నాన్న సెంచరీ చేస్తుంటే.. కూతురు మురిసిపోయింది!!
సిడ్నీ: భారత్- ఆస్ట్రేలియా మధ్య ఆఖరి వన్డే.. మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా తరఫున డేవిడ్ వార్నర్ చెలరేగిపోయాడు. 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 113 బంతుల్లోనే 122 పరుగులు చేశాడు. మైదానంలో వార్నర్ ఇలా చెలరేగి ఆడుతుంటే.. ఆయన కూతురు చిన్నారి ఐవీ మేవ్ టీవీకి అతుక్కుపోయింది. వార్నర్ ఫోర్లు కొడుతుంటే ముసిముసి నవ్వులతో ఆనందించింది. 'గో డాడీ గో' అంటూ ఎక్కడో సిడ్నీ మైదానంలో ఆడుతున్న తండ్రిని టీవీలో చూస్తూ ఉత్సాహ పరిచింది. వార్నర్ పెద్ద కూతురైన ఐవీ.. ఇలా టీవీలో తండ్రిని చూస్తూ ఆనందిస్తున్న ఫొటోను అతని భార్య క్యాండీ వార్నర్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేసింది. టీవీలో తండ్రిని కళ్లార్పకుండా చూస్తూ.. 'గో డాడీ గో' అంటూ ఐవీ ఉత్సాహ పరిచిందని తెలిపింది.
అన్నట్టు ఈ మ్యాచ్లో వార్నర్ సెంచరీతో ఆస్ట్రేలియా 330 పరుగులు చేయగా.. భారత్ క్రికెటర్లు శిఖర్ ధావన్ (78), రోహిత్ శర్మ (99), మనీష్ పాండే (104) చెలరేగి ఆడటంతో టీమిండియా ఈ లక్ష్యాన్ని అలవొకగా ఛేదించి పరువు నిలుపుకొంది.