‘ఉద్దానం’ నీటిలో ప్రమాదకర మూలకాలు
జీఎస్ఐ పరీక్షలో నిర్ధారణ: నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి
- కిడ్నీ వ్యాధులతో వేల సంఖ్యలో మరణాలకు ఇదే కారణం
- భూ ఉపరితల జలాల వినియోగమే దీనికి పరిష్కారమని వెల్లడి
- 26న ఉద్దానంలో బహిరంగసభ: సాక్షి ఈడీ రామచంద్రమూర్తి
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో వేల మంది మరణాలకు అక్కడి తాగునీరే కారణమని జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) పరీక్షలో తేలింది. ఉద్దానం ప్రాంతంలోని నీటిలో కిడ్నీవ్యాధులకు కారణ మయ్యే మూలకాలు అధిక స్థాయిలో ఉన్నట్లు నిర్ధారణ అయింది. శుక్రవారం నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి, సాక్షి మీడియా గ్రూప్ ఎడిటోరియల్ డైరెక్టర్ కె.రామచంద్రమూర్తి, సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్యలతో కలసి ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రతినిధులు హైదరాబాద్‌లోని ప్రెస్‌క్లబ్‌లో ఈ వివరాలను వెల్లడించారు.
కిడ్నీ వ్యాధుల బారినపడి వేల సంఖ్యలో మరణాలు నమోదవుతున్న ఉద్దానం ప్రాంతంలోని తాగునీటి నమూనాలను ఇటీవ ల సేకరించి జీఎస్ఐలో పరీక్షించినట్లు నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి తెలిపారు. ‘‘తాగే నీటిలో ఏ మూలకం కూడా పరిమితికి మించి ఉంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి. భూగర్భం లో 118 రకాల మూలకాలు ఉంటాయి. వాటిలో 14 రకాలు సాధారణం కంటే ఎక్కువ మోతాదులో ఉంటే కిడ్నీ వ్యాధులు తలెత్తుతా యి. ఉద్దానం ప్రాంతం నుంచి సేకరించిన 12 తాగునీటి నమూనాలను జీఎస్ఐ పరీక్షించింది. ఆ ప్రాంతంలోని ఒక గ్రామంలో 23 మంది కిడ్నీ వ్యాధులతో చనిపోయారు. ఆ గ్రామం లోని తాగునీటిలో కాడ్మియం, యురేనియం, క్రోమియం, లెడ్ మూలకాలు అధిక స్థాయిలో ఉన్నాయి. అవి ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన పరిమితి కంటే చాలా ఎక్కువగా ఉన్నట్లు నిర్ధారించారు. సిలికా స్థాయి కూడా ఎక్కువే ఉంది. కానీ సిలికా ఏ స్థాయిలో ఉంటే ప్రమాదకరమనే అంశాన్ని డబ్ల్యూహెచ్‌వో ఇంకా నిర్ధారించలేదు..’’ అని ఆయన చెప్పారు.
ఉపరితల జలాల వినియోగమే శ్రేయస్కరం
తాగునీరు డబ్ల్యూహెచ్‌వో నిర్ధారించిన ప్రమాణాల ప్రకారం ఉంటే వ్యాధులు రావనేది కూడా అన్ని సందర్భాల్లో జరగదని రాజారెడ్డి చెప్పారు. ఆయా ప్రాంతాల్లోని వాతావరణ పరిస్థితులు, వ్యక్తుల ఆరోగ్యస్థాయిని బట్టి ఉంటుందన్నారు. నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ అధికంగా ఉందని పరిశోధనలలో తేలిందని, దాంతో కోట్ల రూపాయలతో డీఫ్లోరైడ్ వ్యవస్థను ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. కానీ తర్వాత పరిస్థితి ఇంకో రకంగా మారిందని, బోర్ల నుంచి వచ్చే నీటిని సరఫరా చేసే పరిస్థితి వచ్చిందని చెప్పారు. భూగర్భ జలంలో ఎన్నో రకాల మూలకాలు మోతాదుకు మించి ఉంటాయని, వాటన్నింటినీ సరిపోయే స్థాయిలోకి తీసుకురావడం కష్టమని వివరించారు.
తాగేందుకు, వంట కోసం భూ ఉపరితలంలోని నీటినే వినియోగించాలని, కిడ్నీల వ్యాధుల నియంత్రణకు అదే శాశ్వతమైన పరిష్కారమని స్పష్టం చేశారు. ఇక ఈ నెల 26న ఉద్దానంలో కిడ్నీ బాధితులతో బహిరంగ సభ నిర్వహిస్తున్నా మని సాక్షి ఈడీ రామచంద్రమూర్తి చెప్పారు. ఆ సభ ఏర్పాట్లను జర్నలిస్టు రమణమూర్తితో పాటు స్థానికులు కృష్ణమూర్తి, శ్రీనివాస్‌లు పర్యవేక్షిస్తారని వెల్లడించారు. ఉద్దానం ప్రాంత ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లుగా వంశధార నది నీటిని తాగునీటి కోసం సరఫరా చేయాలని మల్లేపల్లి లక్ష్మయ్య డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలోని ప్రజల సమస్యపై ప్రభుత్వం, రాజకీయ పార్టీలే కాదు అందరూ ఆలోచించాలన్నారు. ఇక తమకు అందరూ మద్దతుగా నిలవాలని ఉద్దానం కిడ్నీ బాధితుల సంఘీభావ కమిటీ ప్రధాన కార్యదర్శి వంకల మాధవరావు కోరారు. కిడ్నీ వ్యాధులతో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఉద్దానంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించాలని డిమాండ్ చేశారు.