నోట్ల రద్దుతో ఒరిగిందేమీ లేదు
ఏలూరు (సెంట్రల్): పెద్ద నోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేయడం తప్ప జరిగిన మేలు ఏమిలేదని, ఏటీఎంల నుంచి నగదు రాకపోవడంతో అవస్థలు తప్పడం లేదని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహ్మాద్ రఫీఉల్లా బేగ్ అన్నారు. స్థానిక జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం ఏలూరు, దెందులూరు, గోపాలపురం, చింతలపూడి, తాడేపల్లిగూడెం నియోజకవర్గాల నాయకులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. బ్యాంకుల్లో నగదు తీసుకునే పరిస్థితి కనిపించడం లేదని, గంటల కొద్ది క్యూలైన్లలో వేచి ఉండాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు పూర్తిస్థాయిలో నగదు అందుబాటులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఏటీఎంల్లో పూర్తిస్థాయిలో నగదు అందుబాటులో ఉంచాలని కోరుతూ ఈనెల 23న జిల్లాలోని అన్ని మండల కేంద్రాల్లోని బ్యాంకుల వద్ద ‘మోదీ హఠావో ఏటీఎం భచావో ’ నినాదంతో ధర్నా చేయనున్నట్టు చెప్పారు. అనంతరం ప్రజా సమస్యల పోరాటం చేసేలా నాయకులకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామని చెప్పారు. నాయకులు పి.హరికుమార్రాజు, పెద్దిరెడ్డి సుబ్బారావు, డీజే ప్రభాకర్, గెడ్డం సాయిబాబా, దండుబోయిన చంద్రశేఖర్, కొల్లి అప్పారావు, సీహెచ్ నాగేశ్వరరావు, దావూరి బాబురావు, సుంకర సుబ్బారావు పాల్గొన్నారు.