ఇష్టారాజ్యంగా జిల్లాలు: మల్లు రవి
సాక్షి, హైదరాబాద్: మార్గదర్శకాలు, నిర్దిష్టమైన విధివిధానాల్లేకుండా జిల్లాలను ఇష్టారాజ్యంగా విభజన చేస్తున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి, నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్య గౌడ్ విమర్శించారు. శుక్రవారం నాడిక్కడ విలేకరులతో వారు మాట్లాడుతూ జిల్లాల ఏర్పాటుపై హైపవర్ కమిటీని ఏర్పాటుచేసినా, దానికి పవర్ లేకుండా చేశారని ఆరోపించారు. మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్లను జిల్లా చేయాలని తాము కోరినట్టుగా మల్లు రవి వెల్లడించారు. దీనికోసం ఆమరణ దీక్ష చేస్తానని హెచ్చరించారు.
ఆరోగ్యశ్రీపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని, దీనివల్ల రాష్ట్రంలో పేదలు ఇబ్బందులకు గురవుతున్నారని రవి విమర్శించారు. జిల్లాల విభజన విషయంలో సీఎం కేసీఆర్ తీరు పిచ్చోడి చేతిలో రాయి అన్నట్టుగా మారిందని నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు బి.బిక్షమయ్య గౌడ్ విమర్శించారు.