‘సన్’ జోరుకు బ్రేక్ | Delhi Daredevils' all-round effort stops SunRisers Hyderabad's winning run | Sakshi
Sakshi News home page

‘సన్’ జోరుకు బ్రేక్

Published Fri, May 13 2016 12:35 AM | Last Updated on Sun, Sep 3 2017 11:57 PM

‘సన్’ జోరుకు బ్రేక్

‘సన్’ జోరుకు బ్రేక్

సొంతగడ్డపై చివరి మ్యాచ్‌లో హైదరాబాద్ ఓటమి
7 వికెట్లతో ఢిల్లీ ఘన విజయం   రాణించిన మిశ్రా, డి కాక్

 
నడి వేసవిలో హైదరాబాద్‌లో సూర్యుడి ప్రతాపానికి వరుణుడు బ్రేక్ వేసినట్లే... ఐపీఎల్‌లోనూ సన్‌రైజర్స్ జోరుకు ఢిల్లీ బ్రేక్ వేసింది.  వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న వార్నర్ సేన సొంతగడ్డపై మ్యాచ్‌లను ఓటమితో ముగించింది. బౌలర్ల నిలకడ, డికాక్ మెరుపులతో డేర్‌డెవిల్స్  ప్లే ఆఫ్‌కు చేరువయింది.
 
 
సాక్షి, హైదరాబాద్: బ్యాటింగ్‌లో విఫలమైన చాలా సందర్భాల్లో బౌలింగ్‌తో గట్టెక్కే సన్‌రైజర్స్‌కు ఈసారి అదృష్టం కలిసి రాలేదు. అన్ని విభాగాల్లో వైఫల్యం కారణంగా... నాలుగు విజయాల జోరుకు బ్రేక్ పడింది. గురువారం ఉప్పల్ స్టేడియంలో జరిగిన లీగ్ మ్యాచ్‌లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ హైదరాబాద్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 146 పరుగులు చేసింది. డేవిడ్ వార్నర్ (30 బంతుల్లో 46; 6 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిశ్రా, కూల్టర్ నీల్ చెరో 2 వికెట్లు తీశారు. అనంతరం ఢిల్లీ డేర్ డెవిల్స్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 150 పరుగులు చేసింది.

క్వింటన్ డి కాక్ (31 బంతుల్లో 44; 5 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించగా... రిషభ్ పంత్ (26 బంతుల్లో 39 నాటౌట్; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), సంజు శామ్సన్ (26 బంతుల్లో 34 నాటౌట్; 2 సిక్సర్లు) నాలుగో వికెట్‌కు అభేద్యంగా 50 బంతుల్లోనే 72 పరుగులు జోడించి 11 బంతులు మిగిలి ఉండగానే ఢిల్లీని గెలిపించారు. హైదరాబాద్‌లో సొంత మ్యాచ్‌లు  ముగించుకున్న రైజర్స్ ఇకపై మిగిలిన మూడు మ్యాచ్‌లను ప్రత్యర్థి వేదికలపైనే ఆడుతుంది. క్రిస్ మోరిస్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.


  వార్నర్ మెరుపులు తప్ప...: తొలి 10 ఓవర్లలో వికెట్ నష్టానికి 80 పరుగులు... తర్వాతి 10 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 66 పరుగులు మాత్రమే... సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్ స్వరూపం ఇది. ఎప్పటిలాగే వార్నర్ తనదైన శైలిలో దూకుడు మినహా జట్టు బ్యాటింగ్‌లో ఎలాంటి మెరుపులు లేవు. ధావన్ (37 బంతుల్లో 34; 3 ఫోర్లు),  విలియమ్సన్ (24 బంతుల్లో 27; 3 ఫోర్లు) దూకుడుగా ఆడటంలో విఫలం కాగా, మిగతా బ్యాట్స్‌మెన్ కనీస ప్రదర్శన కూడా ఇవ్వలేకపోయారు. ఇన్నింగ్స్ తొలి 3 ఓవర్లలో 11 పరుగులే రాగా, తర్వాతి రెండు ఓవర్లు సన్ సొమ్ము చేసుకుంది. షమీ వేసిన నాలుగో ఓవర్లో వార్నర్ రెండు ఫోర్లు, ధావన్ ఒక ఫోర్ కొట్టడంతో 15 పరుగులు వచ్చాయి.

జయంత్ వేసిన మరుసటి ఓవర్లో తొలి మూడు బంతులకు వార్నర్ 4, 4, 6 బాదడంతో 17 పరుగులు లభించాయి. అయితే 6-20 మధ్య 15 ఓవర్లలో హైదరాబాద్ రెండు ఓవర్లలో మాత్రమే రెండంకెల పరుగులు తీయగలగడంతో భారీ స్కోరు సాధ్యం కాలేదు. ఢిల్లీ కట్టుదిట్టమైన బౌలింగ్‌కు రైజర్స్ వరుసగా వికెట్లు కోల్పోయింది. జయంత్ తన చివరి ఓవర్లో వార్నర్‌ను బౌల్డ్ చేసి పతనానికి శ్రీకారం చుట్టాడు. వార్నర్, ధావన్ తొలి వికెట్‌కు 53 బంతుల్లో 67 పరుగులు జోడించారు.  ఆ తర్వాత 15 బంతుల వ్యవధిలో సన్ మూడు వికెట్లు కోల్పోయింది. మిశ్రా తన వరుస ఓవర్లలో ధావన్, యువరాజ్ (8)లను అవుట్ చేయగా, హెన్రిక్స్ (0) షమీ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ తర్వాత బ్యాట్స్‌మెన్ పూర్తిగా చేతులెత్తేశారు.


 డి కాక్ జోరు...: నెహ్రా వేసిన ఇన్నింగ్స్ రెండో ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి డి కాక్ దూకుడు ప్రదర్శించాడు. నెహ్రా మరుసటి ఓవర్లో కూడా అతను మరో రెండు బౌండరీలు కొట్టాడు. అయితే ఆ ఓవర్లో ఢిల్లీ జట్టు అగర్వాల్ (10) వికెట్ కోల్పోయింది. అనంతరం నాయర్ (17 బంతుల్లో 20; 3 ఫోర్లు) కొద్ది సేపు డి కాక్‌కు అండగా నిలిచాడు. బరీందర్ వేసిన తొలి రెండు ఓవర్లలో వీరిద్దరు కలిసి మూడు ఫోర్లు, 1 సిక్స్‌తో 21 పరుగులు రాబట్టారు. అయితే హెన్రిక్స్ చక్కటి బంతితో నాయర్‌ను బౌల్డ్ చేయడంతో 55 పరుగుల (37 బంతుల్లో) రెండో వికెట్ భాగస్వామ్యానికి తెర పడింది. మరో మూడు బంతులకే డి కాక్ కూడా వెనుదిరిగాడు. ఆ తర్వాత శామ్సన్, పంత్ నిలకడగా ఆడారు. 18 పరుగుల వద్ద శామ్సన్ క్యాచ్‌ను హెన్రిక్స్ వదిలేయడం ఢిల్లీకి కలిసి రాగా... లీగ్‌లో తొలిసారి ముస్తఫిజుర్ విఫలం కావడం కూడా డేర్‌డెవిల్స్ పని సులువు చేసింది.
 
 
స్కోరు వివరాలు
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్: వార్నర్ (బి) జయంత్ 46; ధావన్ (సి) శామ్సన్ (బి) మిశ్రా 34; విలియమ్సన్ (బి) మోరిస్ 27; యువరాజ్ (సి) పంత్ (బి) మిశ్రా 8; హెన్రిక్స్ (ఎల్బీ) (బి) షమీ 0; హుడా (హిట్ వికెట్) (బి) కూల్టర్ నీల్ 10; ఓజా (సి) శామ్సన్ (బి) కూల్టర్ నీల్ 7; భువనేశ్వర్ (రనౌట్) 1; బరీందర్ (నాటౌట్) 1; నెహ్రా (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (20 ఓవర్లలో 8 వికెట్లకు) 146.

వికెట్ల పతనం: 1-67; 2-98; 3-113; 4-114; 5-135; 6-137; 7-138; 8-143.
బౌలింగ్: జయంత్ యాదవ్ 4-0-32-1; కూల్టర్‌నీల్ 4-0-25-2; షమీ 3-0-26-1; మోరిస్ 4-0-19-1; డుమిని 2-0-19-0; మిశ్రా 3-0-19-2.


ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) ఓజా (బి) హెన్రిక్స్ 44; అగర్వాల్ (సి) యువరాజ్ (బి) నెహ్రా 10; నాయర్ (బి) హెన్రిక్స్ 20; శామ్సన్ (నాటౌట్) 34; పంత్ (నాటౌట్) 39; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (18.1 ఓవర్లలో 3 వికెట్లకు) 150.

వికెట్ల పతనం: 1-20; 2-75; 3-78.
బౌలింగ్: భువనేశ్వర్ 4-0-32-0; నెహ్రా 3-0-23-1; బరీందర్ 2-0-21-0; ముస్తఫిజుర్ 4-0-39-0; హెన్రిక్స్ 3-0-19-2; హుడా 1-0-5-0; యువరాజ్ 1.1-0-11-0.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement