dasari srinivasulu
-
చిరస్మరణీయుడు మన సంజీవయ్య
దేశంలోనే తొలి దళిత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య (1921–1972). ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా 1960లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడినప్పుడు ఆయన వయస్సు కేవలం 39 సంవత్సరాలు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన పదేళ్లకే ముఖ్యమంత్రి పదవి చేపట్టిన ఘనుడు. రెండుసార్లు కేంద్ర మంత్రిగా, రెండుసార్లు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా, ఉమ్మడి మద్రాసు రాష్ట్రం మొదలుకొని, ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ కేబినెట్లలో దాదాపు 20 ఏళ్లు వివిధ శాఖల్లోనూ ఆయన పనిచేశారు. నిరుపేద కుటుంబంలో పుట్టిన డి. సంజీవయ్య ముఖ్యమంత్రిగా అనేక సంక్షేమ పథకాలకు నాంది పలికారు. భూమిలేని నిరుపేదలకు 6 లక్షల ఎకరాల బంజరు భూముల పంపిణీ, వృద్ధాప్య పెన్షన్లు, దేశం లోనే మొదటిసారి బాలికలకు సాంకేతిక విద్య అందించే దిశగా హైదరాబాద్ ఎగ్జిబిషన్ సొసైటీ ఆధ్వర్యంలో కమలానెహ్రూ పాలిటెక్నిక్ కళాశాల స్థాపన, చర్మకారుల సంక్షేమం దృష్ట్యా లిడ్‌క్యాప్ ఏర్పాటు, పారిశ్రామికాభివృద్ధి దిశగా ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధి కార్పొరేషన్, మైనింగ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు వంటివి ఆయన దూరదృష్టికి నిదర్శనాలు. స్పెక్యులేషన్ మూలంగా హైదరాబాద్ చుట్టుపక్కల భూముల ధరలు పెరగకుండా అరికట్టడానికి ప్రభుత్వపరంగా రెండువేల ఎకరాల భూమిని క్రయం చేసి, కొత్త పరిశ్ర మల ఏర్పాటుకు సుగమం చేశారు. కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగుల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్స్ ఏర్పాటుతో యాజమాన్యాలు–ప్రభుత్వం ఎప్పటికప్పుడు తమ సమస్యలను సామరస్యంగా పరిష్కరించే దిశగా సంజీవయ్య చేసిన కృషి ఎనలేనిది. ఆ మోడల్ తర్వాతి రోజుల్లో కేంద్ర ప్రభుత్వం చట్టాలు చేసే విధంగా దోహదపడటం విశేషం. ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించి సాంఘిక న్యాయానికి బాట వేశారు సంజీవయ్య. షెడ్యూల్డు కులాలు, జాతులు, వెనకబడిన తరగతుల వారికి రిజర్వేషన్లు పెంచుతూ (14 నుండి 17 శాతం షెడ్యూల్డు కులాలకు; 24 నుండి 38 శాతం వెనుకబడిన తరగతులకు) తీసుకున్న నిర్ణయం ఆ రోజుల్లో సంచలనాత్మకం. ఈయనకు బోనస్ సంజీవయ్యగా గుర్తింపు ఉండేది. అంతకుమునుపు ఏమాత్రం బోనస్ పొందని 45 లక్షల మంది కార్మికులకు బోనస్ అందేలా పార్లమెంట్ ద్వారా చట్టం తెచ్చిన సంజీవయ్య కార్మికవర్గాలకు గుర్తుండిపోతారు. వీరి పదవీ కాలంలోనే కార్మిక చట్టాలను జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి వర్తింపజేశారు. దిగుమతి చేయబడే ముడి సరుకులు గానీ, యంత్రభాగాలు గానీ అంతగా అవసరం లేని 29 పరిశ్రమలను గుర్తించి, లైసెన్స్ అవసరం లేకుండా చేశారు. డీ–లైసెన్సింగ్ ఉత్తర్వులను అప్పటి పార్లమెంట్ సభ్యులైన దివాన్ చమన్‌లాల్, అటల్ బిహారీ వాజ్‌పేయి మెచ్చుకున్నారు. చిన్న పరిశ్రమల మనుగడకై సంజీవయ్య అధ్యయనం చేసి ఈ నిర్ణయం తీసుకున్నారని ప్రశంసించారు. రాజకీయాల్లో నెగ్గుతూ వచ్చిన సాహితీవేత్త సంజీవయ్య. పద్యాలు, గేయాలు, పాటలు, స్తుతులు, కొన్ని నాటకాలు రాసి వాటిల్లో నటించారు కూడా. అఖిల భారత తెలుగు రచయితల మహాసభల్ని 1960 మే 6న హైదరాబాద్‌లో నిర్వహించిన గౌరవం సంజీవయ్యకే దక్కుతుంది. ఆ సభలో ‘మానవాభ్యుదయానికి భాషే ప్రామాణికం’ అని ఉద్బోధిస్తూ, ‘జై సరస్వతి’ అని తన ప్రసంగం ముగించారు. మూడు దశాబ్దాల రాజకీయ జీవితంలో ఒక సెంటు భూమి, సొంత కారు, బ్యాంకు బ్యాలెన్సు కూడా ఉంచుకోని నిరాడంబర జీవి ఆయన. ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్ అతిథి గృహమే ఆయన అధికారిక నివాసం. అక్షర జ్ఞానం లేని సాదాసీదా ప్రజానీకం తనను కలవడానికి వస్తే, తన పీఏ చేత వారి కాగితాల్ని రాయించి, ఫిర్యాదుల సత్వర పరిష్కారానికి కృషి చేయడం ఆయనకు ఎంతో సంతృప్తి కలిగించేది. 1972 మే 8న ఆకస్మికంగా ఆయన ఢిల్లీలో కన్ను మూశారు. వేద మంత్ర పఠనంతో, వైదిక పద్ధతిలో పాటిగడ్డలోని నేటి సంజీవయ్య పార్కులో జరిగిన అంత్యక్రియలతో జీవనయాత్ర చాలించిన సంజీవయ్య మనందరి స్మృతి పథంలో ఎప్పుడూ మెదులుతుంటారు. డాక్టర్ శ్రీనివాసులు దాసరి వ్యాసకర్త విశ్రాంత ఐఏఎస్ -
'పుస్తక పఠనం ప్రధానం'
మేధస్సు పెంపునకు దోహదం వెనుకబడిన వారి అభివృద్ధికి తోడ్పాటు అందుకే జిల్లాలోని 125 గ్రామాల్లో ‘పుస్తక ప్రకాశం’ కేంద్రాలు ఏర్పాటు ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో సీనియర్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు వెనుకబాటుతనాన్ని తరిమికొట్టి ప్రతిఒక్కరూ అభివృద్ధి సాధించేందుకు పుస్తక పఠనం ఎంతో దోహదపడుతుందని సీనియర్ ఐఏఎస్ అధికారి, పుస్తక ప్రకాశం కార్యక్రమ నిర్వాహకులు దాసరి శ్రీనివాసులు పేర్కొన్నారు. 19 సంవత్సరాల క్రితం జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన ఆయన.. అప్పటి నుంచి ఇప్పటికీ వెనుకబడే ఉన్న జిల్లా అభివృద్ధి కోసం ‘పుస్తక ప్రకాశం’ పేరుతో ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. జిల్లాతో తనకున్న అనుబంధం నేపథ్యంలో అభివృద్ధికి కృషి చేయూలనే ఉద్దేశంతో చేపట్టిన ‘పుస్తక ప్రకాశం’ కార్యక్రమంపై స్థానిక ఐటీసీ అతిథి గృహంలో బుధవారం ‘సాక్షి’కి ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు... సాక్షి : పుస్తక ప్రకాశం కార్యక్రమానికి ప్రకాశం జిల్లాను ఎంచుకోవడానికి గల కారణాలేంటి..? దాసరి : రెండున్నర సంవత్సరాలకుపైగా ఈ జిల్లాలో కలెక్టర్‌గా పనిచేశా. ఆ అనుభవం ఎన్నో అనుభూతులను మిగిల్చింది. 19 సంవత్సరాల క్రితం నేను పనిచేసిన సమయంలో జిల్లా ఎలా ఉందో.. ఇప్పటికీ అలాగే వెనుకబడి ఉంది. ఆ వెనుకబాటుతనాన్ని రూపుమాపాలంటే చదువుకున్న వారిలో చైతన్యాన్ని పెంపొందించాల్సిన అవసరం ఉందనిపించింది. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఎక్కువగా ఉన్నందున వెనుకబాటుతనం కూడా ఎక్కువగా ఉందని గుర్తించి పుస్తక పఠనం ద్వారా చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఎంపిక చేసుకున్నా. సాక్షి : చైతన్యం కోసం పుస్తక ప్రకాశం కార్యక్రమాన్నే ఎందుకు చేపట్టాలనుకున్నారు..? దాసరి : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని పుస్తక ప్రకాశం కార్యక్రమాన్ని నిర్వహించాలని తలచా. అందుకోసం తొలి విడతగా ప్రకాశం జిల్లాను ఎంపిక చేసుకున్నా. జిల్లాలోని వెనుకబడిన 125 గ్రామాలను ఎంపిక చేయాలని నిర్ణయించా. ఆయూ గ్రామాల్లో కొందరు అంబేడ్కర్ విగ్రహాలు ఏర్పాటు చేసి నిత్యం ఆయన జ్ఞాపకాలను గుర్తు చేస్తుంటే.. పుస్తక పఠనం ద్వారా ఆయన ఆశయాల సాధనతో పాటు మేధాశక్తిని పెంపొందించాలని సంకల్పించాను. తద్వారా అభివృద్ధి సాధించి వెనుకబాటుతనాన్ని తరిమికొట్టాలని ప్రయత్నిస్తున్నాం. సాక్షి : అక్షరాస్యతా శాతాన్ని ఏమైనా పెంపొందిస్తారా..? దాసరి : అక్షరాస్యతను పెంపొందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం చూసుకుంటుంది. జిల్లాలో 63 శాతం మాత్రమే అక్షరాస్యత ఉంది. చదువుకున్న వారిలో పుస్తక పఠనాశక్తిని పెంపొందించడమే పుస్తక ప్రకాశం కార్యక్రమ ఉద్దేశం. తద్వారా మేధస్సు పెరిగి వారి తర్వాతి తరాల వారిని చదివించాలన్న ఆసక్తి కలిగిస్తాం. తద్వారా అక్షరాస్యత శాతం కూడా అభివృద్ధి చెందుతుంది. సాక్షి : పుస్తకాలు ఎలా సేకరిస్తారు..? దాసరి: ఆసక్తి కలిగిన ఎవరినుంచైనా పుస్తకాలు సేకరించడానికి పథకాన్ని సిద్ధం చేశాం. ఎలాంటి పుస్తకమైన అర్హమైనదిగా భావిస్తాం. అది పాఠకునికి ఎంతోకొంత ఉపయోగపడేదిగా ఉంటే చాలు. చిన్నారులు మొదలుకుని వయోవృద్ధుల వరకు ఎవరికి ఏ రకం పుస్తకాలు కావాలన్న దానిపై సర్వే చేస్తున్నాం. అన్ని రకాల పుస్తకాలు సేకరించి జిల్లాలో గుర్తించిన 125 గ్రామాల్లో పుస్తకపఠన కేంద్రాలు ఏర్పాటు చేసి అందరికీ అందుబాటులో ఉంచుతాం. పిల్లలకు కథలు చెప్పడం, వాటిలో నీతిని అర్థమయ్యేలా చేయడం ప్రధాన విధి. ఆ నీతిని జీవితానికి అన్వయించుకునే విధంగా తయారు చేయడమే మా ఉద్దేశం. సాక్షి : ఈ కార్యక్రమాన్ని ఎవరి ద్వారా ముందుకు తీసుకెళ్తారు..? దాసరి : స్వచ్ఛందంగా ముందుకు వచ్చే ఎవరినైనా పుస్తక ప్రకాశం కార్యక్రమాన్ని అమలుచేసేందుకు ఆహ్వానిస్తున్నాం. సమాజానికి ఎంతోకొంత సేవ చేయాలన్న దృక్పథం ఉన్నవారిని ఎంపికచేసి వారి ద్వారా కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. తద్వారా స్వచ్ఛంద కార్యకర్తలను ఏకీకృతం చేయడానికి కూడా ఈ కార్యక్రమం ఎంతగానో ఉపయోగపడుతుంది. స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామైక్య సంఘాలు ఇలా అన్ని రకాల వారిని భాగస్వాములను చేస్తాం. అందుకోసం విస్తృత ప్రచారం చేపట్టాం. సేకరించిన పుస్తకాలను ఎంపిక చేసిన గ్రామాల్లో స్టడీ సెంటర్లుగా ఏర్పాటు చేసి పుస్తక పఠనం ద్వారా కలిగే లాభాలను అందరికీ వివరిస్తాం. సాక్షి: ప్రజలను ఏ విధంగా చైతన్యం చేస్తారు..? దాసరి : చదువుకోవడం ద్వారా సమాజానికి ఏ విధమైన మేలు జరుగుతుంది, తద్వారా వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా ఎలాంటి ప్రయోజనాలుంటాయి, పుస్తక పఠనం ఎలాంటి ప్రయోజనాలు చేకూరుస్తుందన్న అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తాం. అన్ని వర్గాల వారిని ఈ కార్యక్రమంలో భాగస్వాములను చేస్తాం. సొంత లాభం కొంత మానుకుని పరుల కోసం ఏ విధంగా పాటుపడాలన్న విషయాన్ని విఫులీకరిస్తాం. గ్రామస్థాయి నుంచి నగరం వరకు ఈ కార్యక్రమాన్ని విస్తరించడానికి అన్నివర్గాల వారిని సమీకరించేందుకు ఉద్యుక్తులవుతున్నాం. అందుకోసం టోల్‌ఫ్రీ నంబర్‌ను కూడా అందుబాటులోకి తీసుకొస్తాం. జిల్లా అభివృద్ధికి ప్రతిఒక్కరూ తపనపడే విధంగా పుస్తక ప్రకాశం కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం.