De Cock
-
వివాదాస్పద రనౌట్ దుమారం: ‘డీకాక్ తప్పేమీ లేదు’
జొహన్నెస్‌బర్గ్: ఆటల్లో క్రీడాస్ఫూర్తి అనేది చాలా ముఖ్యం. ముఖ్యంగా క్రికెట్లో దీని పాలు ఎక్కువే! అందుకే దీనిని జెంటిల్మెన్ గేమ్ అంటారు. ఆటలో ఏ జట్టుకైనా గెలుపోటములు సహజం. కానీ మైదానంలో ఆటగాళ్లు ఎలా ప్రవర్తించారనేది చాలా ముఖ్యం. అందుకు సంబంధించి ‘ఫెయిర్ ప్లే’ నియమ నిబంధనలూ ఉన్నాయి. అయితే, తాజాగా పాకిస్థాన్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరిగిన రెండో వన్డేలో ఓపెనర్ ఫకర్ జమాన్ (193; 155 బంతుల్లో 18x4, 10x6) ను రనౌట్ చేసిన విధానం వివాదాస్పదంగా మారింది. ఈ రనౌట్ కు సంబంధించి డీకాక్ చేసింది గేమ్ స్పిరిట్‌కు విరుద్ధమని పాక్ అభిమానులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. ఇదే విషయంపై తాజాగా ఫకర్ జమాన్ స్పందించాడు. నేనే మరింత చురుగ్గా వ్యవహరించుండాలి దక్షిణాఫ్రికాతో జరిగిన రెండో వన్డేలో తన రనౌట్ బాధ్యతను ఫఖర్ జమానే తీసుకున్నాడు. ‘ఆ సమయంలో తానే మరింత చురుగ్గా వ్యవహరించి ఉండాల్సింది. ఇందులో వికెట్ కీపర్ క్వింటన్ డీకాక్ తప్పు లేదు. హరిస్ రౌఫ్ క్రీజ్ నుంచి కొంచెం ఆలస్యంగా పరుగు ప్రారంభించాడు, అందువల్ల అతను ఇబ్బందుల్లో పడతాడని నేను భావించాను. ఈ క్రమంలో నా దృష్టి కొంచెం మళ్లింది. కాబట్టి ఇందులో డికాక్ తప్పుందని నేను అనుకోవడంలేదు’అని జమాన్ పేర్కొన్నాడు. ఇక రనౌట్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్ చివరి ఓవర్లో మార్క్రమ్ త్రో చేస్తున్న సమయంలో డీకాక్ చేసిన సైగలతో బంతి తను పరుగెడుతున్న వైపు రావడం లేదని భావించిన జమాన్ వేగాన్ని తగ్గించాడు. కాని బంతి అనూహ్యంగా అతని ఎండ్ వికెట్లకే తగిలి ఆశ్చర్యానికి గురిచేసింది. కాగా రెండో వన్డేలో 342 పరుగులు చేసిన పాకిస్థాన్‌కు చివరి ఓవర్లో 31 పరుగులు అవసరం. జమాన్ రనౌట్ అయిన తరువాత, పాక్ 17 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. అసలు చట్టం ఏం చెప్తోంది రూల్ 41.5.1 ప్రకారం స్ట్రైకర్ బంతిని అందుకున్న తర్వాత బ్యాట్స్‌మెన్‌ను అడ్డుకోవడం, ఏ ఫీల్డర్ అయినా మాటలు లేదా తమ చర్యల ద్వారా ఉద్దేశపూర్వకంగా బ్యాట్స్‌మన్‌ను దృష్టి మరల్చకూడదని పేర్కొటోంది. ( చదవండి: పవర్ఫుల్ షాట్.. కెమెరానే పగిలిపోయింది! ) #fakharzaman For the ones justifying. he clearly deceived fakhar zaman by his gesture and he unintentionally looked behind and hence slowed himself down. this is clear cheating. fake fielding. against the rules. 👎#fakharzaman #PakvRSA pic.twitter.com/qqNm5oKo8p — Pak Warrior 🇵🇰🇹🇷🇵🇰🇹🇷 (@MUxama3) April 4, 2021 -
ఈ ఏడాది ఐపీఎల్లో వీరి మెరుపులు లేనట్టేనా..?
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021 సీజన్లో పలువురు విదేశీ ఆటగాళ్ల మెరుపులను అభిమానులు మిస్ కానున్నారా..? అంటే అవుననే చెప్పాలి. ఎందుకంటే వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాల్సి ఉండడమే ఇందుకు కారణం. ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంకానున్న ఆటగాళ్ల జాబితాను పరిశీలిస్తే.. అందులో అందరూ దక్షిణఫ్రికా క్రికెటర్లే ఉన్నారు. స్వదేశంలో పాకిస్థాన్‌తో 3 వన్డేలు, 4 టీ20లు ఆడాల్సి ఉండటంతో ఆ స్టార్లందరూ జాతీయ జట్టుకు ప్రాతినిధ్యం వహించేందుకు మొగ్గు చూపుతున్నారు. ఐపీఎల్‌కు దూరంకానున్న దక్షిణాఫ్రికా క్రికెటర్లలో ముంబై ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న క్వింటన్ డికాక్, ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లు రబాడ, అన్రిచ్ నోర్జ్, చెన్నై సూపర్ కింగ్స్ సభ్యులు లుంగి ఎంగిడి, ఫాఫ్ డుప్లెసిస్‌లు ఉన్నారు. వీరిలో ముఖ్యంగా క్వింటన్ డికాక్, రబాడ, ఫాఫ్ డుప్లెసిస్‌లు తమతమ ఫ్రాంఛైజీల గెలుపోటములను ప్రభావితం చేయగల సత్తా ఉన్న ఆటగాళ్లు. డికాక్ గత సీజన్లో ముంబై ఇండియన్స్‌కు తరుపుముక్కగా నిలిచాడు. అతను ఆడిని 16 మ్యాచ్‌ల్లో 140.5 స్ట్రెక్‌రేట్‌తో 503 పరుగులు చేసి, ముంబై టైటిల్ సాధించడంలో కీలకపాత్ర పోషించాడు. ఇక ఫాఫ్ డుప్లెసిస్ గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ ప్రధాన ఆటగాళ్లలో ఒకడైన ఆయన గత సీజన్లో 13 మ్యాచ్‌ల్లో 40.81 సగటుతో 449 పరుగులు సాధించాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న రబాడ.. గత రెండు సీజన్లలో 29 మ్యాచ్‌లాడి 55 వికెట్లు తీశాడు. గత సీజన్లో 17 మ్యాచ్‌లాడిన ఆయన 8.34 ఎకానమీతో ఏకంగా 30 వికెట్లు పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్లు అన్రిచ్ నోర్జ్, లుంగి ఎంగిడిలు సైతం వారివారి ఫ్రాంఛైజీల జయాపజయాలను ప్రభావితం చేయగల ఆటగాళ్లే. -
పాకిస్తాన్ లక్ష్యం 381
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టులో పాకిస్తాన్ కొంత పోరాటపటిమ కనబరుస్తోంది. 381 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆ జట్టు మూడో రోజు ఆట ముగిసే సమయానికి 3 వికెట్లకు 153 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హఖ్ (35), మసూద్ (37), అజహర్ (15) ఔట్ కాగా... అసద్ షఫీఖ్ (48 బ్యాటింగ్), బాబర్ ఆజమ్ (17 బ్యాటింగ్) క్రీజ్‌లో ఉన్నారు. చేతిలో 7 వికెట్లు ఉన్న ఆ జట్టు మరో 228 పరుగులు చేయాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 135/5తో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా తమ రెండో ఇన్నింగ్స్‌లో 303 పరుగులకు ఆలౌటైంది. క్వింటన్ డి కాక్ (138 బంతుల్లో 129; 18 ఫోర్లు, సిక్స్) సెంచరీ సాధించగా, హషీం ఆమ్లా (71; 14 ఫోర్లు) రాణించాడు. షాదాబ్, ఫహీమ్ చెరో 3 వికెట్లు పడగొట్టారు. పాక్ రెండో ఇన్నింగ్స్‌లో 2 వికెట్లు తీసిన స్టెయిన్ (433) అత్యధిక వికెట్ల బౌలర్ల జాబితాలో ఎనిమిదో స్థానానికి చేరాడు. -
సఫారీలు అలవోకగా..
తొలి వన్డేలో ఆసీస్‌పై విజయం సెంచూరియన్: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారీ లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా సునాయాసంగా అధిగమించింది. ఓపెనర్ డి కాక్ (113 బంతుల్లోనే 178; 16 ఫోర్లు, 11 సిక్సర్లు) విధ్వంసక శతకం సహాయంతో 295 పరుగుల లక్ష్యాన్ని 36.2 ఓవర్లలోనే నాలుగు వికెట్లు కోల్పోరుు ఛేదించింది. దీంతో ఐదు వన్డేల సిరీస్‌లో ఆతిథ్య జట్టు 1-0 ఆధిక్యం సాధించింది. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 294 పరుగులు చేసింది. జార్జి బెరుులీ (90 బంతుల్లో 74; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), హేస్టింగ్స (56 బంతుల్లో 51; 6 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీలు చేశారు. పేసర్ ఫెలుక్వాయో నాలుగు, స్టెరుున్ రెండు వికెట్లు తీశారు. అనంతరం లక్ష్యం కోసం బరిలోకి దిగిన డి కాక్ ప్రత్యర్థి బౌలర్లను ఆడుకున్నాడు. కేవలం 74 బంతుల్లోనే శతకం సాధించాడు. ఆ తర్వాత మరింత దూకుడుతో స్టేడియంలో సిక్సర్ల వర్షం కురిపించాడు. 101 బంతుల్లో 150 పరుగుల మార్క్ చేరిన డికాక్... 34వ ఓవర్లో వెనుదిరిగాడు. రోసో (63) అర్ధ సెంచరీ చేయగా.. పేసర్ బోలండ్కు మూడు వికెట్లు దక్కారుు. -
‘సన్’ జోరుకు బ్రేక్
► సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి ► 7 వికెట్లతో ఢిల్లీ ఘన విజయం రాణించిన మిశ్రా, డి కాక్ నడి వేసవిలో హైదరాబాద్‌లో సూర్యుడి ప్రతాపానికి వరుణుడు బ్రేక్ వేసినట్లే... ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ జోరుకు ఢిల్లీ బ్రేక్ వేసింది. వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న వార్నర్ సేన సొంతగడ్డపై మ్యాచ్‌లను ఓటమితో ముగించింది. బౌలర్ల నిలకడ, డికాక్ మెరుపులతో డేర్‌డెవిల్స్ ప్లే ఆఫ్‌కు చేరువయింది. సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో విఫలమైన చాలా సందర్భాల్లో బౌలింగ్‌తో గట్టెక్కే సన్‌రైజర్స్‌కు ఈసారి అదృష్టం కలిసి రాలేదు. అన్ని విభాగాల్లో వైఫల్యం కారణంగా... నాలుగు విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిశ్రా, కూల్టర్ నీల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది. క్వింటన్ డి కాక్ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా... రిషభ్ పంత్ (26 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శామ్సన్ (26 బంతుల్లో 34 నాటౌట్; 2 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 50 బంతుల్లోనే 72 పరుగులు జోడించి 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని గెలిపించారు. హైదరాబాద్‌లో సొంత మ్యాచ్‌లు ముగించుకున్న రైజర్స్ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్‌లను ప్రత్యర్థి వేదికలపైనే ఆడుతుంది. క్రిస్ మోరిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. వార్నర్ మెరుపులు తప్ప...: తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ స్వరూపం ఇది. ఎప్పటిలాగే వార్నర్ తనదైన శైలిలో దూకుడు మినహా జట్టు బ్యాటింగ్‌లో ఎలాంటి మెరుపులు లేవు. ధావన్ (37 బంతుల్లో 34; 3 ఫోర్లు), విలియమ్సన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలం కాగా, మిగతా బ్యాట్స్‌మెన్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ తొలి 3 ఓవర్లలో 11 పరుగులే రాగా, తర్వాతి రెండు ఓవర్లు సన్ సొమ్ము చేసుకుంది. షమీ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు, ధావన్ ఒక ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి. జయంత్ వేసిన మరుసటి ఓవర్లో తొలి మూడు బంతులకు వార్నర్ 4, 4, 6 బాదడంతో 17 పరుగులు లభించాయి. అయితే 6-20 మధ్య 15 ఓవర్లలో హైదరాబాద్ రెండు ఓవర్లలో మాత్రమే రెండంకెల పరుగులు తీయగలగడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జయంత్ తన చివరి ఓవర్లో వార్నర్‌ను బౌల్డ్ చేసి పతనానికి శ్రీకారం చుట్టాడు. వార్నర్, ధావన్ తొలి వికెట్‌కు 53 బంతుల్లో 67 పరుగులు జోడించారు. ఆ తర్వాత 15 బంతుల వ్యవధిలో సన్ మూడు వికెట్లు కోల్పోయింది. మిశ్రా తన వరుస ఓవర్లలో ధావన్, యువరాజ్ (8)లను అవుట్ చేయగా, హెన్రిక్స్ (0) షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు. డి కాక్ జోరు...: నెహ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి డి కాక్ దూకుడు ప్రదర్శించాడు. నెహ్రా మరుసటి ఓవర్లో కూడా అతను మరో రెండు బౌండరీలు కొట్టాడు. అయితే ఆ ఓవర్లో ఢిల్లీ జట్టు అగర్వాల్ (10) వికెట్ కోల్పోయింది. అనంతరం నాయర్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు) కొద్ది సేపు డి కాక్కు అండగా నిలిచాడు. బరీందర్ వేసిన తొలి రెండు ఓవర్లలో వీరిద్దరు కలిసి మూడు ఫోర్లు, 1 సిక్స్‌తో 21 పరుగులు రాబట్టారు. అయితే హెన్రిక్స్ చక్కటి బంతితో నాయర్‌ను బౌల్డ్ చేయడంతో 55 పరుగుల (37 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో మూడు బంతులకే డి కాక్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత శామ్సన్, పంత్ నిలకడగా ఆడారు. 18 పరుగుల వద్ద శామ్సన్ క్యాచ్‌ను హెన్రిక్స్ వదిలేయడం ఢిల్లీకి కలిసి రాగా... లీగ్‌లో తొలిసారి ముస్తఫిజుర్ విఫలం కావడం కూడా డేర్‌డెవిల్స్ పని సులువు చేసింది. స్కోరు వివరాలు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జయంత్ 46; ధావన్ (సి) శామ్సన్ (బి) మిశ్రా 34; విలియమ్సన్ (బి) మోరిస్ 27; యువరాజ్ (సి) పంత్ (బి) మిశ్రా 8; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) షమీ 0; హుడా (హిట్ వికెట్) (బి) కూల్టర్ నీల్ 10; ఓజా (సి) శామ్సన్ (బి) కూల్టర్ నీల్ 7; భువనేశ్వర్ (రనౌట్) 1; బరీందర్ (నాటౌట్) 1; నెహ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146. వికెట్ల పతనం: 1-67; 2-98; 3-113; 4-114; 5-135; 6-137; 7-138; 8-143. బౌలింగ్: జయంత్ యాదవ్ 4-0-32-1; కూల్టర్‌నీల్ 4-0-25-2; షమీ 3-0-26-1; మోరిస్ 4-0-19-1; డుమిని 2-0-19-0; మిశ్రా 3-0-19-2. ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 44; అగర్వాల్ (సి) యువరాజ్ (బి) నెహ్రా 10; నాయర్ (బి) హెన్రిక్స్ 20; శామ్సన్ (నాటౌట్) 34; పంత్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 150. వికెట్ల పతనం: 1-20; 2-75; 3-78. బౌలింగ్: భువనేశ్వర్ 4-0-32-0; నెహ్రా 3-0-23-1; బరీందర్ 2-0-21-0; ముస్తఫిజుర్ 4-0-39-0; హెన్రిక్స్ 3-0-19-2; హుడా 1-0-5-0; యువరాజ్ 1.1-0-11-0.