డీడీఏ పార్కుల్లో ఓపెన్‌జిమ్‌లు
ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) ఆధ్వర్యంలోని పార్కుల పరిసరాల్లో నివసించేవారికి శుభవార్త. వీటి పరిసరాల్లో నివసించేవారు పొద్దున్నే లేచి జిమ్లచుట్టూ ప్రదక్షిణలు చేయాల్సిన పనిలేదు. ఎందుకంటే ఈ పార్కుల్లో త్వరలో ఓపెన్ జిమ్‌లు ఏర్పాటు కానుండడమే. ఈ దిశగా డీడీఏ అడుగులు వేస్తోంది. సాక్షి, న్యూఢిల్లీ: ఐదు ఎకరాలు అంతకు మించిన విస్తీర్ణం గల ఉద్యానవనాల్లో ఓపెన్ జిమ్నాసియంలను ఏర్పాటు చేయాలని ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నిర్ణయించింది. దీంతోపాటు బయోటాయిలెట్లను కూడా ఏర్పాటు చేయనుంది. పార్కుల్లో ప్రస్తుతమున్న జిమ్నాసియంలకు మరమ్మతు చేయడంతో పాటు కొత్తగా బయోటాయిలెట్లు ఏర్పాటుచేయడం, ఓపెన్ జిమ్‌లను నెలకొల్పడం కోసం సంబంధిత అధికారులు ఆసక్తి వ్యక్తీకరణ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) కోరుతూ దరఖాస్తులను ఆహ్వానించారు. ఈ నెలాఖరు నాటికల్లా కాంట్రాక్టులు ఖరారవుతాయని భావిస్తున్నారు.
డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) రూపొందించిన టాయిలెట్‌తోపాటు ఢిల్లీ అర్బన్ ఆర్ట్స్ కమిషన్ ప్రోత్సహించే మరో టాయిలెట్‌ను కూడా ఏర్పాటుచేయాలని సంబంధిత అధికారులు యోచిస్తున్నారు. అయితే ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని తెలిపారు. నగరవ్యాప్తంగా మొత్తం 882 ఉద్యానవనాలను డీడీఏ నిర్వహిస్తోంది. ఈ పార్కుల విస్తీర్ణం 12 వేల ఎకరాలు ఉంటుంది. వీటి నిర్వహణ కోసం ప్రతి సంవత్సరం రూ.300 కోట్లు ఖర్చు చేస్తోంది. ఐదెకరాలు, అంతకన్నా ఎక్కువ విస్తీర్ణం కలిగిన 50 ఉద్యానవనాల్లో బయోటాయిలెట్లు, ఓపెన్ జిమ్నాసియంలను డీడీఏ ఏర్పాటు చేయనుంది. వీటిలో ఎయిర్ వాకర్స్, సిటప్ బెంచీలు, ఎయిర్ స్వింగ్స్, స్టెయిర్ స్టెపర్స్, లెగ్ ప్రెసెస్, పులప్ చెయిర్స్, పారలల్ బార్స్, చెస్ట్ ప్రెసెస్, బె ంచ్ ప్రెసెస్, డంబ్ బెల్స్, పోల్స్ ఎలిప్టికల్ ఎక్సర్సైజర్, క్రాస్ వాకర్స్ మొదలైనవాటిని ఏర్పాటు చేస్తారు.దీంతోపాటు స్వచ్ఛ్ భారత్ మిషన్ కింద అన్ని పార్కులను శభ్రం చేయడం, పార్కుల్లో పనికిరాకుండా పడిఉన్న ఫర్నిచర్‌కు మరమ్మతులు చేయడం లేదా వాటిని మార్చడం, పనిచేయని దీపాల మరమ్మతు తదితరాలను డీడీఏ నిర్వహిస్తోంది.