కొలంబియా నగరంలో కొలువు తీరిన దశావతార వేంకటేశ్వరుడు
ఉత్తర అమెరికా సౌత్ కరోలినా రాష్ట్రంలోని కొలంబియా పట్టణంలో శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామివారి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ నెల జూన్ 14,16 తేదీల్లో ఈ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. మొదటి రెండు రోజులలోను అంకురార్పణ, సంకల్పం, జలాధివాసం, భూమిపూజ ,విష్ణు సహస్రనామ హోమం, శ్రీ దశావతార హోమం, పుష్పాధివాసం వంటివి పూర్తి అయ్యాయి. మూడవ రోజున సుమారు ఆరు అడుగుల స్వామివారి దివ్య మంగళ విగ్రహం ఆలయంలో కొలువయింది.అదేరోజు స్వామి వారి కళ్యాణం, రధోత్సవం వంటివి భక్తులకు కవివిందు గావించాయి. ఈ మొత్తం కార్యక్రమం విద్వాన్ శ్రీధర శ్రీనివాస భట్టాచార్య, మధుగిరి రాఘవ శ్రీనివాస నారాయణ భట్టార్ల నాయకత్వంలో మొత్తం పదకొండుమంది ఋత్విక్కుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా, నిర్విఘ్నంగా జరిగింది. సుమారు 70 మంది వలంటీర్లు నెలరోజుల పాటు నిర్విరామంగా పనిచేసి దీనికి కావలసిన ఏర్పాట్లన్నీ సమర్ధవంతంగా సమకూర్చారు. ప్రతిరోజూ అనేక వందలమంది భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎక్కడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు . బెంగళూరుకు చెందిన వి మురళి నాయకత్వంలో ముగ్గురు విద్వాంసులతో కూడిన నాదస్వర బృందం ఈ కార్యక్రమం పొడుగునా తమ చక్కని సంగీతంతో స్వామివారిని, భక్తులను అలరించారు. అట్లాంటా నుండి వచ్చిన రామకృష్ణ దంపతులు సాంప్రదాయక, రుచికర భోజనాలు భక్తులకు వండిపెట్టారు. చివరి రోజున ఋత్విక్కులను, వలంటీర్లను ఉచిత రీతిని సత్కరించారు. బాలబాలికల కోసం నిర్వహించిన దశావతార క్విజ్ లో పాల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. ఈ సందర్భంగా, ధర్మ కర్తల మండలి అధ్యక్షులు సత్య శ్రీనివాస దాస కడాలి మాట్లాడుతూ.. అమెరికాలో ఈ ఆలయం మొదటిది, ప్రపంచంలోనే రెండవది అయిన మత్స్య, కూర్మ, వరాహ, వామన, నరసింహ, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీ కృష్ణ, కల్కి, శ్రీ వెంకటేశ్వర రూప అంశాలతో కూడిన శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఎంత వైవిధ్య భరితంగానో ఉంది. అలాగే అంతే వైవిధ్యంగా ఆలయం వారు దాదాపు రెండు వేలమందికి విగ్రహ ప్రతిష్ఠాపన ఆహ్వానం, స్వామి వారి అక్షింతలను వాలంటీర్ల సహాయంతో ఇళ్లకు వెళ్లి ఇచ్చి ఆహ్వానించామన్నారు. శ్రీ దశావతార వెంకటేశ్వర దేవస్థానం ఇకనుంచి ఒక పుణ్య తీర్థంగా రూపొంది, దేశం నలుమూలల నుంచి భక్తులను ఆకర్షిస్తుందనే ఆశాభావం వ్యక్తపరిచారు. ఇతర ఆలయ ధర్మకర్తలు డాక్టర్ .లక్ష్మణ్ రావు ఒద్దిరాజు, డా. అమర్నాథ్, ఆనంద్ పాడిరెడ్డి, శరత్ గొర్రెపాటి తదితరులు ఈ కార్యక్రమన్ని విజయవంతం చేసిన భక్తులకు, వలంటీర్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రస్తుతం బాలాలయంగా ఉన్న ఈ దేవస్థానం, ప్రపంచమంతటా ఉన్న స్వామివారి భక్తుల సహాయ సహకారాలతో త్వరలో పూర్తి స్థాయి ఆలయంగా మారటానికి కావలసిన హంగులన్నీ సమకూర్చుకుని, సరికొత్త ప్రాంగణంలో శోభాయమానంగా రూపొందాలని స్థానిక భారతీయులు కోరుకొంటున్నారు.(చదవండి: 'ఆఫ్ బీజేపీ న్యూజెర్సీలో బీజేపీ నేృతృత్వంలోని ఎన్డీఏ గెలుపు సంబరాలు)