విద్యార్థినిపై లైంగిక వేధింపులు?
తిరుమలగిరి (సాగర్) : విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయుడు లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఓ విద్యార్థిని ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా.. సదరు ఉపాధ్యాయుడిని విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం చితకబాదారు. విద్యార్థిని, ఆమె తల్లిదండ్రుల కథనం ప్రకారం.. మండలంలోని నేతాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్చార్జి హెచ్ఎమ్గా పనిచేస్తున్న దశరథనాయక్ ఇదే పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థినిని(15) కొంతకాలంగా లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడు. ఉపాధ్యాయుడి వేధింపలుల తాళలేక విద్యార్థిని ఈనెల 7న శనివారం ఇంట్లో ఎవరూలేని సమయంలో గెమాగ్జిన్ పౌడర్‌ను నీళ్లలో కలిపి తాగబోతుండగా తల్లిదండ్రులు అడ్డుకోవడంతో విషయాన్ని వారికి చెప్పింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో సోమవారం ఉదయం విద్యార్థిని తల్లిదండ్రులు సోమవారం ఉదయం పాఠశాలకు వచ్చి ఇన్చార్జి హెచ్ఎమ్ దశరథనాయక్‌ను చితకబాదారు. సంబంధిత ఉపాధ్యాయుడ్ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
ఎంఈఓ విచారణ..
మండలంలోని నేతాపురం పాఠశాలలో ఉపాధ్యాయుడు వేధింపులకు గురిచేస్తున్నాడని విద్యార్థిని తల్లిదండ్రులు సమాచారం ఇవ్వడంతో ఎంఈఓ చెరుపల్లి ఈశ్వరయ్య సోమవారం పాఠశాలకు వచ్చి విచారణ చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పాఠశాలలో జరిగిన సంఘటనపై పూర్తి వివరాలను ఉన్నత అధికారులకు పంపినట్లు తెలిపారు.
కావాలనే నింద మోపారు : ఉపాధ్యాయుడు
ఇట్టి విషయమై ఉపాధ్యాయుడు దశరథనాయక్‌ను వివరణ కోరగా తనకు విద్యార్థులపై ఎలాంటి దురుద్దేశం లేదని, పదో తరగతి పరీక్షల కోసం విద్యార్థులను సమాయత్తం చేయడం కోసమే నిత్యం విద్యార్థులతో మాట్లాడుతానని తప్ప తనకు ఎలాంటి ఆలోచన లేదని చెప్పారు. తనపై కావాలనే నిందను మోపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.