death bowling
-
‘రైజర్స్’తోనే నేర్చుకున్నా...
న్యూఢిల్లీ: ఐపీఎల్ జట్టు సన్‌రైజర్స్ హైదరాబాద్ విజయాల్లో పేసర్ భువనేశ్వర్ కుమార్ కీలకపాత్ర పోషించాడు. ఇన్నింగ్స్ ఆరంభంలో, చివర్లో కీలక వికెట్లు తీసి జట్టుకు బ్రేక్ అందించడంలో అతనికి అతనే సాటి. లీగ్‌లో సాగించిన ఈ తరహా ప్రదర్శనే తనలో ఆత్మవిశ్వాసం పెంచిందని, తీవ్ర ఒత్తిడి సమయంలో ఎలా బౌలింగ్ చేయాలో కూడా నేర్చుకున్నానని భువనేశ్వర్ వ్యాఖ్యానించాడు. ‘మొదటి నుంచి కూడా యార్కర్లు నా బలం. వాటిని బాగానే ఉపయోగించినా ఆ తర్వాత పట్టు చేజార్చుకునేవాడిని. అయితే సన్‌రైజర్స్‌తో ఆడటం మొదలు పెట్టాక నాలో మార్పు వచ్చింది. ప్రారంభ ఓవర్లలో ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయాల్సినప్పుడు, డెత్ ఓవర్లలో పరుగులు నిరోధించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు నేనే ఎక్కువగా బౌలింగ్ చేశాను. దాని వల్ల నాకు ఎంతో మేలు జరిగింది. తీవ్రమైన ఒత్తిడిలోనూ మెరుగ్గా బౌలింగ్ ఎలా చేయాలో నేర్చుకోగలిగాను’ అని అతను చెప్పాడు. 2014 నుంచి సన్‌రైజర్స్ జట్టు తరఫున ఆడుతున్న భువీ 6 సీజన్లలో 86 మ్యాచ్‌లు ఆడి 109 వికెట్లు పడగొట్టాడు. మాజీ కెప్టెన్ ధోని తరహాలోనే తాను కూడా నేర్చుకునే ప్రక్రియపైనే దృష్టి పెడతాను తప్ప ఫలితం గురించి ఆలోచించనని ఈ పేసర్ అన్నాడు. ఐపీఎల్లో కూడా అలా చేయడం వల్లే సానుకూల ఫలితాలు వచ్చాయని భువీ విశ్లేషించాడు. -
‘అతడు మంచి ఆల్ రౌండర్’
ముంబై: చివరి ఓవర్లలో తమ బౌలర్ల బౌలింగ్ పై కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ మనీశ్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరల్లో తమ బౌలర్లు లయ తప్పుతున్నారని, ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-10లో ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోల్ కతా బౌలర్లు చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకుని మ్యాచ్ చేజార్చుకున్నారు. ‘గుజరాత్ లయన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లోనూ చివరి ఓవర్లలో మా బౌలర్లు లయ తప్పారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ మరింత మెరుగుపడాల్సివుంది. బౌలర్లు క్రమం తప్పకుండా యార్కర్లు సంధిస్తే బ్యాట్స్ మన్ ఆడడానికి ఇబ్బంది పడతారు. అయితే చివరి ఓవర్లలో ముంబై బ్యాట్స్ మన్ బాగా ఆడారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ పదును తేలడానికి మరింత కష్టపడాల్సివుంది. ఈ సమస్యను అధిగమిస్తామ’ని పాండే అన్నారు. మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడుతూ... హార్ధిక పాండ్యా, నితీశ్ రాణా తమ నుంచి మ్యాచ్ లాగేసుకున్నారని వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి, మ్యాచ్ ను ఎలా ముగించాలో పాండ్యా చూపించాడని మెచ్చుకున్నాడు. అతడు మంచి ఆల్ రౌండర్ అని కితాబిచ్చాడు.