీగా ఉంటూ త్వరలో కార్పొరేషన్ కావలసిన విజయనగరంలో మురుగునీటి పారుదల వ్యవస్థ పట్టణ ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. నిర్వహణలో పాలకవర్గం, అధికారయంత్రాంగం విఫలమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మీసాల గీత మున్సిపల్ చైర్మన్‌గా ఉన్నప్పుడు పట్టణంలో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని కోరుతూ రూ.180 కోట్లతో ప్రతిపాదనలు పంపించారు. అవి కార్యరూపందాల్చేందుకు ఎవరూ చిత్తశుద్దితో వ్యవహరించకపోవటంతో కాగితాలకే పరిమితమయ్యాయి.
నిత్యం ప్రయాణికుల రాకపోకలతో కిటకిటలాడే మున్సిపల్ కార్యాలయం, గంటస్థంభం, కన్యకాపరమేశ్వరి కూడళ్లు, సిటీబస్టాండ్ దరి, పెద్ద మార్కెట్ పరిసర ప్రాంగణంలో ఈ పరిస్థితి ఎక్కువగా ఉంది. ఈ ప్రాంతం లోతట్టు కావడంతో సమీప ప్రాంతాల్లో వాడుక నీరు, వర్షపు నీరు ఇక్కడి ప్రధాన కాలువలగుండా పెద్ద చెరువులోకి వెళ్తుంటుంది. ఈ డ్రెయిన్‌లో ఎప్పటికప్పుడు పూడిక తొలగించకపోవడంతో భారీ వర్షాలు కురిసేటప్పుడు వర్షపు నీరంతా రోడ్డుపై నిలిచిపోతోంది. ఆ సమయంలో ఎవరైనా ప్రమాదవశాత్తు పడిపోతే మృత్యువాత పడాల్సిందే. పూడికతీత పేరుతో నెలల తరబడి కాలువలను తవ్వి వదిలేస్తున్నారు. వాటిలో చిన్నారులు పడిపోతే ముప్పు తప్పని పరిస్థితులున్నాయి.
మున్సిపల్ సిబ్బంది పనులు చేసేటప్పుడు రాత్రి వేళల్లో కూడా కనిపించేలా రేడియం స్టిక్కర్లున్న బ్యానర్‌ను ఏర్పాటు చేసి అప్రమత్తం చేయాల్సి ఉన్నా అలాంటి జాగ్రత్తలు తీసుకోవటం లేదు. ప్రమాదాలు జరిగినప్పుడు అధికార యంత్రాంగం హడావుడి చేయటం తప్ప సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవడం లేదు.