Debt problems
-
అప్పుల బాధతో ముగ్గురు రైతుల ఆత్మహత్య
నర్మెట/నర్సింహులపేట/మహదేవపూర్: అప్పుల బాధతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ముగ్గురు రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వేసిన పంట నష్టపోగా, అప్పులు తీర్చే మార్గం కనిపించకపోవడంతో వీరు బలవన్మరణానికి పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. మృతుల్లో ఓ కౌలు రైతు ఉన్నాడు. వివరాలిలా ఉన్నాయి.. జనగామ జిల్లా నర్మెట మండలం ఆగాపేటలో నూనె రాజశేఖర్ (28) రెండెకరాల్లో పత్తి సాగు చేయగా, పంట దిగుబడి ఆశించినమేర రాలేదు. గతంలో పంటసాగుకోసం చేసిన అప్పుతోపాటు తాజా అప్పు రూ.3 లక్షలకు చేరుకుంది. దీనికితోడు ఇటీవల రాజశేఖర్‌కు ఆపరేషన్ జరిగింది. ఇందుకోసం మరో రూ.2 లక్షలు ఖర్చయ్యాయి. దీంతో అప్పులు తీర్చేదారి లేక మంగళవారం సెంట్రింగ్ కూలిపనికి వెళ్తున్నానని భార్యతో చెప్పి బయటకు వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి తిరిగి రాలేదు. బుధవారం గ్రామానికి సమీపంలో పురుగు మందుతాగి ఆత్మహత్యకు పాల్పడి నట్లు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యా ప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సదానందం తెలిపారు. మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం ఎర్రచక్రుతండాకు చెందిన జాటోతు బొద్యా (55) తనకున్న ఎకరం భూమిలో మిరప సాగు చేశాడు. సుమారు రూ.1.5 లక్షలు పెట్టుబడి పెట్టాడు. పంట అమ్మడంతో రూ.15వేలు మాత్రమే వచ్చాయి. అంతకుముందు కూతురు వివాహానికి రూ.4.5 లక్షలు అప్పు చేశాడు. దీంతో అప్పు తీర్చేదారిలేక మనస్తాపంతో బుధవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. రూ.10 లక్షల అప్పు తీర్చలేక.. భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం అంబట్పల్లికి చెందిన పుట్ట రవి (38) తనకున్న ఎకరంతోపాటు మరో నాలుగెకరాలు కౌలుకు తీసుకొని మిర్చి సాగు చేశాడు. కౌలుకోసం రూ.30 వేలతోపాటు పంట సాగుకు ఇప్పటి వరకు సుమారు రూ. 10 లక్షల వరకు అప్పు చేశాడు. కాగా, ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తోడు తెగుళ్లు సోకి పంట పూర్తిగా నాశనమైంది. దీంతో మనోవేదనకు గురైన రవి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రాజ్‌కుమార్ తెలిపారు. -
దారుణమా?
రైతులకు భరోసా! - రుణాల ఇబ్బందులపై ఫోన్ చేయండి - సమస్యలను తీరుస్తామని బ్యాంకర్ల హామీ - సెప్టెంబర్ 20లోగా వంద శాతం రుణాల పంపిణీ - రైతులకు ఎళ్లవేళలా అందుబాటులో ఉండండి - వ్యవసాయ అధికారులకు మంత్రి హరీశ్‌రావు ఆదేశం సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రైతన్నలూ మీరు పంట రుణాల కోసం బ్యాంకుల చుట్టూ తిరిగి.. తిరిగి అలిసిపోయారా? మీ పాత రుణాలు రీ షెడ్యూల్ కావడం లేదా? రుణాలు అడిగితే స్థానిక బ్యాంక్ మేనేజర్ రేపు మాపంటూ విసిగిస్తున్నారా? పంట అదును దాటిపోతున్నా రుణం చేతికందడం లేదా? బ్యాంకు అధికారుల తీరు మీకు ఇబ్బందికరంగా ఉందా? అయితే మీ ఖాతా ఏ బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకు అధికారులకు నేరుగా ఫోన్ చేయండి. ఫిర్యాదుల్ని వెంటనే పరిష్కరిస్తామని ఆయా బ్యాంకుల ఉన్నతాధికారులు భారీ నీటిపారుదల, మార్కెటింగ్ శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు హామీ ఇచ్చారు. రైతులు, ఎస్సీ, ఎస్టీ,బీసీ కార్పొరేషన్ లబ్ధిదారులు, మహిళా సంఘాలు ఎవరికైనా సరే రుణాలు ఇవ్వకుండా బ్యాంకర్లు ఇబ్బంది పెడితే తమకు ఒక్క ఫోన్ కొడితే స్పందిస్తామని, సెప్టెంబర్ 20 లోగా రైతు రుణాలను 100 శాతం పూర్తి చేస్తామని వారు మంత్రికి మాటిచ్చారు. గురువారం కలెక్టరేట్లో మంత్రి హరీశ్‌రావు జిల్లా ప్రజా ప్రతినిధులతో కలిసి బ్యాంకు, వ్యవసాయ శాఖ అధికారులతో పంట రుణాలు, రుణమాఫీ అమలుపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ ఏడాది రూ 1997.25 కోట్ల పంట రుణాలు అందించాల్సి ఉండగా.. బ్యాంకులు ఇప్పటి వరకు కేవలం రూ 241.57 కోట్లు మాత్రమే రైతులకు రుణాలు ఇచ్చాయి. రైతు రుణమాఫీ రెండవ ఫేజ్ కింద రాష్ట్రం విడుదల చేసిన రూ 485 కోట్లను బ్యాంకులు ఇప్పటి వరకు క్రెడిట్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తుండటం, మరో వైపు జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురుస్తుండటంతో మంత్రి అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. లీడ్ బ్యాంక్ అథమ స్థానం.. జిల్లాలో లీడ్ బ్యాంక్‌గా ఉన్న ఎస్బీఐ రైతుల పంట రుణాలు ఇవ్వడంతో అథమ స్థానంలో ఉంది. ఈ ఏడాది మొత్తం రూ. 580 కోట్ల టార్గెట్ ఇవ్వగా ఇప్పటి వరకు కేవలం రూ. 70 కోట్లు మాత్రమే రుణాలు అందించారు. అది కూడా అంకెల గారడీ చేసిన చూపిన లెక్కలే. దీనిపై హరీశ్‌రావు తీవ్రంగా స్పందించారు. లీడ్ బ్యాంక్ అధికారుల తీరుపై మండిపడ్డారు. బ్యాంకు అధికారులు క్షేత్ర స్థాయి పరిశీలనలు చేయకుండానే ఫీల్డు విజిట్ ఫీజు వసూలు చేస్తున్నారని, దీనితో పాటు ప్రాసెస్ ఫీజు కూడా వసూలు చేస్తున్నారని సిద్దిపేట వ్యవసాయ అధికారి అనిల్ కుమార్ ఫిర్యాదు చేశారు. అలాగే.. రైతులతో మొత్తం రుణాలు కట్టించుకొని వారి ఖాతాలు మూసివేసి, ఇక కొత్త రుణాలు ఇవ్వడం లేదని, రెండో ఫేజ్‌లో రైతుల ఖాతాలో పడిన డబ్బును కూడా తిరిగి ఇవ్వడం లేదని జహీరాబాద్ వ్యవసాయ అధికారి టీ ప్రవీణ, బ్యాంకుల్లో తగినంత సిబ్బంది లేక రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని గజ్వేల్ ఏడీఏ శ్రావణ్ కుమార్ ఫిర్యాదు చేశారు.వ్యవసాయ శాఖ అధికారులు లేవనెత్తిన సమస్యలకు సమాధానాలు చెప్పలేక బ్యాంకర్లు నీళ్లు నమిలారు. సాఫ్ట్ వేర్లో సమస్యలు ఉత్పన్నం అయ్యాయని మరో బ్యాంకు అధికారి, అధికారిక నిర్ణయాలకు సంబంధించిన ఉత్తర్వులు బ్రాంచ్ మేనేజర్ వరకు అందక పోవడంతో ఇబ్బంది ఏర్పడినట్లు మరొక బ్యాంక్.. రోజుకు రూ. నాలుగు కోట్లు ఇచ్చినా రుణాలు తరగటం లేదని మరో బ్యాంకు.. ఇలా ఎవరికి వారుగా తలో సాకు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేశారు. సెప్టెంబర్ 20 లోపు రుణాలు అందిస్తామని ఒక డెడ్‌లైన్ పెట్టుకున్నారు. దీంతో స్పందించిన హరీశ్‌రావు.. సెప్టెంబర్ 21న మరోసారి సమీక్షా సమావేశం నిర్వహిస్తామని, అప్పుడు 100 శాతం రుణాలు పంపిణీ చేసి, ఆయా నివేదికలతో రావాలని అధికారులకు చెప్పారు. రైతులకు సహకరించని బ్యాంకులపై చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు. రైతులకు అందుబాటులో ఉండాలి: మంత్రి హరీశ్‌రావు ‘జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. మరో వారం రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. వ్యవసాయ అధికారులు రైతులకు ఎరువులు, విత్తనాలు అందుబాటులో ఉంచాలి’ అని మంత్రి అన్నారు. వారం రోజుల పాటు అధికారులు స్థానికంగా ఉండాలన్నారు. కరువులో గుండె నిబ్బరం కోల్పోతున్న రైతాంగానికి ధైర్యం చెప్పాలని, వారిలో ఆత్మ విశ్వాసం పెంచే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. రైతులు ఇబ్బడిముబ్బడిగా బోర్లు వేసుకుని అప్పుల పాలవుతున్నారని, దీని నివారించే విధంగా రైతులకు నచ్చజెప్పాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న రైతుల ఇళ్లకు ప్రత్యేకంగా వెళ్లి ఈ ఏడాది వాళ్లు వేయాల్సిన పంటలు వివరాలు చెప్పి, ఎప్పటికప్పుడు వారి కుటుంబంలో ధైర్యం నూరిపోయాలని మంత్రి హరీశ్‌రావు సూచించారు. కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట, బాబూమోహన్, చింతాప్రభాకర్,గూడెం మహిపాల్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కిష్టారెడ్డి, ఎమ్మెల్సీలు సూధాకర్‌రెడ్డి, రాములు నాయక్, కలెక్టర్ తదితరులు పాల్గొన్నారు. ఎస్బీఐ ఏజీఎం 9949098409, ఆంధ్రా బ్యాంక్ డీజీఎం 9100105454 గ్రామీణ వికాస్ బ్యాంక్ ఏజీఎం 9440903949, లీడ్ బ్యాంక్ 9849530020 -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
వెల్దుర్తి(కర్నూలు జిల్లా): వర్షాలు లేకపోవడం, అప్పుల బాధతో ఉరివేసుకొని రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన బుధవారం కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం పిక్కిలివానిపల్లి గ్రామంలో జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన శివరాముడు(45)తన 8ఎకరాల పొలంలో వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కాగా, ఈ ఏడాది వర్షాలు సరిగా కురియకపోవడంతో పంట సాగు చేయలేదు. అయితే, గతంలో చేసిన రూ. 3లక్షల అప్పుకు వడ్డీ పెరిగిపోతుండటంతో మనస్తాపం చెందాడు. వర్షాలు లేక కొత్తగా పంటసాగు చేయలేని పరిస్థితిలో బుధవారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్య
అమరావతి: గుంటూరు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో అప్పుల బాధ తాళలేక దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన సోమవారం తెల్లవారు జామున చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన సాంబశివ రావు(49), భార్య కోటేశ్వరమ్మ నాలుగు ఎకరాల్లో మిరప, పత్తి పంట సాగు చేశారు. ఆయన ఆశించిన స్తాయిలో దిగుబడి రాలేదు. పంటల కోసం సాంబశివరావు రూ.4 లక్షలు పైగా అప్పు చేశారు. తీవ్ర మనస్తాపానికి గురైన దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అప్పుల బాధతో దంపతుల ఆత్మహత్యాయత్నం
భర్త మృతి..భార్యను రక్షించిన గ్రామస్తులు రంగారెడ్డి జిల్లా పెద్ద ఉమ్మెంతాలలో విషాద ం పూడూరు, న్యూస్‌లైన్: రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం పెద్ద ఉమ్మెంతాలలో దా‘రుణం’ చోటుచేసుకుంది. అప్పుల బాధ తాళలేక భర్త ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకోగా.. భార్య బావిలో దూకి ఆత్మహత్యాయత్నాకి పాల్పడింది. ఈ సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన వీరార్జున్‌రెడ్డి(38), లావణ్య(33) దంపతులు. వీరికి ఎకరం పొలం ఉంది. మరో నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకున్నారు. ఈ ఏడాది పత్తిపంట సాగు చేశారు. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఆశించిన దిగుబడి రాలేదు. పెట్టుబడితో పాటు ఇద్దరు కూతుళ్ల వివాహం కోసం వారు రూ. 2లక్షలకు పైగా అప్పులు చేశారు. పంట ఆశించిన స్థాయిలో పండక పోవడంతో భార్యాభర్తలు తీవ్ర మనస్తాపం చెందారు. దీనికి తోడు ఇటీవల డబ్బులు ఇవ్వాలని రుణదాతలు వేధించసాగారు. ఎప్పటిలాగే శుక్రవారం వీరార్జున్‌రెడ్డి పొలానికి వెళ్లాడు. ఒంటరిగా ఉన్న లావణ్య గ్రామ శివారులోని ఓ చేదు బావిలో దూకింది. స్థానికులు గమనించి ఆమెను రక్షించారు. విషయం చెప్పేందుకు స్థానికులు వీరార్జున్‌రెడ్డి కోసం పొలానికి వెళ్లగా రాకంచర్ల రహదారిలోని ఓ మామిడితోటలోని చెట్టుకు ఓ వ్యక్తి మృతదేహంగా వేలాడుతూ కనిపించాడు. కేసు దర్యాప్తులో ఉంది.