Dangerous adventures
-
Viral Video: కొ.. కొ.. కోబ్రా! లగెత్తండ్రోయ్!!.. ఆగండి..!
మీకు పాములంటే భయం లేదా.. ఐతే ఈ వీడియో చూసిన తర్వాత ఖచ్చితంగా మీ అభిప్రాయం మార్చుకుంటారు. పెద్ద కోబ్రాను ఏమాత్రం జంకుబొంకు లేకుండా, అసలుతత్తరపాటే లేకుండా ఓ మహిళ ఒట్టిచేతులతోనే పట్టుకుందండీ! ఈ వీడియో చూస్తేనే గుండెకాయ గొంతులోకొచ్చినంత పనౌతుంది! ధైర్యముంటే.. మీరు చూడండి. ఓ పాడుబడ్డ ఇంటిలో పడగ విప్పి బుసలు కొడుతున్న భారీ కోబ్రాను ఒక మహిళ ఒట్టి చేతులతో పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. చుట్టూ చూస్తున్న జనాలు భయంతో దూరంగా పారిపోగా ఆమె మాత్రం చాలా చాకచక్యంగా, ధైర్యంగా కోబ్రాను చేతులతో పట్టుకుని ఇంటి నుంచి బయటికి తెచ్చి, బయట రోడ్డు పక్కన వదిలిపెడుతుంది. ఐతే కోబ్రా మళ్లీ అదే ఇంటివైపు వెళ్లడానికి ప్రయత్నించగా, ఆమె కోబ్రా తలను గట్టిగా పట్టుకుని గోనె సంచిలో వేయడం ఈ వీడియోలో కనిపిస్తుంది. ఈ మొత్తం వీడియోలో కోబ్రా అనేక సార్లు సదరు మహిళపై దాడి చేయగా, ఆమె మాత్రం చాలా అలవోకగా దాని దాడి నుంచి తప్పించుకుంటుంది. చదవండి: ఇదే అతి పె..ద్ద.. గోల్డ్ మైనింగ్! ఏటా లక్షల కిలోల బంగారం తవ్వుతారట! నాలుగు నిముషాల నిడివిగల ఈ వీడియోను ‘అమేజింగ్ క్యాచ్ స్నేక్ బై హ్యాండ్’ క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇది పాత వీడియో అయినప్పటికీ ఇపుడు సామాజిక మాధ్యమాల్లో మళ్లీ వైరల్ అవుతోంది. ఆ మహిళ పాము పట్టే నైపుణ్యాన్ని చూసిన నెటిజన్లు అవాక్కవుతున్నారు. దీంతో లక్షల మంది ఆసక్తిగా ఈ వీడియోను వీక్షిస్తున్నారు. ఇక వేలల్లో లైకులు, విభిన్న కామెంట్లతో తిరిగి వార్తల్లో నిలిచింది. చిన్న పామును కిలోమీటరు దూరం నుంచి చూసినా.. నాకు హార్ట్ అటాక్ వస్తుందని ఒకరు, మృత్యువుతో ఆటలాడినందుకు ఆమెకు ఒలంపిక్ మెడల్ ఇవ్వాలని మరొకరు, ఈ క్యాచింగ్ స్టైల్ చాలా ప్రమాదకరమైనది. ఆమె అదృష్టం బాగుందని పలువురు నెటిజన్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఏదిఏమైనప్పటికీ దైర్యంగా ఉండటం మంచిదేకానీ విష సర్పాల జోలికి వెళ్లే ముందు తగు జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం మర్చిపోకూడదు. చదవండి: Viral Video: బాబోయ్..! చావును ముద్దాడాడు.. -
రియాల్టీ షో.. పట్టుతప్పిన ఫీట్.. వైరల్
రియాల్టీ షోలో ఊహించని ఘటన ఎదురైంది. ఫీట్ చేస్తున్న జంటలో పట్టుతప్పి మహిళ కిందపడిపోగా.. రక్షణ చర్యలు ఉండటంతో ఆమె సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడగలిగారు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు తెగ వైరల్ అవుతోంది. అమెరికా టీవీ రియాల్టీషో అమెరికా'స్ గాట్ టాలెంట్‌లో ఇది చోటు చేసుకుంది. ట్రాపేజ్ ట్రిక్స్ చేసే అక్రోబాట్(విన్యాసాలు చేయటం) జంట టైస్ నిల్సన్, అతని భార్య మేరీ వోల్ఫేలు విన్యాసాలు చేయటానికి సిద్ధమయ్యారు. చుట్టూ మంట.. పైన రింగులపై విన్యాసాలు చేస్తూ ఊపిరి బిగపట్టుకునే రీతిలో విన్యాసాలు చేశారు. ఈ క్రమంలో కళ్లకు గంతలు కట్టుకుని ప్రదర్శన చేస్తుండగా.. పట్టుతప్పి వోల్ఫే కిందపడిపోయారు. అయితే పరుపు ఉండటంతో ఆమె సురక్షితంగా బయటపడగలిగారు. వెంటనే టైస్ కూడా కిందకు దిగగా.. వారిద్దరికీ జడ్జిలు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. తాము మరొకసారి ఫీట్ చేస్తామని వాళ్లు జడ్జిలతో చెప్పగా.. ‘ఇది టాలెంట్ షో మాత్రమేనని.. ఫర్ఫెక్షన్ షో కాదని’ రిస్క్ వద్దంటూ సున్నితంగా వారించారు. ఫీట్‌చేస్తున్న సమయంలో జడ్జిల హవభావాలు, ప్రేక్షకులు గోల.. ఆ జంట రెండేళ్ల కొడుకు, అతని నానమ్మ చూస్తూ దిగ్భ్రాంతికి గురికావటం.. మొత్తానికి ఆ కట్‌తో ఎపిసోడ్‌పై ఆత్రుత పెంచేసిన AGT నిర్వాహకులు.. ఎపిసోడ్ వ్యూవర్షిప్ మాత్రం విపరీతంగా రాబట్టడంలో సక్సెస్ అయ్యారు. -
ప్రాణాలతో పరాచికం
సాక్షి, ముంబై: లోకల్‌తోపాటు దూరప్రాంతాల రైళ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేయడం కొందరు యువతకు నిత్యకృత్యంగా మారడంపై గవర్నమెంట్ రైల్వే పోలీసులు (జీఆర్పీ) తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బోగీలపై ప్రయాణించడం, ప్రవేశద్వారానికి వేలాడుతూ విన్యాసాలు చేయడం, తిరిగే ఫ్యాన్లలో వేళ్లు పెట్టడం వంటివి లోకల్‌రైళ్లలో సర్వసాధారణంగా మారాయి. బోగీలపై ప్రయాణించిన వారిలో పలువురు మరణించడం, గాయపడడం తెలిసిందే. ఇలాంటి దుస్సాహసాలు చేయవద్దని రైల్వే అధికారులు ప్రతినిత్యం అనౌన్స్మెంట్ల ద్వారా విజ్ఞప్తులు చేస్తున్నా ఆకతాయిలు పట్టించుకోవడం లేదు. వీరి చేష్టలు సహ ప్రయాణికులకు భయం పుట్టిస్తున్నాయి. ఇలాంటి ప్రమాదకర విన్యాసాలు చేస్తున్న వారిలో అత్యధికులు యువకులేనని జీఆర్పీ పోలీసులు చెబుతున్నారు. ప్రమాదకర విన్యాసాల నిరోధానికి ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టామని ప్రకటించారు. బోగీల్లో ప్రాంణాంతక విన్యాసాలు చేస్తూ గత నెల 500 మంది జీఆర్పీకి చిక్కారు. కౌన్సెలింగ్ వల్ల పెద్దగా ఫలితాలు రాకపోవడంతో పోలీసులు మరో తరహా ప్రయత్నం మొదలుపెట్టారు. తప్పు చేసిన యువకుల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నారు. ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య కాలంలో ప్రాంణాంతక విన్యాసాలు చేసిన 618 మందిని పశ్చిమరైల్వే ఆర్పీఎఫ్ పోలీసులు పట్టుకున్నారు. ఇదే కాలంలో సెంట్రల్ రైల్వేలోని బండ్లలో ప్రాణాంతక విన్యాసాలు చేసిన 1,208 మందిని పట్టుకున్నారు. విన్యాసాలు వికటించి చాలా మంది యువకులు ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయని ఆర్పీఎఫ్ సీనియర్ అధికారి ఒకరు అన్నారు. ఈ పనులు చేస్తున్న వారిలో అత్యధికులు 14 ఏళ్ల నుంచి 22 ఏళ్ల వయస్సు గల వారేనని తేలింది. ముంబై సెంట్రల్ సీనియర్ రైల్వే పోలీస్ రాజేంద్ర త్రివేది ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రైళ్లలో విన్యాసాలు చేస్తున్న వారిపై నిఘా ఉంచాల్సిందిగా తమ సిబ్బందిని ఆదేశించామన్నారు. ‘వీరిని పట్టుకోవడం వల్ల ప్రయోజనం కనిపించడం లేదు. తిరిగి ప్రాణాంతక విన్యాసాలు చేస్తూనే ఉన్నారు. అందుకే వీళ్ల తల్లిదండ్రులను రైల్వే స్టేషన్లకే పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తున్నాం. విన్యాసాలు చేయడం ద్వారా యువకులు ఏ విధంగా మరణించడం..తీవ్ర గాయాలపాలైన వీడియోలను తల్లిదండ్రులకు చూపించి అవగాహన కల్పిస్తున్నాం. ఫలితంగా సదరు తల్లిదండ్రులు పిల్లలను మందలించే అవకాశం ఉంటుంది. దీంతో యువకులు కూడా తిరిగి విన్యాసాలు చేయకుండా ఉంటారు’ అని త్రివేది వివరించారు. ప్రాణాంతక విన్యాసాలు చేస్తున్న వారిని పట్టుకోవడం కోసం తరచూ తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని చెప్పారు.