dasari padma
-
దాసరిగారు మనందరిలో జీవించే ఉన్నారు
‘‘చుట్టూ ఉన్నవారికి సహాయం చేయాలన్న గొప్ప హృదయం ఉన్నవారు మా గురువుగారు దాసరి నారాయణరావు. తండ్రి ప్రారంభించిన ఈ సేవా సంస్థను ఆయన కూతురు హేమాలయ కుమారి, అల్లుడు డా. రఘునాథ్ బాబు కొనసాగించడం నిజంగా హ్యాట్సాఫ్’’ అని దర్శకుడు–నటుడు–నిర్మాత ఆర్. నారాయణమూర్తి అన్నారు. డాక్టర్ దాసరి నారాయణరావు అండ్ శ్రీమతి దాసరి పద్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ‘నీడ’ తరపున దాసరి కుమార్తె హేమాలయా కుమారి, అల్లుడు డా. రఘునాథ్‌బాబు పలువురికి స్కాలర్షిప్లు అందించారు. కొంకపురి నాటక కళాపరిషత్‌కు 20 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ– ‘‘ఈ రోజుల్లో తల్లిదండ్రులు వారి పిల్లలకు చదువునే ఆస్తిగా ఇస్తున్నారు. తన దగ్గర పని చేసిన పిల్లలకు ఆసరాగా నిలుస్తూ, వారి పిల్లల చదువులకు గురువుగారి ద్వారా స్కాలర్షిప్లు అందుతున్నాయంటే మా గురువుగారు నిజంగా చిరంజీవే. ఆయన చనిపోలేదు. మనందరిలో జీవించే ఉన్నారు.. ఉంటారు’’ అన్నారు. ‘‘గురువుగారితో నాది ఎన్నో ఏళ్ల అనుబంధం. ఆయన వద్దకు సహాయం కోరి వచ్చే వారిలో ఫ్రాడ్స్ ఉన్నప్పటికీ, వారిని పెద్ద మనసుతో క్షమించి సాయం చేసిన అద్భుతమైన సేవామూర్తి దాసరి నారాయణరావు. ఆయన అందించే స్కాలర్షిప్లను తమ్మారెడ్డి భరద్వాజ, నేను ఫైనలైజ్ చేసేవాళ్లం’’ అన్నారు రేలంగి నరసింహారావు. ‘‘సినిమా వాళ్లు పారితోషికాలు తీసుకుంటూనే సేవ చేస్తున్నాం అంటుంటారని, ప్రభుత్వాల నుంచి సబ్సిడీలు, స్థలాలు కావాలని అడుగుతుంటారని చాలా మంది అంటుంటారు. నిజమే కావొచ్చు కానీ మా గురువు దాసరిగారు నిజంగానే సేవ చేశారు. తెలుగు సినిమా ఉన్నంత కాలం ఆయన కీర్తి అజరామరం. మా గురువుగారి గురించి గిట్టని వాళ్లు ఎన్ని చెప్పినా ముమ్మాటికీ ఆయన సేవ చేశారు. తెలియకుండా ఎంతోమందికి దాన ధర్మాలు చేశారు. మా దృష్టిలో ఆయన ఎప్పటికీ దేవుడే. దాసరిగారి సేవలను ఆయన కూతురు, అల్లుడు కొనసాగించడం ఆనందాన్ని కలిగిస్తోంది’’ అని తమ్మారెడ్డి భరద్వాజ అన్నారు. ఈ కార్యక్రమంలో దాసరి నారాయణరావు మనవళ్లతోపాటు సినీరంగ ప్రముఖులు ధవళ సత్యం, రాజేంద్రకుమార్, సంజీవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
దాసరి కోడలిపై దాడి
సాక్షి, హైదరాబాద్: తన భర్త మొదటి భార్య అర్ధరాత్రి తన ఇంట్లోకి చొరబడటమే కాకుండా తనపై దాడి చేసి గాయపరిచిందని దర్శకరత్న, దాసరి నారాయణరావు కుమారుడు దాసరి తారక హరిహర ప్రభు సతీమణి దాసరి పద్మ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం. 46లో తాను భర్తతో కలిసి ఉంటున్నానని ఈ నెల10వ తేదీ రాత్రి 7 గంటలకు తన భర్త మొదటి భార్య సుశీల, మరో మహిళ సంధ్యతో కలిసి ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించి నీ భర్త ఎక్కడని గొడవపెట్టుకోవడమేగాక, అక్కడే బైఠాయించిందన్నారు. దీంతో తానే ఈ విషయాన్ని తన సోదరుడు నార్ల కోడి, సోదరి లక్ష్మిప్రభ దృష్టికి తీసుకెళ్లానన్నారు. ఆ రాత్రి సుశీల, సంధ్య ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారని, ఈ నెల 11న తెల్లవారుజామున కిచెన్‌లోకి వెళ్తున్న తనపై సుశీల, సంధ్య కర్రతో దాడి చేసినట్లు తెలిపింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు దాసరి సుశీలపై క్రిమినల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కాగా, తారక హరిహర ప్రభు ఆస్తిలో తనకూ వాటా ఉందని సుశీల వాదిస్తున్నారు. -
దాసరి-పద్మల ప్రేమకథ మొదలైందిలా..
హైదరాబాద్: అస్థిర బంధాలు అధికంగా కనిపించే సినీరంగంలో దాసరి నారాయణరావు- పద్మ జంటది అరుదైన ప్రస్థానం. సినిమాలతో సమానంగా భార్య పద్మను ప్రేమించిన దాసరి.. ఆమె చనిపోయిన తర్వాత ఒంటరితనాన్ని అనుభవించారు. ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచిన ఆయన.. తన పద్మ చెందకే వెళ్లిపోయారు. నారాయణరావు-పద్మలది ప్రేమవివాహం. అసలు వాళ్లిద్దరూ ఎక్కడ, ఎప్పుడు, ఎలా కలిశారంటే.. దాసరి నారాయణరావుకు చెన్నై కంటే హైదరాబాద్ అంటేనే ఇష్టం. సినీపరిశ్రమ చెన్నై నుంచి హైదరాబాద్‌కు తరలుతున్న తొలిరోజుల్లోనే ఆయన భాగ్యనగరికి వచ్చేశారు. ఇక్కడి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ఉన్న చార్మినార్ (వీఎస్టీ) సిగరెట్ కంపెనీలో మొదట చిన్న ఉద్యోగం చేశారు. ఆ తరువాత హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లోనూ పనిచేశారు. సమాంతరంగా నాటకరంగంపైనా దృష్టిసారించారు. రవీంద్రభారతి, గాంధీభవన్, త్యాగరాయగానసభల్లో వందలాది నాటకాలు ప్రదర్శించారు. ఓసారి సొంత ఊరు(పాలకొల్లు)కు బయలుదేరిన ఆయన.. తన చెల్లెలకి గాజులు కొందామని పాతబస్తీలోని సుల్తాన్ బజార్ వెళ్లారు.. ‘షాపు వాడు ఏ సైజు కావాలి?’ అని ప్రశ్నించడంతో దాసరికి ఏం చెప్పాలో పాలుపోలేదు. అప్పుడు పక్కనే నిల్చుని గాజులు కొంటున్న ఓ అమ్మాయి చెయ్యిని చూపించి ‘ఈ సైజువి కావాలి’ అని చెప్పారు. ఆ అమ్మాయి ఎవరో కాదు పద్మ! నాటకాలపట్ల ఆసక్తికలిగిన ఆమె.. నారాయణరావును చూడగానే ‘మీరు నాటకాలు వేస్తారుకదా. గాంధీభవన్‌లో మీ ప్లే చూశా’నని అన్నారట. అలా మొదలైనవారి పరిచయం ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకునేదాకా, అటుపై గాఢమైన ప్రేమగా మారింది. కొద్ది రోజులకే పెళ్లిచేసుకోవాలని డిసైడ్ అయ్యారు. పద్మ స్వస్థలం ఖమ్మం జిల్లా. ఆమె తల్లిదండ్రులు సరేనన్నారుకానీ, నారాయణరావు కుటుంబం మాత్రం పెళ్లికి అభ్యంతరం తెలిపింది. అయినాసరే ఇద్దరూ ఒక్కటయ్యారు. సొంత పిల్లలు ముగ్గురే (కొడుకులు ప్రభు, అరుణ్ కుమార్, కూతురు హేమాలయ కుమారి) అయినా, ఇండస్ట్రీలో కొన్ని వందల మందికి దాసరి-పద్మలు అమ్మానాన్నలయ్యారు. దాసరి పార్థివ దేహాన్ని సందర్శించిన నటీనటులు, టెక్నీషియన్లు.. ఆ అమ్మానాన్నలతో తమ అనుబంధాన్ని తలుచుకుని కన్నీటిపర్యంతం అయ్యారు.