deaf students
-
మూగమనసులు ఒక్కటయ్యాయి..!
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): వారిద్దరు మాట్లాడలేరు. వినలేరు.. కానీ వారి మనస్సులు మాట్లాడుకున్నాయి. సైగలతోనే జీవితంలో కలిసి ప్రయాణం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇద్దరి తల్లిదండ్రులు అంగీకరించడంతో మూగమనసులు ఒక్కటయ్యాయి. వివరాల్లోకి వెళితే.. ఉలవపాడు గ్రామానికి చెందిన కంబోతుశ్రీనివాసులు, శ్రీలక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇద్దరూ దివ్యాంగులే... వినపడదు, మాట్లాడలేరు. వీరిలో భార్గవి ఒంగోలులోని బధిరుల పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకుంది. అక్కడే ఉలవపాడు మండలం అలగాయపాలెంకు చెందిన పాదాల సత్యనారాయణ, ఈశ్వరమ్మల కుమారుడు పవన్‌కుమార్ కూడా చదివాడు. అతనికి కూడా వినపడదు, మాట్లాడలేడు. అక్కడ వారికి పరిచయం ఏర్పడింది. తరువాత తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో నడిచే బధిరుల పాఠశాలలో ఐటీఐ చదివారు. అక్కడ వీరిద్దరి పరిచయం ప్రేమగా మారింది. కలిసి జీవితాన్ని పంచుకోవాలని అనుకున్నారు. ఇద్దరి కులాలు వేరయినా ఆదర్శ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ఈ విషయం తల్లిదండ్రులకు, తోటి మిత్రులకు తెలియజేశారు. తల్లిదండ్రులు కూడా సమ్మతి తెలపడంతో గురువారం శింగరాయకొండలోని లక్ష్మీనరశింహస్వామి దేవస్థానంలో వివాహం జరిపించారు. అనంతరం ఉలవపాడు సాయిబాబా గుడికి వచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బధిరులు ఈ వివాహానికి వాట్సప్ గ్రూప్‌ల ద్వారా తెలుసుకుని 50 మంది హాజరయ్యారు. -
బదిరుల హాస్ట్‌ల నుంచి విద్యార్థుల పరారీ
సాక్షి, హైదరాబాద్ : అబ్దుల్లాపూర్ మెట్, పెద్ద అంబరపేట బదిరుల ఆదర్శ పాఠశాల హాస్టల్ నుంచి ముగ్గురు విద్యార్థులు పరారీ అయ్యారు. వివరాలు.. చిన్నారులు మహేష్, లోకేశ్, యశ్వంత్ బదిరుల హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో హాస్టల్లో తమను వేధిస్తున్నారంటూ వీరు ముగ్గురు ఎవరికి చెప్పకుండా బయటకు వచ్చారు. వీరిలో మహేష్, లోకేశ్ ఇద్దరు కలిసి ఔటర్ రింగ్ రోడ్ వెంట నడచుకుంటూ వెళ్తుండగా చూసిన స్థానికులు వారిని అడ్డగించి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెవిటివారైన ఆ పిల్లలు తమ సైగలతో హాస్ట్‌ల్‌లో తమను వేధిస్తున్నారని.. అందుకే ఇలా బయటకు వచ్చామని వారికి తెలిపారు. దాంతో స్థానికలు వీరిని కోహెడ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. మరో విద్యార్థి యశ్వంత్ ఆచూకీ మాత్రం తెలియలేదు. ఈ లోపు పాఠశాల ఉపాధ్యాయుడు రమేష్, ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నుంచి పరారయ్యరంటూ మెట్టూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
పదో తరగతి ఫలితాల్లో వారూ సత్తాచాటారు
శ్రీనగర్‌కాలనీ (హైదరాబాద్): వినికిడి సమస్య ఉన్నా... ఇతర విద్యార్థులకు ఏ మాత్రం తీసిపోమని నిరూపించారు శ్రీనగర్ కాలనీలోని ఆశ్రయ్- ఆకృతి బధిర విద్యార్థులు. ఇంగ్లీష్ మీడియంలో పరీక్షకు హాజరైన 8 మంది విద్యార్థులూ మంచి గ్రేడింగ్‌తో పాసయ్యారు. అనూష అనే విద్యార్థి 10గాను 8.3 గ్రేడ్, స్నేహ 8 గ్రేడ్ సాధించగా, మిగిలిన ఆరుగురు విద్యార్థులు కూడా మంచి గ్రేడ్ సాధించినట్టు పాఠశాల డెరైక్టర్ డీ.పీ.కె. బాబు మీడియాకు తెలిపారు.