‘అతడు మంచి ఆల్ రౌండర్’
ముంబై: చివరి ఓవర్లలో తమ బౌలర్ల బౌలింగ్ పై కోల్ కతా నైట్ రైడర్స్ బ్యాట్స్ మన్ మనీశ్ పాండే అసంతృప్తి వ్యక్తం చేశాడు. చివరల్లో తమ బౌలర్లు లయ తప్పుతున్నారని, ఈ లోపాన్ని సరిదిద్దుకోవాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్-10లో ముంబై ఇండియన్స్ తో ఆదివారం జరిగిన లీగ్ మ్యాచ్ లో కోల్ కతా నాలుగు వికెట్ల తేడాతో ఓడిపోయింది. కోల్ కతా బౌలర్లు చివరి మూడు ఓవర్లలో 50 పరుగులు సమర్పించుకుని మ్యాచ్ చేజార్చుకున్నారు.
‘గుజరాత్ లయన్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లోనూ చివరి ఓవర్లలో మా బౌలర్లు లయ తప్పారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ మరింత మెరుగుపడాల్సివుంది. బౌలర్లు క్రమం తప్పకుండా యార్కర్లు సంధిస్తే బ్యాట్స్ మన్ ఆడడానికి ఇబ్బంది పడతారు. అయితే చివరి ఓవర్లలో ముంబై బ్యాట్స్ మన్ బాగా ఆడారు. డెత్ ఓవర్లలో మా బౌలింగ్ పదును తేలడానికి మరింత కష్టపడాల్సివుంది. ఈ సమస్యను అధిగమిస్తామ’ని పాండే అన్నారు.
మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు మీడియాతో మాట్లాడుతూ... హార్ధిక పాండ్యా, నితీశ్ రాణా తమ నుంచి మ్యాచ్ లాగేసుకున్నారని వ్యాఖ్యానించాడు. వీరిద్దరూ అద్భుతంగా ఆడారని ప్రశంసించాడు. ఏడో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి, మ్యాచ్ ను ఎలా ముగించాలో పాండ్యా చూపించాడని మెచ్చుకున్నాడు. అతడు మంచి ఆల్ రౌండర్ అని కితాబిచ్చాడు.