రాజీనామా బాటలో ఢిల్లీ ఐఐటీ డీన్లు!
న్యూఢిల్లీ: అకడమిక్ వ్యవహారాలలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ (హెచ్చార్డీ) జోక్యం చేసుకోవడంపై ఢిల్లీ ఐఐటీ సెనేట్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నది. హెచ్చార్డీ తీరు మారకపోతే రాజీనామా చేస్తామని ఢిల్లీ ఐఐటీకి చెందిన ముగ్గురు డీన్లు హెచ్చరించారు. ఒక పార్ట్ టైం పీహెచ్డీ విద్యార్థిని అడ్మిషన్ ను రద్దుచేయడంపై పునరాలోచన చేయాలని ఢిల్లీ ఐఐటీ సెనేట్ ను హెచ్చార్డీ కోరింది. అలీషా తంగ్రీ అనే విద్యార్థిని తన ఉద్యోగ అనుభవం గురించి వాస్తవాలు దాచిపెట్టడంతో ఆమె అడ్మిషన్ ను రద్దు చేశారు. ఈ నేపథ్యంలో ఆమె తరఫున తండ్రి అలీషా తంగ్రీ పిటిషన్ పెట్టుకున్నారు.
ఈ పిటిషన్ పై స్పందించిన ప్రధానమంత్రి కార్యాలయం.. ఈ అంశాన్ని హెచ్చార్డీకి నివేదిస్తూ.. సరైన చర్యలు తీసుకోవాలని సూచించింది. దీంతో ఈ పిటిషన్ను పరిష్కరించాల్సిందిగా కోరుతూ హెచ్చార్డీ .. ఢిల్లీ ఐఐటీ సెనేట్ కు పంపింది. దీనిని సెనేట్ నిర్ద్వందంగా తోసిపుచ్చింది. ఆ విద్యార్థిని పిటిషన్ను ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి లేదా ఐఐటీ డైరెక్టర్ కు నివేదించాల్సి ఉండాలని, అకడమిక్ ప్రమాణాలు పాటించాల్సిన బాధ్యత వారిపైనే ఉందని సెనేట్ భావిస్తున్నది. ఈ విషయంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జోక్యాన్ని నిరసిస్తూ సెనేట్ లోని ఆరుగురు డీన్లలో ముగ్గురు రాజీనామా చేయాలని భావిస్తున్నారు. దీంతో హెచ్చార్డీ, ఢిల్లీ ఐఐటీ మధ్య మరోసారి వివాదం తలెత్తే పరిస్థితి కనిపిస్తున్నది.